Ration Cards | కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జనవరి 26 నుంచి కొత్తగా పలు సంక్షేమ పథకాలు ప్రారంభిస్తామని చెబుతున్న ప్రభుత్వ తీరు చూస్తే పేదలకు సంక్షేమ పథకాలు ఎలా అందించాలనే దాని కంటే కోతలు ఎలా పెట్టాలనే చూస్తున్నట్లుందని అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అందరికి పరమాన్నం అని చెప్పి, అధికారంలోకి రాగానే పంగ నామాలు పెడుతున్నడని మండిపడ్డారు.
ఆరు గ్యారెంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి అమలు కాలేదని.. చివరి హామీ చేయూతకు దిక్కు లేదని హరీశ్‌రావు విమర్శించారు. మధ్యలో ఉన్న అన్ని హామీలదీ దాదాపు అదే పరిస్థితి అని.. అన్నింట్లో కోతల విధింపే అని అన్నారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మోసం చేసింది చాలదన్నట్లుగా.. జనవరి 26 రాజ్యాంగం అమలు లోకి వచ్చిన రోజున ప్రారంభించే కార్యక్రమాల్లోనూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇది చాలా దుర్మార్గమని మండిపడ్డారు. ప్రజలు తీవ్ర ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారని అన్నారు. పాపం రేవంత్ రెడ్డిది అయితే.. శాపం అధికారులకా అని ప్రశ్నించారు.
రేషన్ కార్డుల విషయంలో రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తున్నామని హరీశ్‌రావు తెలిపారు. రేషన్ కార్డుల ఎంపిక గ్రామాల్లోనే జరగాలని డిమాండ్ చేశారు. కులగణన సర్వేకు రేషన్ కార్డులకు ఎందుకు ముడిపెట్టారని ప్రశ్నించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు ఇవ్వరా అని నిలదీశారు. కుల గణన సర్వేను బేస్ చేసుకొని, ఆ లిస్టును మాత్రమే ప్రింట్ తీసి గ్రామాలకు పంపించారని అన్నారు. ఆన్ లైన్లో మీ సేవలో కొన్ని లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారని గుర్తుచేశారు. ప్రజా పాలన సమయంలోనూ దరఖాస్తులు చేశారని తెలిపారు. ఆ దరఖాస్తులు అన్నింటినీ చెత్తబుట్టలో వేశారని అన్నారు. ప్రజాపాలనలో 11లక్షల దరఖాస్తులు వస్తే ఎందుకు పరిశీలించడం లేదని ప్రశ్నించారు. మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను ఎందుకు పరిశీలించడం లేదని నిలదీశారు. కుల గణన సర్వే చేసేటప్పుడు ఇది ఆప్షనల్ మాత్రమే.. బలవంతం లేదని.. ఇష్టం ఉన్న వారు మాత్రమే పాల్గొనవచ్చని చెప్పారు కదా అని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం దాన్ని బేస్ చేసుకొని అర్హులకు రేషన్ కార్డులు రాకుండా కోతలు పెడుతున్నరని మండిపడ్డారు..
తన సిద్దిపేట నియోజకవర్గం నంగునూరులో, గట్ల మల్యాల గ్రామంలో 110 మంది ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టారని.. లిస్టులో 40 మంది పేర్లు మాత్రమే ఉన్నాయని హరీశ్‌రావు తెలిపారు. అధికారులను అడిగితే హైదరాబాద్ నుంచి పేర్లు వచ్చాయి. మాకేం తెల్వదని అంటున్నారని పేర్కొన్నారు. ఈవిషయంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆందోళనలో ఉన్నరని అన్నారు. రేషన్ కార్డుల విషయంలో తమపై ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 6,47,479 రేషన్ కార్డులును ఇచ్చామని తెలిపారు. 20,69,033 మంది లబ్ధిదారులు అదనంగా రేషన్ ఇచ్చినమని చెప్పారు. నిరుపేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలని కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆలోచించి.. ఆదాయ పరిమితిని సడలించారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయ పరిమితి గ్రామీణంలో 60వేలు, పట్టణంలో 75వేలు ఉంటే, దాన్ని గ్రామీణంలో లక్షా 50వేలకు, పట్టణంలో 2.50 లక్షలకు పెంచారని చెప్పారు. అంగన్ వాడీలు, ఆశాలు, ప్రైవేటు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, పేద వర్గాలకు లాభం జరగాలని నిర్ణయం తీసుకున్నరని పేర్కొన్నారు. ఎక్కువ మందికి ఇవ్వాలనే ఆలోచన మాది.. ఎక్కువ మందికి కోత పెట్టే ఆలోచన మీది అని విమర్శించారు.
గడిచిన పదేళ్లలో ద్రవ్యోల్బణం ప్రతి సంవత్సరానికి సగటున 5.42 శాతం ఉందని.. పదేండ్లకు గానూ సుమారు 69.60 శాతం ద్రవ్యోల్బణం రికార్డు అయినట్లుగా OECD & World Bank స్పష్టం చేసిందని హరీశ్‌రావు తెలిపారు. దీని ప్రకారం, 1.7 రెట్లు ధరలు పెరుగుదల నమోదైందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో లక్షా 50వేల ఆదాయ పరిమితిని, ద్రవ్యోల్బణం ప్రకారం గుణిస్తే 2.55లక్షలు అని తేలుతుంది. అంటే ఆనాటి లక్షా 50వేలు, ఈ నాటి 2.55లక్షలతో సమానమని వివరించారు. అదే విధంగా పట్టణ ప్రాంత 2 లక్షల ఆదాయ పరిమితిని, ద్రవ్యోల్బణం ప్రకారం గుణిస్తే 3.40లక్షలు అని తేలుతుంది. అంటే ఆనాటి లక్షల ఆదాయం, నేటి 3.40లక్షలకు సమానమని తెలిపారు. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని అనుసరించి రేషన్ కార్డుల కోసం కుటుంబ ఆదాయ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో 2.55లక్షలుగా, పట్టణ ప్రాంతాల్లో 3.40లక్షలుగా సవరించి పెంచాలని, తద్వారా పేదలందరికీ లబ్ది చేకూరే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అభయహస్తం మేనిఫెస్టోలో రేషన్ కార్డులపై సన్నబియ్యం సరఫరా చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చి 400 రోజులు గడుస్తున్నా అతీగతీ లేదని హరీశ్‌రావు విమర్శించారు. మేనిఫెస్టోలో మేము పెట్టక పోయినప్పటికీ రేషన్ కార్డు ద్వారా కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి ఇచ్చే బియ్యాన్ని 4కేజీల నుంచి 6కేజీలకు పెంచామని తెలిపారు. కుటుంబానికి 20కేజీలే ఉన్న పరిమితిని ఎత్తివేసి, ఎంతమంది ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి 6 కేజీలు ఇచ్చామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టకపోయినా తెలంగాణ ఏర్పడిన ఆరు నెలల్లోనే 1.1.2015 నుంచి మధ్యాహ్న భోజనం, గురుకులాలు, హాస్టళ్లకు సన్న బియ్యం సరఫరా చేశామన్నారు. ప్రతి ఏటా రెండు లక్షల 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేసి, సన్న బియ్యంతో విద్యార్థులకు అన్నం పెట్టామన్నారు.
పది సంవత్సరాల క్రితం ఉన్న నిబంధనలో ఎలాంటి మార్పులు చేయకుండా, అవే నిబంధనలతో కొనసాగించడం వల్ల ఎన్నో కుటుంబాలు రేషన్ కార్డు అర్హత కోల్పోతున్నాయని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదాహరణకు 2014లో అంగన్ వాడీల వేతనం రూ.4200 ఉండేది. కేసీఆర్ ప్రభుత్వం మూడు దఫాలుగా పెంచి వారి వేతనాన్ని రూ. 13,650కి చేర్చిందని అన్నారు. 2014లో వీరి వార్షికాదాయం 50,400 ఉండగా, పెరిగిన వేతనం ప్రకారం ఇప్పుడు వారి వార్షికాదాయం రూ. 1,63,800. రేషన్ కార్డుల జారీలో 2014 నిబంధనలను అనుసరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతీ అంగన్ వాడీకి రేషన్ కార్డులు రానట్లే అని వివరించారు. అదే విధంగా ఆశాలు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, చిరు ఉద్యోగులకు మీ ప్రభుత్వ అశాస్త్రీయ నిబంధనల వల్ల రేషన్ కార్డులు రాని దుస్థితి నెలకొందని అన్నారు.
పేదలను రేషన్ కార్డులకు దూరం చేసే కుట్ర కాంగ్రెస్ చేస్తున్నదని హరీశ్‌రావు మండిపడ్డారు. పెరిగిన ధరలకు అనుగుణంగా అర్హత పరిమితిని పెంచి పేదలకు లాభం చేయాలని డిమాండ్ చేశారు. 28వ తేదీ నుంచి గ్రామ సభల్లో రేషన్ కార్డుల గురించి ప్రశ్నించాలని.. ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. అర్హులకు రేషన్ కార్డులు వచ్చే దాకా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. మళ్లీ దరఖాస్తులు పెట్టాలని అంటున్నారని.. ఏడాది కిందట పెట్టిన దరఖాస్తుల పరిస్థితి ఏంటని నిలదీశారు. షరతులు లేకుండా మీ సేవ, ప్రజాపాలన, కుటుంబ సర్వే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుని అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.