తెలంగాణలో రక్తం పారించాలని చూస్తే… బిడ్డ ఖబడ్దార్… అలాంటి వాళ్ళందరికీ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పట్టిన గతే పడుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. తెలంగాణలో అశాంతి నెలకొల్పాలని ప్రయత్నిస్తే ఊరుకోబోమన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన ఒక కార్యక్రమంలో మహబూబ్ నగర్ మండలానికి చెందిన సహాయ ఫౌండేషన్ చైర్మన్ టంకరి శివప్రసాద్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంకి చెందిన సుమారు 300 మంది మంత్రి సమక్షంలో అధికార పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పిన మంత్రి పార్టీలోకి స్వాగతించారు.
ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో మతకలహాలు సృష్టించాలని ప్రయత్నం చేసిన రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్టు చేసిన తీరుగానే, అలాంటి వ్యక్తులను భవిష్యత్తులోనూ కఠినంగా అణచివేస్తామని అన్నారు. తెలంగాణను ఆగం చేయాలని, తెలంగాణలో మతకలహాలు సృష్టించాలని ప్రయత్నిస్తే ఎంతటి పెద్ద నాయకుడైనా రాజాసింగ్‌కు పట్టిన గతే పడుతుందని మంత్రి హెచ్చరించారు. తెలంగాణ ప్రజల ప్రాణాలకు హాని కలిగించాలని ప్రయత్నం చేస్తే.. ఎంతటి వారైనా వదలబోమని తెలిపారు.
బీజేపీ నేతలు అసందర్భంగా, అసత్యంగా చేస్తున్న ప్రసంగాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడి అమాయకుల ప్రాణాలు బలి కొనాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. బీజేపీ నేతల ఈడి, పీడీ బెదిరింపులకు కేసీఆర్ భయపడడని తెలిపారు. మతకలహాలు సృష్టించి ఓట్లు కొల్లగొట్టాలని బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలంతా గమనిస్తున్నాని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు చేస్తున్న ఓటు బ్యాంకు రాజకీయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో టీఎస్‌టీడీసీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, కౌన్సిలర్ కిషోర్, రామచంద్రపురం సర్పంచ్ కుర్వ శ్రీనివాస్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గంధం రాములు, సత్యం యాదవ్, రాములు, భాస్కర్, మోహన్ నాయక్, దాసరి కన్న, శివశెట్టి, మహిళా నాయకులు అనిత రెడ్డి, వాణి, సాయి లక్ష్మి, లత తదితరులు పాల్గొన్నారు.