హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్ర హోంశాఖను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన వద్దే అంటి పెట్టుకోవడం ఆ శాఖకు శాపంగా మారింది. ఇతర శాఖల వ్యవహారాలు, ప్రభుత్వ పనుల్లో ఆయన మునిగిపోవడంతో హోంశాఖలో ఎన్నో కీలక ఫైళ్ల పరిస్థితి ‘ఎక్కడి గొంగలి అక్కడే’ అన్న చందంగా తయారైంది. రాష్ట్ర భద్రతకు అత్యంత కీలకమైన పోలీస్ శాఖ బడ్జెట్ ఫైల్‌తోపాటు జైళ్లు, ఇంటెలిజెన్స్, ఉమెన్ సేఫ్టీ, అగ్నిమాపక విభాగాల ఫైళ్లు సీఎం వద్ద పేరుకుపోయినట్టు తెలిసింది. పెరోల్ కోసం జైళ్లలోని ఖైదీలు చేసుకున్న దరఖాస్తుల ఫైళ్లు కూడా పెండింగ్‌లో ఉండటంతో వారంతా సీఎం సంతకాల కోసం ఎదురుచూస్తున్నారు. హోంశాఖకు ప్రత్యేకంగా మంత్రి లేకపోవడం, అనేక ఫైళ్లు, బిల్లులు ముందుకు కదలకపోవడంతో ఎన్నో పనులు ఆగిపోయాయని పోలీస్ అధికారులు చెప్తున్నారు.
రాష్ట్ర బడ్జెట్లో హోంశాఖకు కేటాయించాల్సిన నిధులతోపాటు ఆ శాఖకు సంబంధించిన పలు ఇతర అంశాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గత నెల 22న సచివాలయంలో పోలీస్ ఉన్నతాధికారులతో చర్చించారు. హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు వలసలు పెరుగుతున్నందున ఆ మేరకు భద్రత కల్పించేందుకు హోంశాఖ సిద్ధం కావాలని గుర్తు చేశారు. పోలీస్ అధికారులు, సిబ్బంది కోసం క్వార్టర్స్ నిర్మించాల్సిన అవసరం ఉన్నందున వెంటనే ప్రతిపాదనలు పంపాలని సూచించడంతో గ్రేహౌండ్స్, నారోటిక్స్, ఇంటెలిజెన్స్, ఫైర్, ఎక్స్ సర్వీస్‌మెన్ తదితర 8 విభాగాల ఉన్నతాధికారులు అప్పటికే సిద్ధం చేసిన ఫైళ్లను పంపారు. హోంశాఖ అవసరాల కోసం బడ్జెట్లో కేటాయించాల్సిన నిధులపై డీజీపీ జితేందర్ ఓ నివేదికను సమర్పించారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి హోదాలో సంతకాలు చేయాల్సిన ఆ ఫైళ్లకు ఇంకా మోక్షం కలగలేదని సమాచారం. హోంశాఖ బడ్జెట్‌పై ఏమీ తేల్చకుండానే ప్రభుత్వం ఈ నెలలో బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తుండటంతో పోలీస్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సీఎం కొంచెం వీలు చూసుకొని తమ ఫైళ్లపై సంతకాలు చేయాలని కోరుతున్నారు.