Professor Saibaba | మానవహక్కుల ఉద్యమకారుడు, ప్రముఖ రచయిత, విద్యావేత్తగా గుర్తింపు పొందిన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. సాయిబాబా శనివారం రాత్రి 8.45 గంటలకు గుండెపోటుతో మరణించారని నిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు.
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని 2014లో సాయిబాబాను పోలీసులు అరెస్టు చేశారు. 2017లో సాయిబాబాకు గడ్చిరోలి సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 2014 నుంచి 2024 మార్చి 6వ తేదీ వరకు ఆయన నాగ్‌పూర్ జైల్లో ఉన్నారు. ఈ ఏడాది మార్చి 7వ తేదీన నిర్దోషిగా జైలు నుంచి విడుదలయ్యారు సాయిబాబా. అయితే మావోయిస్టులతో సంబధాలున్నాయంటూ పదేళ్ల క్రితం వరుసపెట్టి చాలా మందిని అరెస్ట్ చేయించింది నాటి ప్రభుత్వం. ఫోన్ కాల్ మాట్లాడారు, పుస్తకాలు ఉన్నాయి లాంటి రీజన్స్‌తో కూడా నిర్దాక్ష్యణ్యంగా జైల్లో వేశారు. అలా అరెస్ట్ అయిన వారిలో తెలుగు వారిలో విరసం నేత వరవరరావు ఒకరైతే.. ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ సాయిబాబా మరొకరు.
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఓ పేద రైతు కుటుంబంలో సాయిబాబా జన్మించారు. ఐదేళ్ల వయసులోనే పోలియో సోకి రెండు కాళ్లూ పూర్తిగా దెబ్బతిన్నాయి. స్థానికంగా విద్యాభ్యాసం చేసిన తరువాత అమలాపురంలోని శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి పీజీ పట్టా పుచ్చుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల రామ్‌లాల్ ఆనంద్ కాలేజ్‌లో సాయిబాబా ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పని చేశారు. 2013లో పీహెచ్డీ పూర్తి చేశారు.
అమలాపురంలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న కాలంలోనే సాయిబాబా వామపక్ష రాజకీయాల వైపు ఆకర్షితుడయ్యారు. తరువాత ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరమ్ (ఏఐఆర్‌పీఎఫ్) లో చేరారు. 1992లో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో చదివేటప్పుడు ఏఐఆర్‌పీఎఫ్ ఆంధ్రప్రదేశ్ కమిటీకి కార్యదర్శి అయ్యారు. ఆ తరువాత 1995లో ఆ సంస్థకు ఇండియా ప్రధాన కార్యదర్శి గా కూడా పనిచేశారు. దీని తరువాత ఆర్డీఎఫ్ అనే సంస్థలో పని చేశారు సాయిబాబా. తెలంగాణలోని ప్రజా ఉద్యమాలే తనకు చదువును, చైతన్యాన్ని నేర్పాయని, తనను వ్యక్తిగా తీర్చిదిద్దింది తెలంగాణే అని సాయిబాబా పలు సందర్భాల్లో పేర్కొన్నారు.
ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సమయంలో సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ… 2014లో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు నేపథ్యంలో 2014లో ఆయనను ఢిల్లీ యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. 2021లో పూర్తిగా విధుల నుంచి తొలగించింది. కాగా, 90 శాతం వైకల్యంతో వీల్‌చైర్‌కే పరిమితమైన సాయిబాబా మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకుని దేశద్రోహానికి పాల్పడ్డారన్న ఆరోపణపై ఆయనతో పాటు మరో ఐదుగురికి మహారాష్ట్ర, గడ్చిరోలి ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించడంతో 2017 నుంచి నాగ్‌పూర్ జైలులోనే ఉన్నారు. అంతకుముందు కూడా ఆయన 2014 నుంచి 2016 వరకు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలయ్యారు. 2017లో జీవిత ఖైదు విధించడంతో.. మళ్లీ ఆయన నాగ్‌పూర్ జైలుకు వెళ్లారు. ఈ ఏడాది మార్చి 6వ తేదీ వరకు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. మార్చి 7వ తేదీన నిర్దోషిగా జైలు నుంచి విడుదలయ్యారు సాయిబాబా.
సాయిబాబా వీల్ ఛైర్లోనే పదేళ్ల పాటూ జైల్లో జీవించారు. ఈ కాలంలో ఆయన చాలా నరకం అనుభవించారు. కరోనా సమయంలో అత్యంత దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఎన్ని సార్లు తన ఆరోగ్యం గురించి అప్పీలు చేసుకున్నా కోర్టులు పట్టించుకోలేదు. జైల్లో ఉన్న కాలంలో సాయిబాబాను 21 రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. జైల్లో సరైన సదుపాయాలు కల్పించడం లేదని.. కరోనా వైరస్ పేరుతో చంపడానిక కుట్ర చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే, వారి ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది. కేస్లుల్లో తీవ్రత దృష్ట్యా వయసు, అనారోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వకూడదని న్యాయస్థానాల్లో వాదిస్తూ వచ్చింది. కానీ ఆరోగ్య సమస్యలే ఇప్పుడు జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన ప్రాణాన్ని తీసుకున్నాయి.
పదేండ్ల జైలు జీవితంలో అనేక రోజులు చీకటి జీవితాన్ని అనుభవించినట్లు సాయిబాబా గతంలో పేర్కొన్నారు. జైలు అధికారులు చిత్రహింసలకు గురయ్యే పరిస్థితిలు కల్పించి తనను మానసికంగా వేధించారని తెలిపారు. వీల్‌చైర్ లేకుండా నడవలేని తనను వీల్‌చైర్ తిరగని సెల్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. తన అరెస్టుకు ముందు కొంతమంది అధికారులు తనను కలిసి మేము చెప్పినట్లుగా చేస్తే వదిలేస్తామని, లేకుంటే తప్పుడు కేసుల్లో ఇరికించి జైలుకు పంపి బయటకు రాకుండా చేస్తామని హెచ్చరించారని ఆరోపించారు. అత్యంత క్రూరమైన నేరాలకు పాల్పడిన వారిని ఉంచే సెల్లో తనను ఉంచారని, అందులో కనీసం వీల్ చైర్ తిరిగే పరిస్థితి కూడా ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు సాయిబాబా.
తాను ఈ పదేళ్లలో చాలా కోల్పోయానని సాయిబాబా ఆవేదన వ్యక్తం చేశారు. తన స్టూడెంట్స్‌తో సంబంధాలు తెగిపోయాయి. తరగతులకు దూరమయ్యాను. తాను జైల్లో ఉన్నా విద్యార్థులకు పాఠాలు చెబుతున్నట్లు, వారితో మాట్లాడుతున్నట్లు కలలు వచ్చేవి అన్నారు.
ఇవి కూడా చదవండి..
GN Saibaba | ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుమూత
GN Saibaba | ప్రొఫెసర్ సాయిబాబా మృతిపట్ల కూనంనేని సాంబశివరావు, నారాయణ సంతాపం
Baba Siddique | మహారాష్ట్రలో దారుణం.. ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య