చింతలమానేపల్లి, జూన్ 5 : పోడు రైతులంటే రేవంత్ సర్కారుకు కోపమెందుకో అర్థం కావడం లేదని, దశాబ్దాలుగా సాగు చేస్తున్న పోడు రైతులను నిరాశ్రయులను చేసేందుకు కుట్రపన్నుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలో అటవీ అధికారుల అరాచకాలతో విసిగిన రైతులు, మహిళలు దీక్షకు దిగగా, గురువారం ఆయన వారికి మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. న్యాయం కోసం రైతులు, మహిళలు పోరాడుతుంటే కేసులు పెట్టి జైలుకు పంపుతామని అధికారులు బెదిరింపులకు పాల్పడటం సరికాదన్నారు.
రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇన్చార్జి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబును కలిసినా పోడు రైతులకు న్యాయం జరగడం లేదని అన్నారు. 400 కుటుంబాలు 1200 ఎకరాల భూమిని 40 ఏండ్లుగా సాగు చేసుకుంటుండగా, అధికారులు ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల భూములు రైతులకు దక్కే దాక పోరాడుతామని హెచ్చరించారు.