హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య కేసులో ముఖ్యమంత్రి సోదరుడిని ఎందుకు అరెస్టు చేయడం లేదని, ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు నిలదీశారు. సూసైడ్ నోట్‌కు మించిన ఆధారం ఏముంటుందని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మంగళవారం ఒక వార్త సంస్థతో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లెలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి.. సీఎం రేవంత్ సోదరుడి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన సూసైడ్ నోటు కూడా రాశారు. ఇంతవరకూ అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, అరెస్టు చేయలేదు’ అని విమర్శించారు. చట్టం, న్యాయం అందరికీ ఒకేరకంగా ఉండాలి కానీ, రేవంత్ సర్కారు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి తనకు అవసరమైనవారిని వదిలేస్తూ, గిట్టనివారిని అరెస్టు చేయిస్తున్నారని మండిపడ్డారు.
సీఎం రేవంత్‌రెడ్డి చట్ట ప్రకారం పాలన సాగించాలని, వ్యక్తిగతంగా టార్గెట్లు పెట్టుకొని ముందుకెళ్లడం సరికాదని హరీశ్‌రావు సూచించారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకొని ముందుకెళ్తున్నారు. నేను ఒక్క నటుడి కేసు గురించి మాట్లాడటం లేదు. కేసు పెట్టాలనుకొంటే పెట్టుకోవచ్చు. చట్టం ప్రకారం ముందుకు వెళ్లవచ్చు. ఎవరూ కాదనడం లేదు. ఇలాగే అన్నివిషయాల్లో ఎందుకు ముందుకెళ్లడం లేదు. మీ సోదరుడిని ఎందుకు అరెస్టు చేయడం లేదు. సూసైడ్ నోటుకంటే పెద్ద ఆధారం ఇంకేమి ఉంటుంది? సాయిరెడ్డి ఆత్మహత్య కేసులో ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు? దీనికి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాల్సి ఉంటుంది’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. 500 మందికిపైగా రైతులు, 80 మందికిపైగా ఆటోడ్రైవర్లు చనిపోయారని, వీరి గురించి రేవంత్‌రెడ్డి ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. వీరి గురించి అసెంబ్లీలో ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. చిత్ర పరిశ్రమను లక్ష్యంగా చేసుకొని వారిని వేధించడం మొదలుపెట్టారని ఆరోపించారు. చట్టం అందరికీ ఒకేలా ఉండాలని, మిగతా అంశాలను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు 50 మందికిపైగా చనిపోతే దానికి ఎందుకు బాధ్యత వహించడం లేదని ప్రశ్నించారు. మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు కారణమైన మీ సోదరుడిపై కేసు నమోదు చేయరు? కానీ, సాగుచేసుకుంటున్న భూములు అడిగితే ఇవ్వనందుకు గిరిజనరైతులను అరెస్టు చేయిం చి 30రోజులకుపైగా జైళ్లలో ఉంచారని దుయ్యబట్టారు. పరిశ్రమ కోసం భూములు ఇవ్వకుంటే అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు.
ఒకవేళ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే, కాంగ్రెస్‌కు ఎక్కడా డిపాజిట్ కూడా రాదని హరీశ్‌రావు పేర్కొన్నారు. రైతులు, మహిళలు, దళితులు ఇలా అన్ని వర్గాలవారు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. రేవంత్ సర్కార్ ఏడాది కాలంలో ఏ ఒక్క పనీ సక్రమంగా చేయలేదని విమర్శించారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలను 365 రోజులైనా నెరవేర్చలేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలందరూ పరేషాన్లో ఉన్నారని పేర్కొన్నారు.
తెలంగాణలో అనేక సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో, గురుకుల పాఠశాలల్లో 50 మందికిపైగా విద్యార్థులు చనిపోయారని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. ఆహార విషతుల్యంతో, కరెంట్ షాకులతో, పాముకాట్లతో, కుక్కకాట్లతో విద్యార్థులు మృత్యువాత పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించడం లేదని, అసెంబ్లీలో చర్చించడం లేదని మండిపడ్డారు. ఇలాంటి అంశాలపై అసెంబ్లీలో చర్చించేందుకు రేవంత్‌రెడ్డి సర్కారుకు సమయం లేదా? అని ప్రశ్నించారు. రైతులు, కార్మికులు, దళితులు, మైనార్టీలు, ఇతర వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీలో చర్చించడం లేదని దుయ్యబట్టారు. కానీ, ఒక సినిమా నటుడి అంశంపై రెండు గంటలు అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి మాట్లాడారని పేర్కొన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): దర్శక దిగ్గజం శ్యామ్ బెనెగల్ మరణం తీరని లోటని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన ఆయన మనల్ని విడిచివెళ్లడం చాలా బాధాకరమని తెలిపారు. మంగళవారం ఎక్స్ వేదికగా హరీశ్‌రావు స్పందిస్తూ భారత చలన చిత్ర రంగంపై ఆయన వేసిన ముద్ర, చైతన్యవంతమైన రచనలు చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు. శ్యామ్ బెనెగల్ కుటుంబానికి, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.