Pension | హైదరాబాద్ మే 13 (నమస్తేతెలంగాణ): అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పింఛన్ పెంపుతో పాటు కొత్తవారికి పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. ఏడాదిన్నర అవుతున్నా కనికరించడం లేదు. క్షేత్రస్థాయి పరిశీలన, అనర్హుల తొలగింపు, అర్హుల గుర్తింపు పేరిట ప్రభుత్వం తాత్సారం చేస్తున్నది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.2 లక్షల మందికి 18 నెలలుగా ఎదురుచూపులు తప్పడంలేదు.
కాంగ్రెస్ గద్దెనెక్కిన వెంటనే 2024 జనవరిలో ప్రజాపాలన పేరిట గ్రామసభలు నిర్వ హించి కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించింది. ఆ తర్వాత ఆన్లైన్లోనూ అప్లికేషన్లు తీసుకున్నారు. ఎన్నికల ముందు చెప్పినట్టు, మ్యానిఫెస్టోలో పెట్టినట్టు కొత్త ప్రభుత్వం పింఛన్లు ఇస్తుందని అందరూ భావించారు. సుమారు 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అర్జీలను పరిశీలించిన అధికారులు వీరిలో దాదాపు 5.2 లక్షల మందిని అర్హులుగా తేల్చారు. కానీ వీరికి పింఛన్లు మాత్రం మంజూరు చేయడంలేదు.
వడపోత మొదలు పెట్టి..
20 రోజుల క్రితం దరఖాస్తుల దుమ్ము దులిపిన ప్రభుత్వం కొత్తవారికి ఆసరా పింఛన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు చెప్పింది. ఇందులో భాగంగా అర్హుల జాబితాను రూపొందించాలని సెర్ప్ యంత్రాంగాన్ని ఆదేశించింది. సర్కారు ఆదేశాలతో కదిలిన సెర్ప్ అధికారులు సమీక్షించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్లను ఆదేశించారు.
గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాలు, నగరాల్లో బిల్ కలెక్టర్ల ద్వారా సర్వే చేయించి అర్హులను గుర్తించాలని సూచించారు. వృద్ధాప్య పింఛన్ పొందుతూ మరణించిన వారి జాబితాల ఆధారంగా పరిశీలించి భార్య/భర్తలు అర్హులైతే వారి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకోనివారిని వలసవెళ్లినట్టుగా గుర్తించి తొలగించాలని సూచించారు.
సుమారు 2 లక్షల మందికి కోత
కొత్త పింఛన్ల మంజూరుపై నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం లబ్ధిదారుల్లో కోత పెడుతున్నది. ఒకే ఇంటిలో ఇద్దరు పింఛన్లు తీసుకుంటున్నారనే కారణంతో 2024 జూలైలో సుమారు 1,826 మందికి రికవరీ నోటీసులు జారీ చేసింది. అలాగే మరణించిన, వలస వెళ్లారనే ఇతరత్రా కారణాలతో దాదాపు 1.4 లక్షల మంది లబ్ధిదారులను పింఛన్ల జాబితా నుంచి తొలగించింది.
కేసీఆర్ పాలనలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్, బోధకాలు బాధితులు, బీడీకార్మికులు, టేకేదార్లు, దివ్యాంగులకు మొత్తం 44.7 లక్షల మందికి పింఛన్లు ఇస్తుండేది.దివ్యాంగులకు రూ. 4,016, ఇతరులకు రూ. 2,016 చొప్పున అందజేసేది. ఇందుకు ప్రతినెలా రూ. 900 కోట్లకు పైగా వెచ్చించేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ కారణాలతో సుమారు 2 లక్షల మంది లబ్ధిదారుల పింఛన్లను రద్దుచేసింది. ప్రస్తుతం దాదాపు 42.7 లక్షల మందికే ఆసరా పథకాన్ని వర్తింపజేస్తున్నారు. దీంతో సర్కారుపై ప్రతినెలా సుమారు రూ. 150 కోట్ల భారం తగ్గింది.
వచ్చే నెల నుంచైనా అమలయ్యేనా?
మే నుంచే కొత్త పింఛన్లు ఇస్తామని హడావుడి చేసిన సర్కారు ఆచరణలో విఫలమైంది. పాతవారికి మాత్రమే మంజూరు చేసి కొత్తవారికి మొండి చెయ్యి చూపింది. దీంతో సుమారు 5.2 లక్షల మంది లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. పదేపదే ఆధార్ కార్డులు, బ్యాంకు బుక్కులు ఇవ్వాలని అడుగుతున్నారే తప్ప పింఛన్ మంజూరు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోతున్నామని వాపోతున్నారు. కనీసం వచ్చే నెల నుంచైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
బీడీ కార్మికులపై చిన్నచూపు..
పీఎఫ్ కటాప్ తేదీని 2018కి పెంచి అర్హులైన బీడీ కార్మికులకు పింఛన్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ దిశగా కనీస చర్యలు చేపట్టలేదు. దరఖాస్తులు తీసుకొని చేతులు దులుపుకున్నదే తప్పితే చేసిందేమీలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల మంది పింఛన్ మంజూరు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు పీఎఫ్ కటాప్ తేదీని 2018గా పరిగణించి అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని కోరుతున్నారు.