హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): కిషన్‌రెడ్డికి మరోసారి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కడంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి ఇస్తారనే చర్చ మొదలైంది. గతంలో మాదిరిగానే అటు కేంద్ర మంత్రిగా, ఇటు అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి కొనసాగుతారని భావించినా, ఆయనకు ఈసారి కేంద్రంలో కీలక పదవి అప్పగిస్తారని భావిస్తున్నారు.
దీంతో కచ్చితంగా అధ్యక్ష మార్పు ఉంటుందని అంటున్నారు. తదుపరి అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో వరుసగా కీలక నేతలను కలుస్తుండటంతో ఈ వాదనకు బలం చేకూరుతున్నది. మిగతా నేతలతో పోల్చితే రాజకీయంగా అనుభవం ఉండటం ఈటలకు కలిసొస్తున్నదని చెప్తున్నారు.
అధ్యక్ష పదవి రేసులో రఘునందన్‌రావు పేరు సైతం వినిపిస్తున్నది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతున్న నేపథ్యంలో.. దూకుడుగా వెళ్లాలంటే రఘునందన్‌రావుకు అప్పగించాలనే డిమాండ్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఆయన అందరినీ కలుపుకొని వెళ్లలేడని, ఒంటెద్దు పోకడలతో నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతున్నది.
సీనియర్ నేత ధర్మపురి అర్వింద్ సైతం అధ్యక్ష పదవి కోరుకుంటున్నట్టు తెలిసింది. మొదటినుంచీ పార్టీలో ఉండటం, వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచిన నేపథ్యంలో తనకు పదవి దక్కుతుందని అర్వింద్ భావిస్తున్నారు. వాస్తవానికి బండి సంజయ్‌ని తప్పించినప్పటి నుంచి అర్వింద్ ఆ పదవి కోసం ప్రయత్నిస్తున్నారని టాక్. ఈ ముక్కోణపు పోటీలో రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది.