హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో ఐటీ పార్కులు నెలకొల్పే ముందు తగ్గిపోతున్న ఆఫీస్ సమస్యను పరిష్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. రాష్ట్రంలో మొదటి త్రైమాసికంలో ఆఫీస్ స్పేస్ 41 శాతం క్షీణించిందని కొలియర్స్ నివేదిక వెల్లడించిందని పేర్కొన్నారు. మెట్రో నగరాలైన బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, పుణెల్లో ఆఫీస్ స్పేస్ పెరుగుతుండగా హైదరాబాద్లో మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నదని విమర్శించారు. ఇటీవలి వరకూ హైదరాబాద్ అన్ని మెట్రో నగరాలకంటే టాప్లో ఉన్నదని గుర్తుచేశారు. ఆత్మవిమర్శ చేసుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టాలని హితవు చెప్పా రు. ప్రభుత్వం తన విధానాలను పునఃసమీక్షించుకొని, ఓ కమిటీ ఏర్పాటుచేసి, మార్కెట్ విశ్వాసాన్ని పొందేందుకు ప్రయత్నించాలని ఎక్స్ వేదికగా సూచించారు.