(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): 63 కోర్టు ధిక్కరణ కేసులను ఎదుర్కొంటూ పలుమార్లు హైకోర్టు ఆగ్రహానికి గురైన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీరు ఇప్పటికీ మారడం లేదు. బుల్డోజర్ ధ్వంసరచనను ఆయన సమర్థించుకొంటూనే ఉన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తున్నానంటూ చెప్పుకొచ్చిన రంగనాథ్.. న్యాయస్థానానికి డిఫరెంట్ ఒపీనియన్ ఉన్నదంటూ తాజాగా సుమన్ టీవీతో జరిపిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రంగనాథ్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
63 కోర్టు ధిక్కరణ కేసులు ఎందుకు నమోదయ్యాయన్న యాంకర్ స్వప్న ప్రశ్నకు రంగనాథ్ సమాధానమిస్తూ.. భూకబ్జాదారులే ఆ కేసులు వేశారని, కొందరు అధికారులు కోర్టును తప్పుదోవ పట్టించినట్టు పేర్కొన్నారు. కోర్టు వాటిని పరిగణనలోకి తీసుకోలేదా? అన్న యాంకర్ ప్రశ్నకు బదులిస్తూ.. ‘కోర్టుకు డిఫరెంట్ ఒపీనియన్ ఉన్నదంటూ వ్యాఖ్యానించిన ఆయన అప్పీల్‌కు వెళ్తామని చెప్పారు. దుర్గం చెరువు వద్ద ఉన్న సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి ఇచ్చిన నోటీసులపై రంగనాథ్ స్పందిస్తూ.. అసలు తిరుపతిరెడ్డికి నోటీసులే ఇవ్వలేదని చెప్పారు. దుర్గం చెరువు బఫర్ జోన్లో 1,000 వరకు ఇండ్లు ఉ న్నాయని, అలా అయితే అందరికీ నోటీసులు ఇవ్వాలని చెప్పారు. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఉన్నప్పటికీ కట్టిన ఇండ్లకు తా ము నోటీసులు ఇవ్వట్లేదని పేర్కొన్నారు.