Health Cards | హైదరాబాద్, జూన్ 1(నమస్తే తెలంగాణ) : ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) కోసం కనీస సమాచారం లేకుండా తమ డబ్బులెలా కట్ చేస్తారని పలు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. జీవో ఇవ్వకుండా.. మెమో జారీచేయకుండా.. డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులకు(డీడీవో)లకు తెలియకుండా కట్ చేయడం సబబేనా అంటూ నిలదీశాయి.
ఈహెచ్ఎస్కు సీలింగ్ ఉందా అపరిమిత వైద్యసేవలందిస్తారా? ఎలాంటి మార్గదర్శకాల్లేకుండా ఆన్లైన్లో వివరాలు నమోదు సమయంలో ఎలా కోత విధిస్తారు? భార్యాభర్తలిద్దరి నుంచి వాటా ఎలా కట్ చేస్తారు? అంటూ ప్రశ్నలవర్షం కురిపించాయి. సోమవారం సచివాలయంలో సీఎస్ కే రామకృష్ణారావు అధ్యక్షత నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నేతలు ఈహెచ్ఎస్ విషయంలో సర్కార్ వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. సమావేశంలో కేవలం ఈహెచ్ఎస్పైనే చర్చ జరుగగా, పలువురు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. చికిత్స ఒకటే కాకుండా ప్రతి నెలా మందులు తీసుకొనే ప్రొవిజన్ ఉందా? అని ప్రశ్నించడమే కాకుండా, ఉచితంగా ముందులు కూడా ఇవ్వాలని కోరినట్టు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.
ఉద్యోగుల వాటా కట్ చేసినప్పుడు ప్రభుత్వ వాటా పరిస్థితేంటని పలు సంఘాల నేతలు నిలదీసినట్టు తెలిసింది. ఉద్యోగుల వాటా జమ అయిన రోజే సర్కార్ వాటా కూడా జమచేయాలన్న డిమాండ్‌ను లేవనెత్తారు. కొందరైతే ప్రభుత్వ వాటా జమ చేస్తుందన్న నమ్మకం లేదని, పే స్లిప్‌లో ప్రత్యేక కాలమ్ పెట్టి ఉద్యోగుల వాటా.. ప్రభుత్వ వాటాను ప్రదర్శిస్తేనే ఒప్పుకొంటామని తెగేసి చెప్పినట్టు సమాచారం. ఇక భార్యాభర్తల్లో ఒకరి నుంచే ప్రీమియం కట్ చేయాలని వారు కోరారు. దీనిపై స్పందించిన సీఎస్.. ట్రస్టు నేతృత్వంలోనే పథకం అమలవుతుందని స్పష్టతనిచ్చినట్టు నేతలు తెలిపారు. ఉత్తమ వసతులు కావాలంటే ప్రీమియం పెరుగుతుందని.. ప్రభుత్వం కూడా అంతే మొత్తం చెల్లిస్తుందని సీఎస్ చెప్పినట్టు ఉద్యోగ సంఘాల నేత ఒకరు వెల్లడించారు.
ఈహెచ్ఎస్ ట్రస్టును రెండు రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్టు సీఎస్ కే రామకృష్ణారావు ఉద్యోగ సంఘాల నేతలతో భేటీలో ప్రకటించారు. సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేస్తామని చెప్పారు. ట్రస్టు కోసం ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా తెరుస్తామని ఉద్యోగులు, ప్రభుత్వ వాటాను ఈ ట్రస్టులో జమచేస్తామని తెలిపారు. అధికారులు బెన్హర్ మహేశ్ దత్ ఎక్కా, దాన కిశోర్, సందీప్‌కుమార్ సుల్తానియా, క్రిస్టినా జెడ్ చోంగ్తు, డాక్టర్ యోగితారాణా, ఉద్యోగ సంఘాల నేతలు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు, ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ, బీ శ్యామ్, లచ్చిరెడ్డి, వొడ్నాల రాజశేఖర్, ఎస్ రాములు తదితరులు పాల్గొన్నారు.
ఈహెచ్ఎస్ విధివిధానాలను ప్రకటించి ఉపాధ్యాయులు, ఉద్యోగుల సందేహాలను నివృత్తి చేయాలని టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ రెండో పీఆర్సీ అమలుచేసిన తర్వాతే ఈహెచ్ఎస్ కోసం ఉద్యోగుల వాటాను వసూలు చేయాలని, మాడల్ స్కూల్, కేజీబీవీ, ఎస్ఎస్ఏ, గిరిజన ఆశ్రమ పాఠశాలల ఉద్యోగులకు సైతం హెల్త్కార్డులివ్వాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ-2003 టీచర్లకు పాత పింఛన్, ఓపీఎస్ అమలుచేయాలని కోరారు. వోడ్నాల రాజశేఖర్(తపస్), ప్రధాన కార్యదర్శి పెంటయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ హన్మంతరావు పాల్గొన్నారు.
ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్)పై ఉద్యోగుల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రీమియం మన దగ్గరే ఎక్కువుందని వాదిస్తున్నాయి. చాలా రాష్ర్టాల్లో తక్కువగా ఉన్నట్టు చెబుతున్నాయి. ఈహెచ్ఎస్ ప్రీమియంను సర్కార్ ఆటోమెటిక్‌గా కట్ చేయడం వివాదాస్పదం కాగా, తాజాగా ఈహెచ్ఎస్ ప్రీమియంపై సోషల్ మీడియాలో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్‌లో ఉద్యోగుల నుంచి రూపాయి ప్రీమియం లేకుండా అక్కడి సర్కార్ ఈహెచ్ఎస్ అమలుచేస్తున్నదని ఉద్యోగ సంఘాల నేతలంటున్నారు. వాస్తవానికి గత కేసీఆర్ సర్కార్ హయాంలోనే ఈహెచ్ఎస్ జీవో విడుదలయ్యింది. జీవోను రేవంత్ సర్కార్ తుంగలో తొక్కింది. ఉద్యోగులు నెలకు రూ. 500 ప్రీమియంగా వసూలు చేయాలని కోరగా, రేవంత్ సర్కార్ మాత్రం మూలవేతనం నుంచి 1.5% వసూలు చేస్తున్నది. ప్రస్తుతం నెలకు ప్రీమియం రూ. 900 నుంచి 2,700 వరకు ఉంది. రెండో పీఆర్సీ అమలు చేస్తే ఉద్యోగుల మూల వేతనం భారీగా పెరుగుతుంది. దీంతో ప్రీమియం డబుల్ అవుతుందని ఉద్యోగ సంఘాల నేతలంటున్నారు. ఇప్పటికే కొందరు ఉద్యోగులు ప్రైవేట్ హెల్త్‌కార్డులు తీసుకున్నారు. మరోవైపు ఈహెచ్ఎస్ను ఉద్యోగులందరికి సర్కార్ రుద్దుతున్నది. దీంతో ఎగ్జిట్ ఆప్షన్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు.