సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరం, దాని పరిసర ప్రాంతాల్లోని సామాన్య, మధ్యతరగతి ప్రజలను 22-ఏ (నిషేధిత భూముల) నిబంధన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దశాబ్దాల కిందట కష్టపడి సొంత స్థలాలు కొనుగోలు చేసి, ప్రభుత్వ అనుమతులు పొంది, జీవోల ప్రకారం క్రమబద్ధీకరించుకున్న (రెగ్యులరైజ్) ఆస్తులను కూడా రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యంగా నిషేధిత జాబితాలో చేర్చడంపై బాధితులు, పౌరులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ పరిసరాల్లో దాదాపు 18 వేల ఎకరాల సీలింగ్ భూములు ఉండగా, గతంలో ప్రభుత్వం జారీ చేసిన వివిధ జీవోల ద్వారా వేలాది మంది ప్రజలు డబ్బులు చెల్లించి తమ ఇండ్లు, స్థలాలను క్రమబద్ధీకరించుకున్నారు.
అయితే ఇటీవల రెవెన్యూ అధికారులు ఎలాంటి క్షేత్రస్థాయి సర్వేలు చేయకుండా, కళ్లు మూసుకొని ఆ సర్వే నంబర్లన్నింటినీ ఏకమొత్తంగా 22ఏ(1)(డీ) జాబితాలో చేర్చేశారు. దీంతో అత్యవసర సమయాల్లో ఆస్తులు అమ్ముకోలేక, రిజిస్ట్రేషన్లు కాక బాధితులు ఆవేదన చెందుతున్నారు. మేడ్చల్-మలాజిగిరి జిల్లా కాప్రా మండలం చర్లపల్లి పరిధిలోని బీఎన్‌రెడ్డి నగర్ కాలనీ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. 150 ఎకరాల సీలింగ్ భూమిలోని 1800 ప్లాట్లలో (సర్వే నంబర్లు 229 నుంచి 246) సగం ఇళ్లు ఇప్పటికే క్రమబద్ధీకరణ పూర్తయ్యాయి.
అయినప్పటికీ అధికారులు మొత్తం సర్వే నంబర్లన్నింటినీ నిషిద్ధ జాబితాలో పెట్టేశారు. ఒక ఈ కాలనీయే కాకుండా మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని అనేక బస్తీలు, అపార్ట్మెంట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాగా, సమస్య త్వరలోనే పరిషరిస్తామని చెప్తున్న రెవెన్యూ శాఖ, గత ప్రభుత్వంపై నెపం నెట్టి బాధ్యతల నుంచి తప్పుకోవడం సరికాదని అర్బన్ డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్ ఎం. శ్రీనివాస్ విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి క్రమబద్ధీకరించబడిన ఆస్తులను, సామాన్యుల నివాస స్థలాలను 22-ఏ నిషిద్ధ జాబితా నుంచి మినహాయించాలని, లేనిపక్షంలో బాధితులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు.