Harish Rao | కాంగ్రెస్ అంటే మాటలు కోటలు.. చేతల్లో కోతలు, ఎగవేతలు అని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పాత పథకాలు బంద్ చేసిండు.. ఆరు గ్యారంటీలు అటకెక్కించాడని ఆరోపించారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో నంగునూర్ మండల యువజన విభాగం నాయకులతో హరీశ్‌రావు ఆదివారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సిద్దిపేట అభివృద్ధిపై అక్కసు, కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు. సిద్దిపేటలోని వెటర్నరీ కళాశాలను కొడంగల్‌కు తరలించారని గుర్తుచేశారు. సిద్దిపేట అభివృద్ధికి కాంగ్రెస్ అడుగడుగునా కాంగ్రెస్ అడ్డుపడుతుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత యువతదే అని స్పష్టం చేశారు. భవిష్యత్తు యువతదే అని హరీశ్‌రావు అన్నారు. రాజకీయాల్లో యువత కీలక భూమిక పోషిస్తారని అన్నారు.
సిద్దిపేట అంటే గౌరవం వచ్చేలా అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిపామని హరీశ్‌రావు తెలిపారు. రాజకీయ ప్రయోజనాలు వదిలి ప్రజా ప్రయోజనాలపై కాంగ్రెస్ నాయకులు దృష్టి పెట్టాలని సూచించారు. సిద్దిపేటలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు అయిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు. సిద్దిపేటకు కొత్తవి తెచ్చింది లేదని.. పైగా ఆపేశారని అన్నారు. సిద్దిపేట ప్రజలపై ఎందుకింత వివక్ష అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. దీనిపై సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు ఎందుకు నోరు మెదపరని నిలదీశారు. సిద్దిపేటలో పనులు జరిగే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. పనులు జరిగే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు.