ఇలా అనుకుందాం.. ఓ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రితోపాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల, సిబ్బంది అంతా అక్కడే, ఆ ఆవరణలోనే ఉన్నారు. ఇంతలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం ఓ విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. కమిషన్ ముందు ముఖ్యమంత్రితోపాటు అందరూ హాజరై తమ వాదనలు వినిపించారు.
విచారణ పూర్తయిన అనంతరం కమిషన్ ఒక నిర్ధారణకు వస్తూ.. ‘ముఖ్యమంత్రే అసెంబ్లీ భవనానికి నిప్పు పెట్టారు’ అని తేల్చింది. అయితే, ఈ నిర్ణయానికి రావడానికి ముందు ఆ కమిషన్ సీఎంకు ఒక అవకాశం కల్పిస్తూ.. ‘మిమ్మల్ని దోషిగా ఖరారు చేయబోతున్నాము. మీరు ఇందుకు అంగీకరిస్తారా? లేక నిర్దోషినని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారా’ అని అడగాలి. అది సహజ న్యాయసూత్రం. అలా అడగకుండా ఏకపక్షంగా నివేదికల పేర తీర్పులివ్వడం చట్టవిరుద్ధం. అలాంటి విచారణ కమిషన్ల నివేదికలు నిష్ఫలం, నిరర్ధకం అని రెండు కేసుల్లో సుప్రీంకోర్టు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులు తేల్చిచెప్పాయి.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది. తన నివేదికలో మాజీ సీఎం కేసీఆర్‌ను తప్పుపట్టింది. ఆయనను విచారణలో భాగంగా వివరాల సేకరణ కోసం పిలిచారే తప్ప.. ‘మిమ్మల్ని దోషిగా ఖరారు చేయబోతున్నాం, అంగీకరిస్తారా? నిర్దోషిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తారా?’ అని ప్రశ్నించలేదు. కనీసం ఆరోపణలు చేసిన వారిని క్రాస్ ఎగ్జామిన్ చేయలేదు. దీన్నిబట్టే పీసీ ఘోష్ కమిషన్ పనితీరు ఎలా సాగిందో, నివేదికకు ఉన్న ప్రామాణికత ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టంలోని సెక్షన్ 8(బీ) ప్రకారం.. కమిషన్ ఎవరినైతే దోషులుగా తేల్చబోతున్నదో వారికి తమ వాదన వినిపించుకొనేందుకు, వారి నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలి. ఆ మేరకు నోటీసులు ఇవ్వాలి.
విచారణకు కారణమైన అంశాలపై ఆరోపణలు చేసిన వ్యక్తులను కమిషన్.. క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి.
విచారణ కమిషన్ కనుగొన్న అంశాలలోని మంచీచెడులు ఏమైనప్పటికీ, అది చట్టంలోని న్యాయసూత్రాలను పాటించనందున.. కోర్టులు పదేపదే చెప్పిన అంశాలను పట్టించుకోనందున.. అది ఇచ్చే నివేదిక నిరుపయోగమైనదిగా మిగిలిపోక తప్పదు!
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన 665 పేజీల నివేదిక చట్టం దృష్టిలో చెల్లదని.. అది నిరర్ధకం, నిష్ఫలమైదనని న్యా య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కమిషన్ తన విచారణ ప్రక్రియలోనే ప్రాథమికమైన తప్పిదాలకు పాల్పడిందని పేర్కొంటున్నారు. కమిషన్ ఎవరినైతే దోషులుగా తేల్చబోతున్నదో వారికి తమ వాదన వినిపించుకొనే అవకాశం ఇవ్వాలని, అలాగే వారిపై ఆరోపణలు చేసిన వ్యక్తులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని.. కానీ, ఘోష్ కమిషన్ ఈ రెండింటినీ విస్మరించిందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఇందుకు గతంలో జరిగిన రెండు ఘటనలను ఉదహరిస్తున్నారు.
కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్‌లోని సెక్షన్ 8(బీ) ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వాలని, అలాగే వారిపై ఆరోపణలు చేసిన వారిని క్రాస్ ఎగ్జామిన్ చేయాలని 2003 నాటి ఒక కేసులో సుప్రీంకోర్టు సూత్రీకరించింది. ఇదే తీర్పు ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సైతం 2014లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్ బాలసుబ్రమణ్యం కేసులో ఇదే విషయాన్ని పునరుద్ఘాటించింది.
పీసీ ఘోష్ కమిషన్ విచారణకూ ఇదే వరిస్తుందని న్యాయనిపుణులు చెప్తున్నారు. ఆ దిశగా విచారణ సాగనందున.. ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పనికిరాదని వారంటున్నారు. ఈ మేరకు న్యాయనిపుణుల వాదనను జోడిస్తూ ‘సౌత్ ఫస్ట్’ వార్తాసంస్థ సంచలన వార్తా కథనాన్ని ప్రచురించింది. సౌత్‌ఫస్ట్ వ్యవస్థాపక సీఈవో జీ వాసు రాసిన తాజా కథనం.. రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. చట్టపరమైన అంశాలను, విచారణ కమిషన్లు వ్యవహరించాల్సిన తీరుపై గతంలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను వాసు విపులంగా ప్రస్తావించారు. ఘోష్ నివేదికలోని డొల్ల తనాన్ని ఎండగడుతూ.. ఆ వార్తా కథనం ఇలా సాగింది.
ఘోష్ కమిషన్ తన నివేదికలో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఇరిగేషన్‌శాఖ మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, పలువురు అధికారులను తప్పు పట్టింది. సలహాలు, సూచనల రూపంలో ఉన్న కమిషన్ రిపోర్టును ఆమోదించిన కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గం, దీనిపై అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చి చర్చిస్తామని, ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపింది.
కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్-1952లోని సెక్షన్-4 ప్రకారం.. విచారణ కమిషన్‌కు దేశంలోని ఏ వ్యక్తినైనా తన వద్దకు పిలిపించుకొని, వారితో ప్రమాణం చేయించి, వారిని ప్రశ్నించే అధికారం ఉంటుంది. వారి నుంచి సాక్ష్యాధారాలను/పత్రాలను పొందే అధికారంతోపాటు కోర్టులు లేదా కార్యాలయాల నుంచి అవసరమైన రికార్డులను, కాపీలను కూడా పొందే అధికారం కలిగి ఉంటుంది. ఈ అధికారాన్ని ఉపయోగించుకొని ఘోష్ కమిషన్ కేసీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌తోపాటు మరికొందరు అధికారులను తన వద్దకు పిలిపించుకొని విచారణ జరిపింది. ఈ ముగ్గురు కమిషన్ ఎదుట హాజరై.. ఘోష్ సంధించిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలిచ్చారు. ఈ సమాధానాలతోపాటు, కమిషన్‌కు లభించిన ఇతర సమాచారం ఆధారంగా, పలువురు వ్యక్తులను ప్రశ్నించిన అనంతరం కమిషన్ కొన్ని నిర్ధారణలకు వచ్చింది. అయితే ఇక్కడే విధానపరమైన లోపం చోటుచేసుకున్నదని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. కమిషన్ తన వద్దకు పిలిపించుకున్న వారిని ప్రశ్నించిన అనంతరం.. వారు ఇచ్చిన సమాధానాలను బట్టి, తనవద్దనున్న పత్రాలు, రికార్డుల ఆధారంగా వారిని దోషులుగా నిర్ధారించేందుకు లేదా జరిగిన అవకతవకలకు వారిని జవాబుదారీగా చేసేందుకు సెక్షన్ 8(బీ) ప్రకారం తాజాగా వారికి మరో నోటీసు ఇవ్వాల్సి ఉండిందని నిపుణులు గుర్తుచేస్తున్నారు. అయితే కేసీఆర్, హరీశ్, ఈటల విషయంలో అదేమీ జరగలేదని, ఘోష్ కమిషన్ ఈ విషయంలో విఫలమైందని వారు ఎత్తి చూపుతున్నారు.
ఎల్కే అద్వానీ వర్సెస్ బీహార్ కేసులోనూ ఈ తరహా కమిషన్ విచారణను సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ఆ కేసులో సుప్రీంకోర్టు.. ‘కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్‌ను ఆమోదించిన 20 ఏండ్ల తరువాత సెక్షన్-8(బీ) రూపంలో ఒక సవరణను తెచ్చారన్న విషయాన్ని గమనించాలి. ఏ వ్యక్తిపైనైతే కమిషన్ విచారణ జరుపుతున్నదో.. అతడి ప్రవర్తనపై దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని భావించినా లేదా ఈ విచారణ ఫలితంగా అతని పరువుప్రతిష్ఠలు దెబ్బతింటాయని తలంచినా ముందుగా నోటీసు ఇవ్వాల్సిన అవసరం ఉందని పార్లమెంటు భావించి ఉండవచ్చు. అందుకే సెక్షన్-8(బీ) సవరణ తీసుకువచ్చింది. దాని ప్రకారం..
విచారణను ఎదుర్కొంటున్న వ్యక్తికి తన వాదన వినిపించుకోవడానికి, తన వాదనకు తోడుగా సాక్ష్యాధారాలను సమర్పించడానికి సహేతుకమైన అవకాశం కూడా లభించింది. ఆ విధంగా సహజ న్యాయసూత్రాలు చట్టబద్ధమైన నిబంధన రూపంలో చేర్చబడినాయి. ఈ నేపథ్యంలో కమిషన్ ఎవరికి వ్యతిరేకంగానైనా ఏదైనా వ్యాఖ్య లేదా అభిప్రాయం వ్యక్తం చేయడానికి ముందు.. అతనికి ఒక అవకాశం ఇవ్వడం దాని బాధ్యత.
సహజ న్యాయసూత్రాలను అమలు చేయడంలో విఫలమైతే.. కమిషన్ చేపట్టిన కార్యం నిష్ఫలమవుతుందని, దాని పర్యవసానం కూడా అదే రీతిలో ఉంటుందని చెప్పనవసరం లేదు’ అని సుప్రీంకోర్టు నాడు వ్యాఖ్యలు చేసింది.
గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం 2005లో రిటైర్డ్ హైకోర్టు జడ్జి టీహెచ్బీ చలపతి నేతృత్వంలో ఒక విచారణ కమిషన్‌ను నియమించింది. అంతకుముందున్న చంద్రబాబు ప్రభుత్వం కుప్పంలో ఓ డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రైవేటు కన్సల్టెన్సీకి అప్పగించడంలో జరిగిన అవకతవకలపై విచారణకు ఈ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో సీఎంవో కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేసిన బాలసుబ్రమణ్యంతోపాటు మరికొందరు అధికారులను దోషులుగా పేర్కొంటూ ఆ కమిషన్ నివేదిక సమర్పించింది. పలుమార్లు కమిషన్ ముందు హాజరైనప్పటికీ సెక్షన్-8(బీ) కింద తనకు నోటీసు ఇవ్వలేదంటూ బాలసుబ్రమణ్యం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఏ రామలింగేశ్వరరావు.. అంతకుముందు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపైనే ఆధారపడ్డారు. ‘న్యాయసూత్రాలను బట్టి, ఓ వ్యక్తి (బాలసుబ్రమణ్యం)కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే ముందు అతనికి నోటీసు ఇవ్వకపోవడం వల్ల, అతనికి వ్యతిరేకంగా కమిషన్ ఇచ్చిన విచారణ నివేదిక నిష్ఫలమైనది’ అని జస్టిస్ రామలింగేశ్వరరావు తన తీర్పులో స్పష్టంచేశారు.
కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం, సెక్షన్-8బీ ప్రకారం.. ‘విచారణలో ప్రతికూలంగా ప్రభావితమయ్యే (దోషులుగా నిర్ధారణయ్యే) వ్యక్తుల వాదన వినాలి. ఎప్పుడంటే.. విచారణ జరుగుతున్న సమయంలో ఏ దశలోనైనా కమిషన్ సదరు వ్యక్తి ప్రవర్తనపై దర్యాప్తు తప్పనిసరి అని భావించినప్పుడు గానీ లేదా తమ విచారణ కారణంగా ఏ వ్యక్తి పరువుప్రతిష్ఠలపై ప్రతికూల ప్రభావం పడుతుందని అభిప్రాయపడినప్పుడుగానీ కమిషన్ ఆ వ్యక్తికి తన వాదన వినిపించేందుకు తగిన అవకాశం ఇవ్వాలి. తాను నిర్దోషినని నిరూపించుకొనేందుకు తగిన సాక్ష్యాధారాలను సమర్పించే అవకాశం ఇవ్వాలి’
కీలకమైన సెక్షన్ 8(బీ) ప్రకారం చూస్తే ఘోష్ కమిషన్ నివేదిక చెల్లబోదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. విచారణ దశలోనే కమిషన్ తప్పిదాలు చేసినందున నివేదిక పసలేనిదిగా మారిందని వారంటున్నారు. అద్వానీ, చలపతి కమిషన్ ఉదంతాల్లో జరిగినట్టుగానే ఘోష్ కమిషన్ నివేదికకూ అదే గతి పట్టవచ్చని ‘సౌత్ ఫస్ట్’ తన కథనంలో పేర్కొన్నది. కమిషన్ కనుగొన్న అంశాలలోని మంచి, చెడులు ఏమైనప్పటికీ, అది చట్టంలోని న్యాయసూత్రాలను పాటించనందుకు, కోర్టులు పదేపదే చెప్పిన అంశాలను పట్టించుకోనందుకు దాని నివేదికను ‘బుట్టదాఖలు’ చేయవచ్చు అని నిపుణులు పేర్కొన్నారని తెలిపింది.