చిక్కడపల్లి, జూన్ 26: కాంగ్రెస్లో నలుగురు లంబాడీలు ఎమ్మెల్యేలుగా ఉన్నా మంత్రిపదవి దక్కలేదని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్య సంజీవ్ నాయక్ చెప్పారు. లంబాడీలకు అన్యాయం చేస్తే సహించమని హెచ్చరించారు. గురువారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సేవాలాల్ సేన ఆధ్వర్యంలో మహాసభ జరిగింది. ఈ సందర్భంగా సంజీవ్ నాయక్ మాట్లాడుతూ ‘ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని ఉద్యమాలు చేసినా తండాలు గ్రామ పంచాయతీలు కాలేదు. దీంతో తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించాం.
కేసీఆర్ సీఎం అయ్యాక మా తండాలను గ్రామపంచాయతీలుగా చేశారు. అంతేగాక లంబాడీలతో గొప్ప సమావేశం ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు మాకు తగిన గుర్తింపు లభించడం లేదు. లంబాడీలకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వరు? మేము ఓట్లు వేయలేదా? మా ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఎందుకు కల్పించడం లేదు?’ అని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఇవ్వడం లేదని, తండాల అభివృద్ధికి 25 లక్షలు ఇస్తామని విస్మరించారని, ట్రైకార్ రుణాలు రూ.350 కోట్లు ఇప్పటికీ ప్రభుత్వం వద్దే ఉన్నాయని సంజీవ్నాయక్ విమర్శించారు.