నల్లగొండ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆచరణ సాధ్యం కాని హామీలిస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేంధర్ రెడ్డి (Gutta Sukhender Reddy )ఆరోపించారు. మంగళవారం నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్(Congress) విచిత్రంగా ప్రవర్తిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలే బీజేపీ బలోపేతానికి కారణమని వెల్లడించారు.
టీఆర్ఎస్(TRS)ను గద్దె దింపాలనే కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని పేర్కొన్నారు. నాలుగు వేల పెన్షన్ ను కాంగ్రెస్ పాలిత(Congress Rule) ప్రాంతాల్లో ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. దేశ బడ్జెట్ సగం ఇచ్చినా కాంగ్రెస్ హామీలు సాధ్యంకాదన్నారు.బీజేపీని కేంద్రంలో గద్దె దింపేందుకు కాంగ్రెస్ సమ్మతంగా లేదని వివరించారు.
రాహుల్ గాంధీ(Rahul Gandhi )సమక్షంలోనే ఖమ్మం సభలో కాంగ్రెస్ కుమ్ములాటలు బయటపడ్డాయని అన్నారు.బీజేపీ అరాచక మత తత్వ రాజకీయాలకు పూనుకుంటుందని దుయ్యబట్టారు.తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ లను ప్రజలు నమ్మడం లేదని, బీజేపీ వ్యతిరేక శక్తులు కేసీఆర్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.