హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధి వెలుపల ఎన్యుమరేషన్ ఫారాలను కేవలం తెలుగులో మాత్రమే ఎందుకు పంపిణీ చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విధానం వల్ల తెలుగు తెలియని పౌరులు, వలస కార్మికులు, సీబీఎస్ఈ తదితర కేంద్ర పాఠ్యాంశాల్లో చదివిన విద్యార్థులు ఇబ్బందులు ఎదురొనే అవకాశం ఉన్నదని ప్రాథమికంగా అభిప్రాయపడింది.
కరీంనగర్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఎంఏ ముజీబ్ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వీ రఘునాథ్ వాదనలు వినిపిస్తూ హైదరాబాద్ వెలుపల కేవలం తెలుగులోనే ఫారాలను పంపిణీ చేయడంతో ఇతర భాషలు మాట్లాడే ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది స్పం దిస్తూ, ప్రస్తుత విధానం పూర్తిగా పరిపాలనా, ఆచరణాత్మక అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిందని తెలిపారు.
ఇ ప్పటికే భారీసంఖ్యలో తెలుగులో ముద్రణ జరిగిందని, ఇతర భాషల్లో ముద్రించి పం పిణీ చేయాలంటే భారీ వ్యయం, రవాణా, పంపిణీపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ఎన్యుమరేషన్ ఫారాలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. బీఎల్వోలు ఇంగ్లిష్ ఫారాలు అవసరమైనవారికి అందజేస్తున్నారని చెప్పారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ కేవలం ఆన్లైన్లో ఫారాలు అందుబాటులో ఉంచితే సరిపోదని పేర్కొంది. భౌతికరూపంలో కూడా పత్రాలు అందించాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడింది. అధికారిక సూచనలు తీసుకుని వివరణ ఇచ్చేందుకు గడువు కావాలని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది కోరడంతో తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.