కొడిమ్యాల/రామాయంపేట, నవంబర్ 27: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేయకున్నా.. ప్రచారం ఎందుకు చేస్తున్నారని కళాకారులను గ్రామస్తులు నిలదీశారు. వృద్ధులకు రూ.4వేల పింఛన్ ఏది..?, రైతులకు రైతు భరోసా, వడ్లకు రూ.500 బోనస్ ఏది..? అని ప్రశ్నించారు. బుధవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాలలోని అంగడి బజార్లో సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ప్రచార రథం ద్వారా ఆరు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేసిందంటూ ప్రచారం చేస్తున్న కళాకారులను గ్రామస్తులు అడ్డుకున్నారు.
విషయం తెలుసుకొని ప్రచార రథం వద్దకు చేరుకున్న కాంగ్రెస్ మండలాధ్యక్షుడు చిలువేరి నారాయణగౌడ్, నాయకులను సైతం నిలదీశారు. అయితే ప్రజలు నిలదీసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వాట్సాప్ గ్రూప్‌లలో పోస్టులు పెట్టిన, స్టేటస్‌గా పెట్టుకున్న యువకులను ఠాణాకు రావాలని పోలీసులు ఫోన్ చేసి చెప్పినట్టు తెలిసింది.
Mbnr1
ధర్మారంలో కళాకారుల అడ్డగింత
ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడానికి గ్రామానికి వచ్చిన కళాకారులను ప్రగతి ధర్మారం గ్రామస్తులు నిలదీశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం కళాకారులు కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారెంటీలపై ప్రచారం చేశారు. అక్కడే ఉన్న గ్రామస్తులు ఒక్కసారిగా కళాకారులపై మండిపడ్డారు. ‘కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు రైతుబంధు వస్తుండే, ఈ కాంగ్రెసోళ్లు వచ్చిండ్రు రైతుబంధు ఆగిపోయింది. రుణమాఫీ చేస్తానని, పింఛన్లు పెంచుతామని, ఇంకా ఎన్నో చెప్పి ఓట్లు ఏసుకున్న రేవంత్‌రెడ్డి ఏమి చేయలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా ఊళ్లో చారాణా మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదని, మీ ఉపన్యాసాలు చాలు వెళ్ల్లిపోండ్రి..’ అంటూ కళాకారులపై మండిపడటంతో వారు వెనుదిరిగారు.
పోలీసు బందోబస్తుతో ప్రజా విజయోత్సవాలు!
సీఎం సొంత జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తలు
జడ్చర్ల, నవంబర్ 27: సీఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగుతున్నాయి. ఇటీవల అడ్డాకులలో కళాజాత బృందాన్ని ప్రజలు అడ్డుకొని తిప్పి పంపించారు. కాంగ్రెస్ ప్ర భుత్వం ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదని నిలదీశారు. ‘మీరు వద్దు.. మీ పాలన వద్దు’ అంటూ అడ్డుకోవడంతో చేసేది లేక వారు వెనుదిరిగారు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టి ంచింది. దీంతో ప్రభుత్వ అధికారులు కళాజాత బృందానికి బందోబస్తు ఏర్పాటు చేసి గ్రామాల్లోకి పంపిస్తున్నారు. ఎవరు అడ్డుకున్నా వారిపై కేసులు నమోదు చేయండి అంటూ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తున్నది. దీంతో పోలీసు పహారా మధ్య ప్రజా విజయోత్సవాలు నిర్వహించడం గమనార్హం.