Kadiayam Srihari | స్టేషన్ ఘన్పూర్, మే 1 :‘ఇంటి పెద్దను కోల్పోయి, రెక్కల కష్టం చేసే ఓపిక, సత్తువ లేక జీవనోపాధి కరువైంది.. మాకు వితంతు పింఛన్లు ఎప్పుడు ఇస్తరు సారూ.. ’అంటూ పలువురు వితంతువులు ఎమ్మెల్యే కడియం శ్రీహరిని నిలదీశారు. శుక్రవారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం మీదికొండలో ఏర్పాటుచేసిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి వచ్చారు. అనంతరం సర్పంచ్ సంపత్‌కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వితంతువులు పెన్షన్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పిండ్లు , ఇంకా ఎప్పుడిస్తారని కడియంను ప్రశ్నించారు. దీనికి స్పందించిన కడియం వచ్చే నెలలో కొత్తవారికి పెన్షన్లు ఇస్తామని తెలిపారు.
బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు
‘మా పార్టీ అభ్యర్థి అని ఓట్లు వేసి గెలిపించుకున్నం.. ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం పలికి ఆహ్వానించేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకుని గృహనిర్బంధం చేశారు’ అని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. శుక్రవారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం మీదికొండలో ఏర్పాటుచేసిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి వస్తున్నారనే సమాచారంతో మాజీ ఉప సర్పంచ్ పొన్నం రంజిత్‌కుమార్, బీఆర్ఎస్ నాయకులు జోగు ప్రేమ్, జోగు కిష్టయ్య, జోగు రాజు, వంగ రాజు, గొడుగు సంజీవ, పొన్నం లక్ష్మణమూర్తి, సాతు వీరస్వామి స్వాగతం పలికేందుకు వెళ్లారు.
ఈ క్రమంలో పోలీసులు వీరిని అడ్డుకుని ప్రారంభోత్సవానికి, సమావేశానికి వెళ్లకుండా గృహ నిర్బంధంచేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కారు గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరినా తన ఎమ్మెల్యే పదవి కాపాడుకునేందుకు బీఆర్ఎస్లోనే ఉన్నానని ఇటీవల స్పీకర్‌కు లేఖ పంపారని చెప్పారు. తమ ఎమ్మెల్యేకు స్వాగతం పలికేందుకు వెళ్తుంటే పోలీసులతో అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు.
కడియంను నిలదీసిన మహిళలు
‘ఇంటి పెద్దను కోల్పోయి, రెక్కల కష్టం చేసే ఓపిక, సత్తువ లేక జీవనోపాధి కరువైంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొత్త పెన్షన్లు ఇస్తమన్నరు. మాకు వితంతు పెన్షన్లు ఇంకెప్పుడిస్తరు సారూ..’ అంటూ పలువురు వితంతువులు ఎమ్మెల్యే కడియం శ్రీహరిని నిలదీశారు. జనగామ జిల్లా మీదికొండలో శుక్రవారం శ్రీహరిని వారు అడ్డుకున్నారు. పెన్షన్లపై ప్రశ్నించారు. వచ్చే నెలలో కొత్తవారికి పెన్షన్లు ఇస్తామని కడియం తెలిపారు.