కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 13: మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించిన ఎల్అండ్టీ కంపెనీని ఓ మాజీ ఎంపీ బెదిరించి తన బంధువులకు సబ్ కాంట్రాక్ట్ ఇప్పించుకున్నారని విమర్శలు చేస్తున్న బండి సంజయ్.. దమ్ముంటే ఆ మాజీ ఎంపీ ఎవరో చెప్పాలని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ బండి సంజయ్ విమర్శిస్తున్నట్టు.. ఆ మాజీ ఎంపీ తానా? లేక పొన్నం ప్రభాకరా? కేసీఆరా? చెన్నమనేని విద్యాసాగర్రావా? ఎల్ రమణనా? అని ప్రశ్నించారు.
పేరు చేప్పే ధైర్యం లేకుండా ఉత్త ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరని తెలిపారు. ఎల్అండ్టీ అనేది ఓ మల్టీనేషనల్ కంపెనీ అని, అలాంటి సంస్థలు ఇలాంటి ప్రాజెక్టులను సబ్ కాంట్రాక్ట్‌కు ఇస్తాయని తాను అనుకోవడం లేదని చెప్పారు. ఎంపీగా గెలిచిన తర్వాత ఐదేండ్లుగా కనిపించని బండి సంజయ్.. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని యాత్రలు చేస్తున్నారని విమర్శించారు.
ఐదేండ్లలో నియోజకవర్గ అభివృద్ధికి రూ.5 కూడా తీసుకురాలేకపోయారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ఏండ్ల తరబడి అమలు చేస్తున్న ఉపాధి హామీ, తదితర పథకాలకు కూడా తానే నిధులు తీసుకొచ్చానంటూ పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకోవడం బండి సంజయ్‌కే చెల్లిందని ఎద్దేవా చేశారు. ఈ సారి ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతోనే బండి సంజయ్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సమావేశంలో గంగాధర ఎంపీపీ మధుసూదన్, బీఆర్ఎస్ నాయకులు హమీద్, జక్కుల నాగరాజు, దూలం సంపత్‌గౌడ్, వోల్లాల శ్రీనివాస్‌గౌడ్, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.