Revanth Reddy | మొత్తం మీద గురుశిష్యులిద్దరూ కృష్ణా జలాల మీద మ్యాచ్ ఫిక్సింగ్ నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు. శుక్రవారం నాడు ఆ ఇద్దరి మాటల్లో వారి మిలాఖత్ వ్యవహారం బట్టబయలైంది. అత్తగారి సొత్తులా శ్రీశైలాన్ని ఏపీకి ధారపోసి, దాని మీద తెలంగాణ సర్వహక్కులను వదులుకోవడానికి రేవంత్ సర్కార్, తెలంగాణ నుంచి నీళ్లు రాబట్టాననే వీర కంకణం వేసుకోడానికి చంద్రబాబు కలిసి ముందస్తుగా తయారుచేసుకున్న స్క్రిప్ట్‌ను ఇద్దరూ పొల్లుపోకుండా వల్లించారు.
అటు ఏపీలో జగన్, ఇటు తెలంగాణలో బీఆర్ఎస్.. కృష్ణా జలాల మళ్లింపు మీద విరుచుకుపడటంతో ఇద్దరికీ ఏదో ఒకటి చెప్పక తప్పని పరిస్థితి. భాష ఇంచుమించు ఇద్దరిదీ ఒకటే! కాకపోతే ఒకటే తేడా! ఎగువ రాష్ట్రంగా దబాయించి నీళ్లు తీసుకోవాల్సిన రేవంతేమో ‘మాకు నీళ్లు ఇవ్వండి’ అంటూ కాళ్ల బేరానికి దిగి దేబరిస్తుంటే.. పైవాడు వదిలిన నీళ్లు మహాప్రసాదమని కండ్లకద్దుకొని తీసుకోవాల్సిన చంద్రబాబు ‘చుక్క నీరు వదులుకునేది లేదు’ అని హూంకరిస్తున్నాడు.
ప్రపంచంలో ఎక్కడైనా ఎగువన ఉన్న వాడు జబర్దస్తీగా నీటిని లా గేసుకుంటాడు. దిగువన ఉన్నవాడు లబోదిబోమంటాడు. కానీ ఇక్కడ పరిస్థితి ఉల్టాపల్టా ఉన్నది. ఇదే కృష్ణానదికి మనకు ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక గతంలో మనమెంత మొత్తుకున్నా వినకుండా జబర్దస్తీ చేసి ఆల్మట్టి తదితర ప్రాజెక్టులు కట్టుకున్నా యి. నీళ్లు లాగేస్తున్నాయి. కావేరీ జలవివాదంలో కర్ణాటక దయతలిస్తే కానీ తమిళనాడుకు చుక్క నీరు రాదు. సుప్రీంకోర్టు చెప్పినా ఖాతరు చేయరు. కానీ ఇక్కడేమిటి? దయచేసి మా ప్రాజెక్టుల మీద ఫిర్యాదులు చేయకండి, మాకు కేంద్రం నిధులు రావు.. నుం చి మొదలైన దేబరింపులు చివరికి ‘ఏపీలో పోర్టులు వాడుకోనివ్వ రు’ అంటూ పక్క రాష్ర్టానికి కొత్త ఐడియాలు ఉప్పందిస్తున్న తీరు!
‘తెలంగాణకు వివాదాలు కాదు, నీళ్లు కావాలంటూ’ సుద్దులు చెప్తూ.. మరి ఆ నీళ్లు ఎలాగైనా సాధించేందుకు అవసరమైతే యుద్ధాలు చేయాలన్న ఇంగిత జ్ఞానాన్ని వదిలేయడం విచిత్రం. మరోవైపు బాబు మాటలు మరీ విడ్డూరం.. ఏపీ వదిలిన నీళ్లు తెలంగాణ వాడుకోవాలట! నీళ్లు ఎటునుంచి ఎటు ప్రవహిస్తున్నాయన్న భౌగోళిక అంశం ఆయన మతిమరుపు జాబితాలో ఏమన్నా చేరిందా? అనే అనుమానం కలుగుతున్నది. అంతే కాదు నదుల అనుసంధానంతోనే ఇరు రాష్ర్టాలకు మేలట! అంటే తెలంగాణలోని గోదావరిలో మిగులు జలాలున్నాయి. వాటిని నీళ్లు లేని ఏపీ ప్రాజెక్టులకు తరలిస్తామని చెప్పడమే!
ఇదంతా వదిలేసి ‘దయచేసి చర్చించుకుందాం’ అని తెలంగాణ ప్రభుత్వం ఏపీ కాళ్ల మీద సాగిలపడుతున్నది. ‘ఏపీ పోర్టులు వాడుకోనివ్వరు’ అంటూ తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నది. షిప్ యార్డులు, పోర్టులు అనేవి కేంద్రం అధికార పరిధిలో ఉంటాయి. వాటిని వాడుకోవడానికి దేశంలో ఒక రాజ్యాంగం ఉన్నది. విధానం ఉన్నది. హక్కు ఉన్నది. సీఎంవో స్క్రిప్ట్ రైటర్లకు ఈ జ్ఞానం ఉన్నట్టు లేదు!!
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 9 (నమస్తే తెలంగాణ): మావటివాడు ఏనుగును చిన్నప్పుడే గొలుసుతో కట్టేస్తాడు. మొదట్లో అది గొలుసును తెంపుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తుంది. కానీ, దాని బలం సరిపోక నిస్సహాయంగా ఉండిపోతుంది. ఏనుగు పెరిగి పెద్దదైన తర్వాత కూడా మావటి గొలుసుతో కట్టగానే కదలకుండా ఉండిపోతుంది. వాస్తవంగా అది తల్చుకుంటే గొలుసును గడ్డిపోచలా తెంపుకోవచ్చు. కానీ, దాని మస్తిష్కంలో చిన్నప్పటి జ్ఞాపకం ఉండిపోయి ఆ గొలుసును తెంపుకోవడం తనవల్ల కాదని అనుకొని అక్కడే ఉండిపోతుంది. మరి ఇక్కడ గొలుసు గొప్పతనమా? ఏనుగు అజ్ఞానమా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరు కూడా ఇలాగే తయారైంది.
ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత దగ్గర పనిచేసిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు తాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని అనే వాస్తవాన్ని మరచిపోతున్నారు. తన రాజకీయ ప్రస్థానంలో ఏనాడూ తెలంగాణ గడ్డ మేలు కోరని చంద్రబాబు కనుసన్నల్లోనే ఇంకా తాను పనిచేస్తున్నట్టు భావిస్తున్నట్టున్నారు. నదీజలాల అంశంపై శుక్రవారం రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రుల ప్రసంగాలను చూసిన తర్వాత సగటు తెలంగాణవాది నుంచి సాగునీటిరంగ నిపుణుల వరకు అందరిలోనూ ఇలాంటి ప్రశ్నలే తలెత్తుతున్నాయి.
ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 45 టీఎంసీలను ఏపీకి ధారాదత్తం చేసేందుకు తెరవెనుక జరిగిన గురుశిష్యుల కుమ్మక్కును కేసీఆర్ బయటపెట్టినప్పటి నుంచి రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రుల పరిస్థితి, ప్రసంగాలు విచిత్రంగా తయారయ్యాయి. చంద్రబాబు రాజకీయంగా ఆయనకు గురువు కావచ్చు.. అది వ్యక్తిగతం. కానీ, ఇప్పుడు రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి. నాలుగున్నర కోట్ల తెలంగాణ సమాజానికి ప్రతినిధి. అలాంటి గౌరవప్రదమైన హోదాలో ఉండి, ఒకవైపు చంద్రబాబు నదీజలాలపై హూంకరించినట్టు మాట్లాడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం బాబును దేబరిస్తూ పదేపదే విజ్ఞప్తి చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. సాధారణంగా ఎవరైనా అవసరముంటే ఒక మెట్టు దిగొచ్చు. కానీ, ఇక్కడ అలాంటి పరిస్థితి ఏమాత్రం లేదు.
భౌగోళికంగా చూస్తే కృష్ణా బేసిన్లో తెలంగాణ ఎగువన ఉన్నదనే విషయాన్ని సైతం సీఎం రేవంత్‌రెడ్డి మరచిపోయినట్టున్నారు. వాస్తవానికి శ్రీశైలం జలాశయం నుంచి నీటిని ఎత్తిపోసుకునే స్వేచ్ఛ తెలంగాణకు పుష్కలంగా ఉన్నది. అలాంటప్పుడు ప్రాజెక్టులు పూర్తి చేసుకొని ఆంధ్రప్రదేశ్ ముఖం మీద కొట్టినట్టుగా తెలంగాణ రైతులకు కృష్ణాజలాలను అందించవచ్చు. కేసీఆర్ ప్రభుత్వం అదే చేసింది. భౌగోళికంగా ఉన్న సానుకూలతను అడ్డంపెట్టుకొని ఏపీ పోతిరెడ్డిపాడు ద్వారా ఇష్టానుసారంగా నీటిని తరలించుకుపోతున్నది.
అయితే, శ్రీశైలం జలాశయంలో 541 అడుగులకు పైబడి నీటిమట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా జలాల తరలింపు సాధ్యమవుతుంది. అందుకే, కేసీఆర్ దీనిని గుర్తించి శ్రీశైలం గర్భం నుంచి సైతం కృష్ణాజలాలను ఎత్తిపోసుకునేలా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేశారు. పంపుహౌస్‌లు, కాల్వలు, రిజర్వాయర్లు… ఇలా 90% పనులు పూర్తిచేశారు. మిగిలిన పనులు కూడా పూర్తి చేసి ఏపీకి దీటుగా శ్రీశైలం నుంచి నీటిని ఎత్తిపోయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్ల నుంచి ఆ ప్రాజెక్టును పడావు పెట్టింది. పైగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు దయాదాక్షిణ్యాల కోసం అర్రులు చాస్తున్నది.
ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ మీద కక్షగట్టడం కొత్తేమీ కాదు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు… రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణలోని మేజర్ ప్రాజెక్టుల నుంచి చివరకు తుమ్మిళ్ల, భక్తరామదాసు వంటి చిన్న ప్రాజెక్టులపైనా విషం కక్కి కేంద్రానికి పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేశారు. అంతమాత్రాన కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కాళేశ్వరంపై కాళ్లకు బలపం కట్టుకొని కేంద్రానికి అనేకసార్లు బాబు ఫిర్యాదు చేసినా కేసీఆర్ ఆ ప్రాజెక్టును పూర్తిచేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎన్జీటీ కేసు విషయంలో తప్ప కేసీఆర్ ప్రభుత్వం ఏనాడూ నెమ్మదించకుండా శరవేగంగా పనులు జరిపించింది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఎన్ని ఫిర్యాదులు చేసినా మన భూభాగంలో చేపడుతున్న ప్రాజెక్టుల పనులను నిలువరించే పరిస్థితి కేంద్రానికిగానీ, ఇతర రాష్ర్టాలకుగానీ ఉండదు.
ఎగువ రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్ర కృష్ణా, గోదావరి నదులపై ఇబ్బడిముబ్బడిగా ప్రాజెక్టులను నిర్మించుకున్నాయి. చివరకు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమలుపై సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ కర్ణాటక ఆల్మట్టి సామర్థ్య పెంపునకు భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ఎన్ని ఫిర్యాదులు చేసినా ఆ రెండు రాష్ర్టాల్లోని ప్రాజెక్టుల్లో కనీసం పిల్ల కాలువల పనులను కూడా అడ్డుకోలేకపోయాం. అదేరీతిన ఆంధ్రప్రదేశ్ ఎన్ని ఫిర్యాదులు చేసినా కేసీఆర్ పదేండ్ల కాలంలో రెండు నదులపైనా ప్రాజెక్టుల నిర్మాణ పనులు వేగంగా జరిగాయి. ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు కావాలంటే నికరజలాల కేటాయింపు ఉండాలి.
కానీ, ఉమ్మడి రాష్ట్రంలోని ప్రాజెక్టులు అయినా కల్వకుర్తి మొదలు పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రాజెక్టులకు నికరజలాల కేటాయింపు లేదు. ఎందుకంటే, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జలయజ్ఞంలో భాగంగా ప్రాజెక్టులు చేపడుతున్నప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక ట్రిబ్యునల్‌కు ఫిర్యాదులు చేశాయి. దీంతో ట్రిబ్యునల్ సీరియస్ కావడంతో అసలు ఈ ప్రాజెక్టులను తాము నికరజలాలను అడగబోమని.. వరద జలాలపైనే కట్టుకుంటున్నామంటూ అప్పటి వైఎస్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ట్రిబ్యునల్‌కు లిఖితపూర్వక హామీ ఇచ్చి శాశ్వతంగా తెలంగాణ కొంప ముంచింది. ఆ పాపమే ఇప్పటికీ తెలంగాణను వెంటాతూనే ఉన్నది.
అందుకే కేసీఆర్ ప్రభుత్వం 2022 వరకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర జల సంఘానికి సమర్పించలేకపోయింది. చివరకు పోలవరం మళ్లింపు కింద 45 టీఎంసీలు, మైనర్ ఇరిగేషన్ పొదుపు కింద మరో 45 టీఎంసీల నీటిని జోడించి నికరజలాల కేటాయింపు ఉన్నదంటూ డీపీఆర్ సమర్పించింది. ఎలాగూ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే పనులు చేపడుతున్నందున కేంద్రం నుంచి అనుమతులు వచ్చేవరకు ఆగకుండా పనుల్ని శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నించారు. వాస్తవానికి ఈ రెండేండ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించినట్లయితే ప్రాజెక్టు పూర్తిస్థాయి ఫలాలు పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి రైతాంగానికి అందేవి. అది చేయకుండా పనులను పడావుపెట్టి… చివరకు 45 టీఎంసీల నికరజలాల కేటాయింపును సైతం వదులుకుంటూ కేంద్రాన్ని అనుమతులు కోరి పాలమూరు గొంతునులిమే ప్రయత్నం చేస్తున్నది.
ఇటీవల అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై మాట్లాడిన సందర్భంగా… ప్రాజెక్టుకు అనుమతుల్లో ఏపీ సహకరించకపోతే జూరాల నుంచి నీటిని మళ్లిస్తానంటూ హెచ్చరించారు. అంతేకాదు, తాను క్లోజ్డ్ డోర్లో చంద్రబాబును ఒప్పించి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేయించానంటూ గొప్పలు చెప్పుకున్నారు. కానీ, ఆ తర్వాత రెండు అంశాల్లోనూ సీన్ రివర్స్ అయింది. అసెంబ్లీలో జూరాల బూచి చూపి కన్నెర్రజేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. తాజాగా శుక్రవారం రావిర్యాల సభలో మాత్రం ‘బాబ్బాబు మా ప్రాజెక్టులకు అడ్డంకులు కల్పించకండి’ అంటూ చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.
ఇదేకాదు.. తాను చెప్తే చంద్రబాబు తెలంగాణ ప్రయోజనాల కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపినట్టుగా రేవంత్ చెప్పిన రోజు వ్యవధిలోనే ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణకు చెందిన పదహారు ప్రాజెక్టులపై కేంద్రానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తాను తెలంగాణను ద్వేషించే బాబును అని మరోసారి రుజువు చేసుకున్నారు. తాజాగా ఇంకో అడుగు ముందుకేసి.. శుక్రవారం ఒక సభలో తెలంగాణకు పరోక్షంగా హెచ్చరికలు జారీచేశారు. తాను ఏపీ ప్రయోజనాల విషయంలో రాజీ పడబోనని, ఆంధ్రప్రదేశ్ నీళ్లు వాడుకోగా మిగిలిన నీటిని తెలంగాణ వాడుకోవచ్చంటూ తన దయాదాక్షిణ్యాలపై తెలంగాణ రైతులు ఆధారపడినట్టుగా అహంకారాన్ని ప్రదర్శించారు.
ఒకవైపు సుద్దులు చెప్తూనే మరోవైపు శ్రీశైలం జలాశయాన్ని రాయలసీమకు మళ్లిస్తానని స్పష్టం చేశారు. ఇందుకు దీటుగా జవాబు చెప్పాల్సిన తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరించారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదు చేయొద్దని, కూర్చుని మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ పదేపదే దేబరించారు. కానీ ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా, కేంద్రం అనుమతులు ఇవ్వకున్నా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి పాలమూరు జిల్లాను సంపూర్ణంగా సస్యశ్యామలం చేస్తానని మాత్రం రేవంత్‌రెడ్డి అనడం లేదు. దీనిని బట్టే సీఎం హోదాలో ఉన్నా ఇప్పటికీ చంద్రబాబును చూసి రేవంత్‌రెడ్డి జంకుతున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో చంద్రబాబును పదేపదే దేబరించడం తెలంగాణ ప్రయోజనాల కోసమే అన్నట్టుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి అభాసుపాలయ్యారు. ఏపీలోని మచిలీపట్నం పోర్టుకు ఫోర్త్‌సిటీ నుంచి 12 లేన్ల రహదారిని నిర్మిస్తున్నారట. పోర్టు కోసం తెలంగాణకు ఏపీ అవసరం ఉన్నదని, కాబట్టి బతిమిలాడుకోవడం తప్పదన్నట్టుగా మాట్లాడారు. దేశంలోనే పోర్టులేని ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అంటూ తన విజ్ఞానాన్నీ ప్రదర్శించారు. దేశంలో పోర్టులేని రాష్ర్టాలు అనేకం ఉన్నాయి. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, సిక్కింతోపాటు తెలంగాణ కూడా ఆ జాబితాలో ఉన్నది.
అంతమాత్రాన తెలంగాణకు దక్కాల్సిన నదీజలాల్ని ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టు పెట్టడం ఎంతవరకు సమంజసమని సాగునీటి రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అసలు పోర్టు నిర్వహణ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. పైగా ఫోర్త్‌సిటీ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు రహదారి నిర్మాణం కూడా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు. నదీజలాల అంశం వేరు… పోర్టు కనెక్టివిటీ వేరు. ఆ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్‌కు అనేక అంశాలకు సంబంధించి తెలంగాణతోనూ అనేక అవసరాలు ఉంటాయనే వాస్తవాన్ని సీఎం రేవంత్ మరిచిపోవడం గమనార్హం.
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లుగా నదీజలాల అంశంలో అనాలోచిత వ్యాఖ్యలు చేస్తూ, నిర్ణయాలు తీసుకుంటూ చివరకు తెలంగాణ పుట్టినే ముంచుతున్నదని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కృష్ణాజలాల పంపిణీలో తాత్కాలిక ఒప్పందం ఇప్పటికీ కొనసాగుతున్నది. ఏపీ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలుగా అందులో పొందుపరిచారు.
ఇది కేవలం పంపిణీ (షేరింగ్) మాత్రమేగానీ వాటాలు (కేటాయింపులు) కావు. పైగా బ్రిజేశ్ ట్రిబ్యునల్ అవార్డుపై సుప్రీంకోర్టు స్టే ఉన్నందున బచావత్ ట్రిబ్యునల్‌కు లోబడి మాత్రమే ఈ వాటాలు. అంటే 811 టీఎంసీల ఆధారంగా మాత్రమే పంపిణీని నిర్ధారించారు. ఇంతకంటే ఎక్కువ ఇన్‌ఫ్లోలు వచ్చినపుడు ఆ మేరకు పంపిణీ పరిమాణం కూడా పెరుగుతుంది. కానీ సీఎం రేవంత్ మొదలు మంత్రులు పదేపదే తెలంగాణ కేటాయింపులు 299 టీఎంసీలేనంటూ రాష్ర్టానికే నష్టం చేస్తున్నారు.
అదేవిధంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలోనూ 45 టీఎంసీల పోలవరం మళ్లింపు వాటా ట్రిబ్యునల్ పరిధిలో ఉన్నదని కేంద్రం చెప్పినప్పుడు ఏపీతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలకు గతంలో ఇచ్చిన అనుమతుల్లో అనుసరించినట్టుగా ‘తదుపరి ట్రిబ్యునల్ కేటాయింపులకు లోబడి’ అని ధ్రువీకరణ (అండర్‌టేకింగ్) ఇస్తామంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా గుడ్డిగా పాలమూరుకు 45 టీఎంసీల మేర అన్యాయం చేశారు. ఒకవైపు సముద్రంలో కలిసే 300 టీఎంసీల గోదావరిజలాలను విశాఖ, ఇతర ప్రాంతాలకు తరలిస్తానంటూ తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానిస్తే.. దానిని ప్రశ్నించకుండా ‘కూర్చుని మాట్లాడుదాం..’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి దేబరించడం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది. గురుశిష్యుల దొంగాటతో తెలంగాణకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.