హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమనేత, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు సిట్ అధికారులు నోటీసులు జారీచేసిన తీరు ఇప్పు డు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ పేరుతో ఒక వ్యవస్థను అడ్డంపెట్టుకొని రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ నివాసం విషయం లో సిట్ ప్రదర్శిస్తున్న ‘అజ్ఞానం’ వెనుక భారీ కుట్ర దాగి ఉన్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ గత కొంతకాలంగా సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం, ఎర్రవల్లి నివాసంలో ఉంటున్నారన్న విషయం తెలంగాణ సమాజానికే కాకుండా, ప్రస్తుత ప్రభుత్వంలోని మంత్రులకు, ఉన్నతాధికారులకూ స్పష్టంగా తెలుసు.
ఇటీవలే మేడారం సమ్మక-సారక జాతరకు రావాలని ఆహ్వానం అందించడానికి మం త్రులు సీతక, కొండా సురేఖ ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా గతంలో ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికే వెళ్లారు. అధికారులు కూడా అనేక సందర్భాల్లో అక్కడికే వెళ్లి అధికారికంగా ఆహ్వానాలు అందించారు. శాసనసభ వ్యవహారాలు, తెలంగాణ తల్లి విగ్రహావిషరణ వంటి అంశాలపై చర్చించేందుకు ఉన్నతాధికారులు సైతం ఎర్రవల్లి బాట పట్టారు. ప్రభుత్వ ప్రొటోకాల్ అధికారులు, మంత్రులు వెళ్లిన ఇంటికి.. సిట్ అధికారులు రాలేమని చెప్పడం మాత్రం విడ్డూరంగా ఉన్నది. పాత రికార్డుల్లోని నందినగర్ అడ్రస్‌కు మాత్రమే వస్తామని సిట్ మొండికేయడం వెనుక రాజకీయ దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తున్నది.