హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : ఆరోగ్యశ్రీ బడ్జెట్ ఎందుకు పెరుగడంలేదని శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు సర్కార్‌ను నిలదీశారు. ఈ పథకాన్ని రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచితే బడ్జెట్ పెరుగాల్సింది పోయి, ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ రూ.1,067 కోట్లు కేటాయిస్తే, కాంగ్రెస్ 2024-25లో రూ.971కోట్లే కేటాయించిందని పేర్కొన్నారు. తాము 607 మందికి రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తింపజేశామని, అదే కాంగ్రెస్ రూ.10 లక్షలకు పెంచిన తర్వాత 496 మంది మాత్రమే లబ్ధిపొందినట్టు చెప్పారు.
కాంగ్రెస్ పాలనలో పెరిగిన బకాయిలు..
కాంగ్రెస్ పాలనలో ఆరోగ్యశ్రీ బకాయిలు పెరిగాయని హరీష్‌రావు ఆరోపించారు. గురువారం అసెంబ్లీలో విలేకరులతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. 2014 జూన్ నాటికి ఆరోగ్యశ్రీ బిల్లులు నెలకు రూ.32 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యేవని తెలిపారు. 2023 నాటికి ఈ ఖర్చు రూ.68 కోట్లకు పెరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.89 కోట్లు అయినట్టు చెప్పుకుంటున్నదని, ఇది సహజ పెరుగుదల మాత్రమే తప్ప ఇంకేమీ కాదని పేర్కొన్నారు.
దవాఖానల బాధ్యతలు గ్రూప్ అధికారులకు : సీఎం
హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని దవాఖానల నిర్వహణ విధానంలో మార్పులు తీసుకురాన్నున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. దవాఖానల నిర్వహణ విధుల నుంచి వైద్యులకు విముక్తి కల్పిస్తామని శాననసభ ప్రశ్నోత్తరాల్లో సీ ఎం వెల్లడించారు. దవాఖానల బాధ్యతలను గ్రూప్-1, లేదా గ్రూప్-2 అధికారులకు అప్పగిస్తామని స్పష్టంచేశారు. తాము అధికారం చేపట్టాక రూ.2,408.51 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించాం’ అని వివరించారు.
ప్రసవాల కోసం మళ్లీ ప్రైవేట్ దవాఖానలకు..: సంజయ్
గర్భిణులు ప్రసవాల కోసం మళ్లీ ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయించే రోజులోచ్చాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అసెంబ్లీలో ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు 61 శాతముంటే, ఇప్పుడు అది 50 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్‌ను పురుద్ధరించాలని, కావాలంటే ఇందిరమ్మ కిట్ అని పేరుపెట్టినా తమకు అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. ఐసీయూను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
మిగిలిన 30% పనులు పూర్తిచేయాలి: వేముల
కాళేశ్వరం ప్యాకేజీ 20, 21, 21-ఏ ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్ జిల్లాలో మిగతా 30% పనులు పూర్తిచేయాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రాజెక్టు కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.4,800 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ.3,300 కోట్లు ఖర్చు చేసి 70% పనులు పూర్తి చేశారని, మిగిలిన 30% పూర్తి చేస్తే రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు.
ఆస్తిపన్ను వడ్డీ రాయితీ ఇవ్వాలి: గంగుల
జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను బకాయిలపై 90% వడ్డీ రాయితీ ఇస్తూ ప్రవేశపెట్టిన వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు వర్తింపజేయాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభుత్వాన్ని కోరారు.
చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి: పల్లా
గతంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ, చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ఎందుకు ప్రకటించడంలేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఎలా? అని నిలదీశారు. ఈ డివిజన్ ఏర్పాటు స్థానిక ప్రజల చిరకాల వాంఛ అని, దీనివల్ల పరిపాలనా సౌలభ్యంతోపాటు ఆ ప్రాంత అభివృద్ధి వేగవంతం అవుతుందని చెప్పారు.
కేసీఆర్ పాలనలో స్వర్ణయుగం : సునీతా లక్ష్మారెడ్డి
కేసీఆర్ పాలనలో పల్లెలకు స్వర్ణయుగమని నర్సంపేట ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అభివర్ణించారు. పల్లె ప్రగతి, హరితహారం, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతో గ్రామాలు అభివృద్ధిలో కొత్తపుంతలు తొక్కాయని పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో ఆమె మాట్లాడారు. గ్రామాల అభివృద్ధిలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పల్లెల్లో వెలుగులు విరజిమ్మితే రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అంధకారంలో మగ్గుతున్నాయని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన హరితహారం వల్ల రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని, రాష్ర్టానికి పలు అవార్డులు కూడా వచ్చాయన్నారు. నిధులు లేకపోవడంవల్ల గ్రామాల్లో అభివృదకుంటుపడుతున్నదన్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా, అధి కారులకు నోటీసులు జారీ చేస్తున్నదని ఎద్దేవా చేశారు. పాత సర్పంచ్‌లు పెండింగు బిల్లుల కోసం ఎదురుచూస్తుంటే, కొత్త సర్పంచ్‌లు నిధులకోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు.
మెట్రోను పొడిగించాలి: చింతా ప్రభాకర్
హైదరాబాద్ నగరవాసుల సౌకర్యార్థం, కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో ప్రకటించిన మేరకు మెట్రో రైలు వ్యవస్థను పొడిగించాలని సంగారెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు, మైండ్‌స్పేస్ నుంచి శంషాబాద్ వరకు, శంషాబాద్ నుంచి కందుకూరు వరకు పొడిగించాలని కోరారు.