గోదావరిఖని, జనవరి 25: సిట్ విచారణ హరీశ్‌రావు, కేటీఆర్‌పై కాదని.. సింగరేణిలో సైట్ విజిట్ కుంభకోణంపై జరుపాలని టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆదివారం ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు. సింగరేణిలో సైట్ విజిట్ స్కామ్ అక్రమాల పుట్ట అని.. నైని టెండర్ల విచారణ ఒక డ్రామా అని మండిపడ్డారు. సింగరేణి బొగ్గు గని సంస్థలో ఓవర్ బర్డెన్(ఓబీ) తొలగింపు కాంట్రాక్ట్‌లు అవినీతికి అడ్డాగా మారినట్టు పేర్కొన్నారు. సాధారణంగా ఓవర్ బర్డెన్ టెండర్లలో 2025 ఏప్రిల్, మే నెలలకు ముందు వరకు సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే నిబంధన లేదని, అప్పటి సింగరేణి సంస్థ అత్యున్నతస్థాయి అధికారి చేర్చారని తెలిపారు. వేల కోట్ల అవినీతిని వెలికి తీయాలంటే సీబీఐ, సీవీసీ, కాగ్ అధికారులతో కూడిన సిట్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.