హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : ఈసారి సైన్స్, గణితం కోర్సుల్లో ఉత్తీర్ణత శాతం పెరుగగా.. ఆర్ట్స్, కామర్స్ కోర్సుల్లో ఉత్తీర్ణత శాతం భారీగా పడిపోయింది. మరీ ముఖ్యంగా సీఈసీ, హెచ్ఈసీ కోర్సుల్లో 50శాతానికి పైగా విద్యార్థులు ఫెయిలయ్యారు. సహజంగా ఆర్ట్స్, కామర్స్ కోర్సులంటే సులభంగా పాస్ కావొచ్చన్న భావన విద్యార్థుల్లో ఉంటుంది. కఠినంగా ఉంటాయన్న భయంతోనే అత్యధికులు గణితం, సైన్స్ కోర్సుల్లో చేరేందుకు వెనుకంజ వేస్తారు. అయితే ఆదివారం విడుదలైన ఫలితాల్లో ఇందుకు పూర్తి విరుద్ధంగా కనిపించింది. సీఈసీ ఫస్టియర్లో 44.90%, సెకండియర్లో 49.39% ఉత్తీర్ణత మాత్రమే నమోదైంది. హెచ్ఈసీ ఫస్టియర్లో 34.34%, సెకండియర్లో 49.25% విద్యార్థులు మాత్రమే పాసయ్యారు. అదే ఎంపీసీలో 75శాతానికి పైగా ఉత్తీర్ణత సాధిస్తే, బైపీసీలో 72శాతానికి పైగా ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ఫలితాల్లో ఈసారి అత్యధికులు ఒకే మార్కులను సాధించి ప్రతిభచూపారు. ఇలాంటి వారు పదులు, వందల్లో ఉండటం గమనార్హం.
