మేడ్చల్, సెప్టెంబర్5(నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల(టవర్స్) దరఖాస్తుల రుసుం పైసలు ఎప్పుడు ఇస్తారని లాటరీలో దక్కని ఇందిరమ్మ దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో ఇందిరమ్మ(టవర్స్) నిర్మాణాలకు ఇటివలే లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఉప్పల్ నియోజకవర్గం మినహా నియోజకవర్గానికి 480 చొప్పున జీప్లస్10 టవర్స్‌ను నిర్మించేందుకు 1920 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా ఎంపిక కాని దరఖాస్తుదారులకు రూ. 10 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారి పైసలు తిరిగి ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు.
నాలుగు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇండ్ల(టవర్స్)కు 14,201 దరఖాస్తులు వచ్చిన విషయం విధితమే. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హత ఉన్న వారికే ఇందిరమ్మ ఇండ్లు(టవర్స్)ను అందించనున్నట్లు అధికారులు పేర్కొంటున్న నేపథ్యంలో లాటరీలో ఎంపికైన లబ్ధిదారుల దరఖాస్తులపై మరో మారు విచారణ చేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నారు.
మూడు రోజుల క్రితమే విచారణ ప్రారంభించామని, విచారణలో అనర్హులుగా తేలితే ఇందిరమ్మ ఇండ్లు(టవర్స్)ను రద్దు చేసి అర్హత ఉన్నవారికి తిరిగి లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఇదంతా తేలిన తర్వాతే లాటరీలో ఇండ్లు దక్కని దరఖాస్తుదారులకు తిరిగి దరఖాస్తు రుసుం రూ. 10 వేలు చెల్లించే అవకాశం ఉందని తెలుస్తోంది. దరఖాస్తు చేసుకునేందుకు అనేక మంది అప్పులు చేశారని తెలుస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్‌బెడ్‌రూమ్‌లను ఉచితంగానే నిరుపేదలకు ఇచ్చిన విషయాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు.