Free Bus హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ‘మహాలక్ష్మి పథకంపై రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఎందుకు నిజాలను దాస్తున్నాయి? ఆ పథకంతో సంస్థకు వస్తున్న ఆదాయమెంత? ప్రభుత్వం రీయింబర్స్ చేసిందెంత? ఇప్పటికీ ఆ వివరాలు ఎవ్వరికీ తెలియని బ్రహ్మరహస్యంగా ఎందుకు మిగిలాయి? ఎప్పటికప్పుడు వాటిని ఎందుకు బహిర్గతం చేయడం లేదు? ఎవరి మెప్పు కోసం యాజమాన్యం ఆ లెక్కలను దాస్తున్నది?’ అని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, కో-చైర్మన్ కే హన్మంత్ ముదిరాజ్, వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో-కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, బీ యాదగిరి ప్రశ్నించారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ఇటీవల యాజమాన్యం ఇచ్చిన వివరణపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం ఓ లేఖ రాశారు. టీజీఎస్ఆర్టీసీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పేరుతో విడుదలైన ఆ ప్రకటన ఎండీ పర్సనల్ ఆఫీసర్ ఇచ్చినట్టుగా ఉన్నదని ధ్వజమెత్తారు. ఆ లేఖలో సంస్థ ఇచ్చిన తప్పుడు సమాచారంపై పలు ప్రశ్నలు సంధిస్తూ.. వాటికి యాజమాన్యం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘మహాలక్ష్మి’ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న సిబ్బంది గురించి, వాళ్లు పడుతున్న ఇబ్బందుల గురించి, రావలసిన ఆదాయం గురించి యాజమాన్యం తన ప్రకటనలో ఎందుకు ప్రస్తావించలేదో చెప్పాలని నిలదీశారు.
కార్మికులు కూడబెట్టుకున్న పీఎఫ్, సీసీఎస్ సంస్థల నుంచి అక్రమంగా నిధులు కాజేసిన వ్యక్తి ఎవరని కార్మిక సంఘాల నేతలు ప్రశ్నించారు. ఆ అపవాదు తనపైకి రాకుండా తప్పు ను కప్పిపుచ్చుకోవడానికి తాపత్రయ పడుతున్న వ్యక్తి ఎవరో ఆర్టీసీ యాజమాన్య ప్రకటన స్పష్టం చేసిందన్నారు. ‘పీఎఫ్ బకాయిలు విడతలవారీగా చెల్లిస్తూ రూ.580.37 కోట్లకు తగ్గించారా? లేక మూడేండ్ల నుంచి ప్రతినెలా చెల్లిస్తున్నారా? ఇదే నిజమైతే పీఎఫ్ అధికారులు చెపుతున్న రూ.1,200 కోట్ల బకాయిలు (వడ్డీతో కలిపి) ఎందుకు ఉన్నట్టు? సీసీఎస్ బకాయిలను కూడా రూ.451.9 కోట్లకు తగ్గించామని చెప్తున్నప్పటికీ సీసీఎస్ లెకల ప్రకారం ఇంకా రూ.1,050 కోట్లు (వడ్డీతో కలిపి) బకాయిలు ఎందుకు ఉన్నాయి? మీరు చెప్పిన లెకలు సంస్థ లెకలా? లేక మీరు వాడుకున్న లెకలా?’ అంటూ యాజమాన్యాన్ని నిలదీశారు. పొదుపు సొమ్ముపై వడ్డీని దిగమింగి, అన్యాయం చేశారని ఆరోపించారు.
తార్నాక హాస్పిటల్‌ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా మార్చినప్పుడు రెఫరల్ హాస్పిటల్ ఖర్చు రూ.22 కోట్లను ఎందుకు కేటాయించాల్సి వచ్చింది? అందులో చేతులు మారిన నిధులు ఎన్ని? అని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు సంస్థ యాజమాన్యాన్ని నిలదీశారు. ‘హెల్త్ క్యాంపులు పెట్టామని గొప్పలు చెప్తున్న అధికారులు.. వారి వేధింపులు భరించలేక, విశ్రాంతి లేక పనిభారంతో ఎంత మంది కార్మికులు రోగాల బారినపడ్డారో తెలుసుకున్నారా? ఏటా ఎంతమంది చనిపోతున్నారో లెక్కలు తీశారా? వారి చావులకు యాజమాన్యం కారణం కాదా? అని ప్రశ్నించారు.
తార్నాకలో, బస్ భవన్లో అవినీతి కాంట్రాక్టుల గురించి, పనిచెయ్యకుండానే రూ.లక్షల్లో తీసుకున్న వేతనాల గురించి, ప్రైవేటు ఏజెన్సీల దోపిడీ గురించి, ఆర్టీసీ వాహనాల అక్రమ వాడకం గురించి, హెల్త్ క్యాంపుల పేరుతో బ్రోకర్ల ద్వారా చేతులు మారిన కమీషన్ల గురించి సంస్థ ఎందుకు చెప్పడం లేదు?’ అని మండిపడ్డారు. ఎలక్ట్రిక్ బస్సుల కోసం డిపోలకు డిపోలు ఎందుకు ఖాళీ చేయిస్తున్నారో చెప్పాలని కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది.