జ్యోతినగర్, జూన్ 5: మాతృత్వం కోసం ఓ మహిళ ఎనిమిదేండ్లుగా నిరీక్షించింది. ఇంతలో కడుపులో నలుసుపడి ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భంతో ఉన్నది. కానీ.. ఆమె మాతృత్వపు కల నెరవేరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది. సోమవారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఎనిమిది నెలల గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల వివరాల ప్రకారం.. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని మల్యాలపల్లికి చెందిన కత్తెరమల్ల క్రాంతికుమార్, రామగుండంలోని అయోధ్యనగర్‌కు చెందిన నిహారిక (24) ఎనిమిదేండ్ల క్రితం ప్రేమ పెండ్లి చేసుకున్నారు. వీరికి సంతానం కాకపోవడంతో నాలుగేండ్లుగా దవాఖానల చుట్టూ తిరుగుతున్నారు.
మందులు కూడా వాడుతున్నారు. అంతలోనే వీరికి శుభవార్త అందింది. ఎనిమిదేండ్లకు నిహారిక గర్భం దాల్చడంతో వారి ఆనందానికి అవుధుల్లేవు. నెలలు నిండుతున్న కొద్దీ ఆ జంట మురిసిపోయింది. మరో నెల అయితే తమ ఇంటికి కొత్త వెలుగు వస్తుందని ఎంతో సంబురంగా ఎదురుచూసింది. నిహారిక ఆధార్ కార్డులో ఉన్న తల్లిగారి అడ్రస్‌ను మార్పించుకునేందుకు భర్త కాంత్రికుమార్తో కలిసి బైక్‌పై సోమవారం ఎన్టీపీసీ ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్‌లోని మీ సేవకు వెళ్లింది. పని పూర్తిచేసుకొని వెనుదిరిగింది. ఎన్టీపీసీ క్రషర్‌నగర్ ఏరియా రోడ్లో వస్తుండగా వెనుకాల వస్తున్న కారు అతి వేగంగా ఢీకొంది. దీంతో భర్త స్వల్పంగా, నిహారిక తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే నిహారికను గోదావరిఖని ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. అప్పటికి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. భర్త ఫిర్యాదు మేరకు ఎన్టీపీసీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి.. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకొన్నారు. డ్రైవర్ అన్వర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.