వరంగల్/వనపర్తి, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హనుమకొండ/హనుమకొండ చౌరస్తా: మాయ మాటలు, మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని మహిళలకు ఏం చేసిందో చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఇస్తామన్న హామీ ఏమైంది? పేదింటి ఆడబిడ్డ పెండ్లికి కేసీఆర్ ఇస్తున్న రూ.లక్షతోపాటు ఇస్తామన్న తులం బంగారం ఎక్కడని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చని రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు దేని కోసం విజయోత్సవ సభ పెడుతున్నారో చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ పాలనలో చేపట్టిన పనులకు తుదిదశ మెరుగులు దిద్ది తామే పూర్తి చేసినట్టు చెప్పుకుంటూ ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు టీ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, బానోత్ శంకర్‌నాయక్, నన్నపునేని నరేందర్‌లతో కలిసి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం హనుమకొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ ప్రభుత్వం తడిసిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తే.. ఈ ప్రభుత్వంలో రోడ్లపై, కళ్లాల్లోనే ఉండిపోయాయని విమర్శించారు. వరంగల్‌ను హెల్త్ సిటీగా అభివృద్ధి చేసే సంకల్పంతో కేసీఆర్ రూ.1,500 కోట్లతో అతి పెద్ద సూప్పర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం ప్రారంభించి 80 శాతం పనులు పూర్తి చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేయడం లేదని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. వచ్చే మార్చిలోపు నిర్మాణం పూర్తి చేయకపోతే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు మెడికల్ కాలేజీలు మంజూరు చేసిందని, కాంగ్రెస్ ఏం ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. వరంగల్‌లో కాంగ్రెస్ నిర్వహిస్తున్నది విజయోత్సవసభ కాదని, వైఫల్యాల సభ అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సభకు రైతులను పిలిస్తే రారని మహిళలతో కార్యక్రమం చేస్తున్నారని ఆరోపించారు. రైతు డిక్లరేషన్‌లో చెప్పినట్టు రూ.2 లక్షల రుణమాఫీ, వరికి రూ.500 బోనస్, పంటల బీమా, రైతు భరోసా ఏ ఒకటి అమలు చేయనుందకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాకవి కాళోజీ మెమోరియల్ బిల్డింగ్ కోసం ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 300 గజాల జాగా ఇవ్వలేదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ దుయ్యబట్టారు.
ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు కాళోజీ కళాక్షేత్రాన్ని పట్టించకోలేదని, ఇప్పుడు తామే చేసినట్టు కాంగ్రెస్ చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాళోజీ కళాక్షేత్రం నిర్మాణానికి 300 గజాల స్థలం కావాలని కాళోజీ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, కాళోజీ మిత్ర బృందం అడిగితే అప్పడి కాంగ్రెస్ ప్రభుత్వం తిరస్కరించిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఒక ప్రకటనలో విమర్శించారు. 300 గజాల స్థలం ఇవ్వని కాంగ్రెస్.. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి కాళోజీ కళాక్షేత్రాన్ని చూసి ఏమని సమాధానం చెప్తారని వినోద్ ఆ ప్రకటనలో ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఏ ముఖం పెట్టుకొని వరంగల్ జిల్లా పర్యటనకు వస్తున్నావని ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్ నాయక్ ప్రశ్నించారు. మంగళవారం హనుమకొండలో నిర్వహిస్తున్న విజయోత్సవ సభను లంబాడా గిరిజనులు బహిషరించాలని ఆయన పిలుపునిచ్చారు. రైతు డిక్లరేషన్‌ను నెరవేర్చకుండా వరంగల్‌కు ఏ ముఖం పెట్టుకొని వెళ్తున్నావని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. పథకాలన్నింటినీ పెండింగ్‌లో పెట్టి నేడు కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ వెళ్తున్నారని, కాళోజీ పేరెత్తే అర్హత ప్రభుత్వానికి లేదని స్పష్టంచేశారు.