Harish Rao | సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తోందని హరీశ్‌రావు అన్నారు. ఒక పక్క హోం శాఖ జీవో ఇస్తుంది.. సినిమా మంత్రి ఏమో నాకు సంబంధం లేదు, నా దగ్గరికి ఎవరూ రాలేదు అంటారని అన్నారు. ఐటీ మంత్రిని నేనే, సివిల్ ఏవియేషన్ మంత్రిని నేనే అని ఈ మధ్య చెప్పుకున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇపుడు ఉన్న శాఖ తో తనకు సంబంధం లేదని ఎందుకు అంటున్నారని అనుమానం వ్యక్తం చేశారు. సినిమా టికెట్ల రేటు పెంపు సీఎం నిర్ణయమేనని కోమటి రెడ్డి చెప్పకనే చెబుతున్నారని అన్నారు. అంటే, తెలంగాణలో సినిమా శాఖకు మంత్రి ఉన్నట్టా..లేనట్టా అని ప్రశ్నించారు.
సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే జీవోలు విడుదల అవుతున్నాయంటే.. ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు అని నిలదీశారు. తెర వెనుక ఏ రాజ్యాంగేతర శక్తి ఉందని ఆయన అన్నారు. ఒక సినిమా రిలీజ్ సమయంలో దుర్ఘటన జరిగినప్పుడు నీతులు చెప్పారు.. ఇప్పుడేమో యథేచ్ఛగా రేట్లు పెంచుతున్నారు. మంత్రికి తెలియకుండా పాలన సాగడమేనా మీ ప్రజా పాలన అని ధ్వజమెత్తారు.
అసలు సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా? లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారా? అని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరు.. ఇంకో సినిమాకేమో రెండు రోజుల ముందే రాచమర్యాదలతో పర్మిషన్ ఇస్తారని అన్నారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష గడతారు.. మీ పేరు మర్చిపోయినందుకు ఇంకో హీరోని జైలుకు పంపిస్తారు. ఇప్పుడు మీకు నచ్చినోళ్లు అయితే.. రూ. 600 టికెట్ రేటుకి పర్మిషన్ ఇస్తారా అని మండిపడ్డారు. వారానికి వారం రోజులు రేట్లు పెంచుకోవచ్చని రెడ్ కార్పెట్ వేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలకుడు అనేవాడు పాలసీ తో ఉండాలి తప్ప, పగతో ఉండకూడదని రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు హితవు పలికారు. గత పదేళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకున్నామని గుర్తుచేశారు. ఎక్కడా వివక్ష చూపలేదన్నారు. అందుకే ఇవాళ తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి ఎదిగిందని తెలిపారు. ప్రపంచం గర్వించేలా మన సినిమాలు తయారవుతున్నాయని అన్నారు. 50, 60 ఏళ్లుగా ఎంతోమంది కష్టపడి నిర్మించుకున్న ఈ పరిశ్రమ వాతావరణాన్ని.. మీ అహంకారంతో, మీ పిచ్చి చేష్టలతో, మీ పగ ప్రతీకారాలతో, మీ చిల్లర రాజకీయాలతో నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వమంటే అందరినీ సమానంగా చూడాలి. ఒకరికి చుట్టం .. మరొకరికి శత్రుత్వం ఉండకూడదని తెలిపారు. సినిమా వాళ్లను కూడా మీ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఇది ప్రజా పాలన కాదు.. ఇది మీ పాపిష్టి పాలన కు పరాకాష్ట అని అన్నారు. మొన్న ఎన్నికల్లో ఓడిపోయి.. నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరో? ఒక్కో సినిమాకు కమిషన్ల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో?.. ఆ వివరాలన్నీ త్వరలోనే బయటపెడతామన్నారు. ఆ శాఖ మంత్రికి తెలియకుండా జరుగుతున్న ఈ సినిమా రేట్ల కమిషన్ల దందాపై గవర్నర్ దృష్టి సారించాలని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.