హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ): నుమాయిష్‌తో కలిగే అనుభూతి ఆన్లైన్ షాపింగ్‌లో ఉండదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంత్రులు తలసాని శ్రీనివాస్, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ ఆలీతో కలిసి ఆదివారం 82వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చారిత్రక నేపథ్యం ఉన్న సొసైటీకి అధ్యక్షుడిగా వ్యవహరించటం తనకు దక్కిన గౌరవమని అన్నారు. వివిధ రాష్ర్టాల వ్యాపారులు, విభిన్న సంస్కృతులు, వింతైన రుచులు, మరెన్నో కళాకృతులు, వస్తువులు ఒకేచోట కొలువుదీరిన నుమాయిష్ షాపింగ్ అనుభూతి మరెక్కడ పొందలేమని చెప్పారు.
ప్రపంచంలోని ప్రముఖ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లలో హైదరాబాద్ నుమాయిష్ ఒకటని వ్యాఖ్యానించారు. ఎంతో చరిత్ర కలిగిన ఎగ్జిబిషన్ సొసైటీ 19 విద్యాసంస్థల ద్వారా 30 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నదని తెలిపారు. 3 వేల మందికి ప్రత్యక్షంగా, 10 వేల మందికి పరోక్షంగా, ఎంతోమంది చిరువ్యాపారులకు ఉపాధి కల్పిస్తున్నదని వెల్లడించారు. అన్ని రాష్ర్టాల వ్యాపారులుండే ఈ నుమాయిష్ తెలంగాణ జీవన విధానంలో భాగమైందని అన్నారు. అనంతరం నుమాయిష్ ట్రైన్లో పర్యటించి ఎగ్జిబిషన్ పరిసరాలు, స్టాళ్లు, వివిధ రాష్ర్టాల ఉత్పత్తులు, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ వైస్‌ప్రెసిడెంట్ మార్గం ఆశ్విన్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.