
దళిత బంధు ప్రయోగాన్ని చేపట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గాన్నే ఎందుకు ఎంచుకున్నారు? ఇందుకు అనేక కారణాలున్నాయి. అనేక ప్రామాణికాలతో పరిశీలిస్తే హుజూరాబాద్ నియోజకవర్గం పైలట్ ప్రాజెక్టుగా చేపట్టడానికి అనుకూలంగా ఉన్నది. ఈ విలక్షణ నియోజకవర్గంలో దాదాపు 61 వేల జనాభా ఉన్నది. 20 వేలకుపైగా కుటుంబాలున్నాయి. వివిధ వర్గాలు తగు పాళ్లలో ఉన్నాయి. దళిత కుటుంబాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా విస్తృత మార్కెట్, అక్షరాస్యులు, ఉపాధి అవకాశాలు మొదలైన కోణాల్లో పరిశీలిస్తే దళిత బంధు ప్రయోగానికి ఇది అనువైన ప్రదేశమని స్పష్టమవుతున్నది.
వామపక్ష ఉద్యమాల నేపథ్యంలో హుజూరాబాద్ ప్రజలకు చైతన్యం ఎక్కువ. తెలంగాణ ఉద్యమం కూడా వీరిని ఉత్తేజితులను చేసింది. అందువల్ల ప్రభుత్వ పథకాలను అంది పుచ్చుకుని సద్వినియోగం చేసుకొనే అవకాశాలు ఇక్కడ ఎక్కువుంటాయి. పైలట్ ప్రయోగం ఇక్కడ విజయవంతం అయితే మిగతా రాష్ట్రమంతటా లబ్ధిదారులు స్ఫూర్తిని పొందుతారు. స్వయం ఉపాధి ద్వారా నిలదొక్కుకున్న విజయగాథలు ఇక్కడ ఇప్పటికే ఉన్నాయి. అందువల్ల దళిత బంధు పథకానికి ఈ నియోజకవర్గాన్ని అనువైనదిగా ప్రభుత్వం ఎంచుకున్నది.
దళితులను శాశ్వతంగా అభివృద్ధి బాటలో పయనింప చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సమగ్రమైన దళిత బంధు పథకాన్ని రచించారు. దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి భిన్న విధాలను ముఖ్యమంత్రి ఎంచుకున్నారు. ఒకటి – రాష్ట్రమంతటా ఒక్కో నియోజకవర్గంలో వంద కుటుంబాలను శాంపిల్‌గా ఎంచుకొని రైతు బంధు పథకాన్ని వర్తింప చేయడం. దీనివల్ల రాష్ట్రమంతటా గల ఉత్తమ స్థాయి అర్హత గలవారికి వర్తింప చేసి ఫలితాలను పరిశీలించవచ్చు. మరోవైపు ఒక నియోజకవర్గ ప్రాంతాన్ని ఎంచుకొని సంతృప్త స్థాయిలో అక్కడి అర్హులైన వారందరికి పథకాన్ని వర్తింప చేయడం. దీనివల్ల ఆ నియోజకవర్గంలోని వంద మందికే కాకుండా అందరికి ఈ పథకం అందుతుంది.
దళిత సమాజంలోని అన్ని సామాజిక పొరల్లో ఉన్న వారిపై ఈ ప్రయోగాన్ని జరిపి చూడవచ్చు. వీటితో పాటు మరింత సూక్ష్మస్థాయిలో ప్రయోగానికి వాసాలమర్రిని ఎంచుకున్నారు. ఈ ప్రయోగ ఫలితాలు, గడించిన అనుభవం ఆధారంగా ఈ పథకాన్ని మరింత ఫలవంతంగా అమలు చేయవచ్చనేది ముఖ్యమంత్రి ఆలోచన.
కేసీఆర్‌లో నిశిత పరిశీలనా శక్తి ఎక్కువ. రాజకీయ నాయకులు, అధికారులు, నిపుణులు మొదలైన మార్గాల ద్వారా విషయ సేకరణ చేయడంలో దిట్ట. సమాచారం సేకరించడమే కాకుండా దానిని విశ్లేషించి చూసుకోగలరు. తనదైన తార్కికశక్తితో అంచనాకు రాగలరు. ఏరంగమైనా కావచ్చు, క్షేత్రస్థాయిలో ఉన్న వారికన్నా ఎక్కువగా సమాచారం, అవగాహన కలిగి ఉంటారు. కేసీఆర్‌కు విస్పష్ట సామాజిక – ఆర్థిక సమగ్రాభివృద్ధి అజెండా ఉన్నది. ఈ విస్తృత అజెండాలో భాగంగానే దళిత బంధును కూడా అర్థం చేసుకోవాలి. భారీగా వ్యవసాయోత్పత్తులు, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, స్థానిక పరిస్థితులు, మానవ వనరులు అనే ప్రధాన అంశాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక అమలవుతున్నది. ఈ నమూనాలో ప్రయోగం జరపడానికి హుజూరాబాద్ నియోజకవర్గం అన్ని విధాలా అనుకూలంగా ఉన్నది. మానవ వనరుల సంపూర్ణ వినియోగానికి ఈ ప్రాంతం అన్ని విధాలా అనుకూలమైనది. ఇది దళిత సమాజాభివృద్ధికే కాదు, మొత్తం సమాజాభివృద్ధికి ఒక పైలట్ ప్రాజెక్టు.
ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతంలో ప్రయోగం జరిపితే దాని ఫలితాలను మొత్తం రాష్ర్టానికి అన్వయించుకోలేము. హైదరాబాద్ నగరం మధ్యలో ప్రవేశ పెట్టినా అంతే. కానీ హుజూరాబాద్ నియోజకవర్గం ఒకవైపు నగర, గ్రామీణ ప్రాంతాల సమతుల్యత కలిగి ఉన్నది.
కరీంనగర్, హనుమకొండ రహదారిపై మధ్యలో కీలక స్థానంలో హుజూరాబాద్ ఉన్నది. హుజూరాబాద్ మండలంలో జనాభా లక్షకు చేరువగా పోతున్నది. అక్షరాస్యత డెబ్బయి శాతానికి పైనే ఉన్నది. స్వయం ఉపాధి పథకాలను విజయవంతంగా చేపట్టిన ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి. కాలువ వ్యవసాయం మరో ప్రత్యేకత. ఒకప్పుడు వారానికి ఒకసారి నీరు వస్తే మహాభాగ్యం. ఇప్పుడు నీటి వసతి పెరిగింది, పంటలకు కొదువ లేదు.
భవిష్యత్తులో వ్యవసాయ ఆధార ఉత్పత్తులు పెద్ద ఎత్తున పెరుగబోతున్నాయి. కూరగాయలు మొదలుకొని వ్యవసాయ వస్తువులైనా పారిశ్రామిక ఉత్పత్తులైనా సమీప నగర ప్రాంతాలకు తరలించి లాభాలు గడించవచ్చు. ఇప్పటికే పత్తి, వరి పంటలకు ఈ ప్రాంతం పేరు పొందింది. ఇక్కడి విత్తనాలు దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. యాసంగి మక్కలను బయోడీజిల్‌కు ఉపయోగిస్తారు. వీణ వంక మండలంలో కూడా వ్యవసాయం ప్రధానమే.
జమ్మికుంట మండలం సహజసిద్ధమైన వాణిజ్యాభివృద్ధికి నోచుకున్న ప్రాంతం. ఉత్తరాదిలోని ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర నుంచి తెలంగాణ మీదుగా దక్షిణాదికి వెళ్ళె సుదీర్ఘ గ్రాండ్ ట్రంక్ రైలు మార్గంలో ఉండటం ఈ మండల కేంద్ర ప్రత్యేకత. బియ్యం మిల్లు, ఆయిల్ మిల్లులు, కాటన్ మిల్లులు, డైరీ ఫామ్, లెదర్ ఫ్యాక్టరీ, చేనేత సహకార సంఘాలు, హస్తకళా కేంద్రాలు మొదలైనవి ఉన్నాయి. ఎఫ్‌సీఐ గోదాములున్నాయి. వరంగల్ తరువాత పెద్ద మార్కెట్ యార్డ్ ఇక్కడే ఉన్నది. సరుకుల ఎగుమతి దిగుమతులు పెద్ద ఎత్తున చేయాలంటే, అటు పెద్ద పల్లి రైల్వే స్టేషన్, ఇటు కాజీపేట్ జంక్షన్ దగ్గరగా ఉన్నాయి. ఈ ప్రాంతం విద్యా సంస్థలకు పేరుగలది. ఇక్కడ వ్యాపార సంస్కృతి ఇప్పటికే అలుముకుని ఉన్నది కనుక స్వయం ఉపాధి పథకాలను సులభంగా పెట్టించవచ్చు. ప్రముఖ ఆలయాలు కూడా దరిదాపులలో ఉన్నాయి. పక్కనే ఇల్లంత కుంట మండలంలో రామాలయం ప్రసిద్ధి చెందినది. బిజిగిరి షరీఫ్‌కు మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ర్టాల నుంచి కూడా భక్తులు వస్తారు. ఈ పక్కనే నరసింహస్వామి ఆలయం ప్రముఖమైనది. ఏడాది పొడుగునా నీటి ఊట రావడం ఇక్కడి ప్రత్యేకత.
కమలాపూర్ నియోజకవర్గమైతే హనుమకొండకు దగ్గరలో ఉన్నది. సాగునీరు పుష్కలంగా వస్తున్నది. వ్యవసాయం ప్రధానంగా ఉన్నది. ఇక్కడి యువత నగర ప్రాంతానికి వెళ్ళి అక్కడ షాపింగ్ మాల్స్, పెట్రోలు పంపులు, మెకానిక్ సెంటర్లలో పనిచేస్తుంటారు. స్వయం ఉపాధి ద్వారా యువత ఎదగడానికి అనువైన ప్రాంతం.
వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో తెలంగాణ సాధించబోయే అద్భుత ప్రగతికి ఒక్కో అడుగు పడుతున్నది. ఇందులో భాగమే దళిత ప్రణాళిక. దీనిని మొత్తం సామాజికార్థిక వ్యూహంలో భాగంగా అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ, మన అభివృద్ధిని అడ్డుకోవడానికి పరాయి శక్తులు తమ తాబేదారుల ద్వారా తమ కుట్రలు ఇంకా సాగిస్తూనే ఉన్నారు. బీసీలకు, ఎస్సీలకు మధ్య గొడవలు పెట్టి రెచ్చగొట్టాలని చూస్తారు. గిరిజనులు, దళితులు, బీసీలలోని కులాలు, ఉపకులాల మధ్య వైషమ్యాలు పెంచుతారు. విభజించి పాలించే కుటిల నీతి ఇది. ఈ విభజన రాజకీయాలకు బలికాకుండా అన్ని వర్గాల ప్రజలు పరస్పర సౌహార్దతతో అభివృద్ధి చెందాలి. డెబ్బయి ఏండ్లలో ప్రజలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఘోరంగా అణచివేసిన పార్టీల వారు ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక ఆగమాగం చేస్తున్నారు. వీరి మాయ మాటలను యువత నమ్మకూడదు.
తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ, మన అభివృద్ధిని అడ్డుకోవడానికి పరాయి శక్తులు తమ తాబేదారుల ద్వారా తమ కుట్రలు ఇంకా సాగిస్తూనే ఉన్నారు. బీసీలకు, ఎస్సీలకు మధ్య గొడవలు పెట్టి రెచ్చగొట్టాలని చూస్తారు. గిరిజనులు, దళితులు, బీసీలలోని కులాలు, ఉపకులాల మధ్య వైషమ్యాలు పెంచుతారు. విభజించి పాలించే కుటిల నీతి ఇది.
ఈ విభజన రాజకీయాలకు బలికాకుండా అన్ని వర్గాల ప్రజలు పరస్పర సౌహార్దతతో అభివృద్ధి చెందాలి.