
హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): సీనియర్ జర్నలిస్టు, ది ప్రింట్ వ్యవస్థాపకుడు శేఖర్‌గుప్తా, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు మధ్య ఆదివారం ట్విట్టర్లో ఆసక్తికర చర్చ జరిగింది. తెలంగాణలో అమలవుతున్న ఇంటింటికీ మంచినీటి సరఫరా, డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాలను మెచ్చుకొన్న శేఖర్‌గుప్తా.. మంచినీటి సరఫరాలో ఉత్తరప్రదేశ్ ఎందుకు వెనుకబడిందని మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ తాగునీటిని అందించాలన్న లక్ష్యంలో 45 శాతాన్ని నరేంద్రమోదీ ప్రభుత్వం సాధించిందని, గోవా, తెలంగాణ, హర్యానా రాష్ర్టాలు వంద శాతం గృహాలకు మంచినీటిని సరఫరా చేస్తున్నాయని తొలుత శేఖర్‌గుప్తా ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. తెలంగాణలో అమలుచేస్తున్న మిషన్ భగీరథ పథకం స్ఫూర్తితో ప్రధాని మోదీ హర్ ఘర్ జల్‌ను ప్రారంభించారని, మరో 11 రాష్ర్టాలు దీనిని స్ఫూర్తిగా తీసుకొన్నాయని రిప్లయ్ ఇచ్చారు. శేఖర్‌గుప్తా స్పందిస్తూ.. ‘తెలంగాణ ప్రభుత్వ పనితీరు అద్భుతంగా ఉన్నది. ఏ పథకమైనా రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో అమలుచేస్తున్నది. పేదల కోసం తెలంగాణ నిర్మిస్తున్న గృహాలను పరిశీలించాం. కేంద్రం నిర్మిస్తున్న వాటి కంటే చాలా బాగున్నాయి. ఇంటింటికీ తాగునీటి సరఫరాలో ఉత్తరప్రదేశ్ ఎందుకు వెనకబడింది?’ అని ప్రశిస్తూ రిప్లయ్ ఇచ్చారు. ఈ ప్రశ్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీని అడిగితే బాగుంటుందని కేటీఆర్ జవాబిచ్చారు.