Indiramma Indlu | హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : అధికారంలోకి వస్తే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఏడాది గడచినా ఆచరణపై దృష్టిపెట్టలేదు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వానికి అందిన దరఖాస్తులు ఏమయ్యాయో? లబ్ధదారుల ఎంపిక ఎప్పుడో? అర్హతలు, విధివిధానాలు ఏంటో కూడా చెప్పలేదు. గ్రామాలు, పట్టణాల్లో నివసించే వారికి ఎలాంటి నిబంధనలు అమలు చేస్తారో కూడా సర్కారు నుంచి స్పష్టతలేదు. ఇందిరమ్మ ఇండ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుండగా 82లక్షల మంది దరఖాస్తుదారులు గంపెడాశతో నిరీక్షిస్తున్నారు. జాగా ఉంటే 5 లక్షలు ఇస్తామంటూ ఎన్నికల్లో ప్రకటించిన కాంగ్రెస్ అది ఆచరణసాధ్యం కాదని భావిస్తున్నట్టు సమాచారం. కేంద్రం ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఆర్థికసాయం చేయాలని మెలిక పెట్టనున్నట్టు తెలుస్తున్నది.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మొదటి విడతలో 4.5లక్షల ఇండ్లు నిర్మిస్తామని రేవంత్రెడ్డి ప్రభుత్వం గొప్పగా చెప్పింది. కానీ అర్హతలు ఏమిటనేది వెల్లడించలేదు. పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవాలంటే ఎల్ఆర్ఎస్కు, అనుమతులకే కనీసం లక్ష రూపాయల వరకు ఖర్చవుతున్నది. అనుమతుల నుంచి మినహాయింపు ఉంటుందా? తేలాలి.
గ్రామీణ ప్రాంతాలకు చెందిన చాలామంది ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా హైదరాబాద్లో నివసిస్తున్నారు. కానీ వారిలో కొందరికి సొంత గ్రామాలు, పట్టణాల్లో ఇంటి స్థలం ఉంటే.. ఆధార్ కార్డులు, గ్యాస్ కనెక్షన్లు హైదరాబాద్లో ఉంటే.. ఇల్లు మంజూరు చేస్తారా? అనేవి తేలాల్సి ఉంది. యాప్ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేస్తామంటున్న ప్రభుత్వం మరి కమిటీలను ఎందుకు ఎంపిక చేసినట్టో స్పష్టత ఇవ్వాల్సిన అవసరముందని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. కమిటీలతో అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుంది అని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ప్రభుత్వానికి 82లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది 4.5లక్షల మందికి ఇండ్ల కోసం రూ.5లక్షల చొప్పున ఇవ్వాలంటే రూ.22,000 కోట్లు అవసరం. బడ్జెట్లో రూ.7,740 కోట్లు మాత్రమే కేటాయించింది. దీంతో కాంగ్రెస్ సర్కారు మరో ఎత్తుగడ వేస్తున్నది. తామే ఇండ్లు ఇస్తామని చెప్పి, ఇప్పుడు కేంద్రం మంజూరు చేసిన వారికే ఇవ్వాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. కేంద్రం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదల కోసం గృహనిర్మాణ పథకాలు అమలు చేస్తున్నది.