హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో సీట్ల పెంపు, కుదింపు, కొత్త కోర్సులు ప్రారంభించే అంశంపై అనుమతులు నిరాకరించడానికి కారణాలు చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏఐసీటీఈ, యూనివర్సిటీలు అనుమతి ఇచ్చిన తర్వాత ఉన్నత విద్యా శాఖ ఎందుకు అనుమతి ఇవ్వడం లేదో చెప్పాలని ప్రశ్నించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 4కు వాయిదా వేసింది.
ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, సాంకేతిక విద్య కమిషనర్, జేఎన్టీయూ, ఏఐసీటీఈ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి, ఈఏపీసెట్ కన్వీనర్లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాస్‌రావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీ చేసింది.
కొత్త కోర్సుల ప్రారంభం, సీట్ల పెంపు, కుదింపు, కోర్సుల విలీనం రద్దుకు అనుమతి నిరాకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోను, అనుమతులకు చెందిన సాంకేతిక విద్యాచట్టంలోని 20వ సెక్షన్‌ను సవాలు చేస్తూ మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, విద్యాజ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ, మల్లారెడ్డి, అనురాగ్, సీఎంఆర్తోపాటు పలు కాలేజీలు విడివిడిగా 11 కేసులు దాఖలు చేశాయి. సీనియర్ న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ, కంప్యూటర్ సైన్స్ కోర్సుకు డిమాండ్ ఉన్నదని, ఆ కోర్సు, దాని అనుబంధ కోర్సుల్లో సీట్ల పెంపునకు జేఎన్టీయూ నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చిందని వివరించారు.