హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కనీసం రైతులకు విత్తనాలు సక్రమంగా సరఫరా చేయలేని అసమర్థ ప్రభుత్వం ఉన్నదని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. రైతు సమస్యలను రేవంత్ సర్కారు గాలికి వదిలేసిందని విమర్శించారు. విత్తనాలు, ఎరువుల లభ్యతపై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఆరు నెలలపాలనలో రైతులు ఆగమయ్యారని, రాష్ట్రంలో విత్తనాల కొరత లేదని వ్యవసాయ మంత్రి తుమ్మల అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. తుమ్మల చెప్పే మాటలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతనే లేదని చెప్పారు. రైతు సమస్యలపై సర్కారుకు సరైన అవగాహన లేదని, సీఎం మంత్రుల మధ్య సమన్వయం లేదని విమర్శించారు. గురువారం తెలంగాణభవన్‌లో ఎమ్మెల్యే అనిల్‌జాదవ్, ఖానాపూర్ బీఆర్ఎస్ ఇన్చార్జి జాన్సన్‌నాయక్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కోసం వచ్చిన రైతులపై లాఠీచార్జి చేయడం అమానుషమని, ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు. రైతులకు ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పదేండ్లలో రైతులకు ఇలాంటి కష్టాలు ఎప్పడూ రాలేదని గుర్తుచేశారు. ప్రభుత్వ చేతకానితనం వల్లే విత్తనాలు అందక రైతులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో 4.20 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని, గతంలో తాము 1.20 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని, కానీ ఈ సారి 40-50 వేల ప్యాకెట్లు ఉన్నాయని తెలిపారు. రెండు మూడు రోజుల్లో రైతులు అడిగిన విత్తనాలు అందుబాటులో ఉంచకపోతే జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. రైతులు అడిగిన విత్తనాల రకాలనే అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. విత్తనాల లభ్యతపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చామని జోగు రామన్న చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డికి ఎపుడూ రైతుల గురించి పట్టింపే లేదని జోగు రామన్న విమర్శించారు. రేవంత్ అప్పుడు ఐపీఎల్ మ్యాచ్‌లో, ఇపుడు అధికార చిహ్నాలు మార్చడంలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. ఉపముఖ్యమంత్రి భట్టి రాష్ట్ర సమస్యలు వదిలేసి వేరే రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్తున్నారని విమర్శించారు. రైతులు మళ్లీ కమీషన్ ఏజెంట్లను ఆశ్రయించడమే ఇందిరమ్మ రాజ్యమా? రైతులను ఇబ్బంది పెట్టడమే మార్పా? అని నిలదీశారు. మంత్రి జూపల్లికి తన శాఖలో ఏం జరుగుతున్నదో తెలియకపోవడం శోచనీయమని మండిపడ్డారు. సీఎంకు వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ రైతుల బాగోగుల మీద లేదని విమర్శించారు. వర్షాకాలం సాగునీటి విడుదలపై ప్రభుత్వానికి ఓ కార్యాచరణ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, కేసీఆర్ రైతుల పట్ల చూపిన శ్రద్ధలో రేవంత్ పదిశాతం పెట్టినా ఇన్ని సమస్యలు వచ్చేవి కావని చెప్పారు. రైతు సమస్యలపై సీఎం రేవంత్ ఎందుకు నోరు మెదపరని నిలదీశారు. రైతు భరోసా ఎప్పట్నుంచి వేస్తారో సీఎం చెప్పాలని డిమాండ్‌చేశారు.