ఏటా 2 లక్షల ఉద్యోగాలన్నరు.. ఇచ్చిండ్రా? యూత్ కమిషన్ అన్న రు.. వేసిండ్రా? ప్రైవేట్ కంపెనీల్లో 75% రిజర్వేషన్ల చట్టం అన్నరు.. తెచ్చిండ్రా? కాలేజీ అమ్మాయిలకు స్కూటీలన్నరు.. యువతకు రూ.10 లక్షల వడ్డీ లేని రుణాలన్నరు.. ఇచ్చిండ్రా? ఫీజు రీయింబర్స్మెంట్ వస్తున్నదా? 4ట్రిపుల్ ఐటీలు, 3 యూనివర్సిటీలు పెట్టిండ్రా? నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇస్తున్నరా?
-కేటీఆర్
కరీంనగర్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : సమాజం యువత పాత్ర చాలా గొప్ప ది.. మీ పరిధి విశాలమైనది.. ఈ దేశం మీది.. భవిష్యత్తు మీది.. కాపాడుకోవాల్సి బాధ్యత కూడా మీదే. మీ పోరాటాలు కేవలం ఉద్యోగా లు, నోటిఫికేషన్లు, ఫీజు రీయింబర్స్మెంట్ వద్దనే ఆగిపోవద్దు. సమాజం గురించీ ఆలోచించాలి. మీతో పాటు సబ్బండ వర్ణాలను హామీల పేరు నమ్మించి నయవంచన చేసి ప్రభుత్వాలపై కదంతొక్కాలి. నిప్పుకణికలై మండాలె.. కాంగ్రెస్‌ను కాలిబూడిద చేసేదాకా వెంటపడాలె’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. శనివారం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించి విద్యార్థి, యువత సమరభేరి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, యువతను ఉద్దేశించి ప్రసంగించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ విలాసమే తప్ప యువవికాసం లేదని విమర్శించారు. వంద రోజుల్లో అమలు చేస్తామని విద్యార్థి, నిరుద్యోగులకు ఇచ్చిన 24 హామీల్లో వెయ్యి రోజులు గడుస్తున్నా ఒక్కటి కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. యువత, విద్యార్థుల పోరా టం ఒక్క వారి సమస్యలకే పరిమితం కాకూడదని, రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ విస్తరించాల్సిన అవసరం ఉన్నదని స్పష్టంచేశారు. ఒక అన్నగా మీ వెంట ఉంటానని, బీఆర్ఎస్ దళపతి కేసీఆర్ మన వెంట ఉంటారని యువత, విద్యార్థిలోకాన్ని ఉద్దేశించి కేసీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వేదికపై డిజిటల్ స్క్రీన్‌పై చూపిస్తూ సర్కార్ తీరును ఎండగట్టారు.

కాంగ్రెస్, బీజేపీ ఇవాళ ఎవరితోనైతే పెట్టుకోకూడదో వారితోనే పెట్టుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ‘మీ తరంతో పెట్టుకుంటే నిలబడటం వాళ్ల తరం కాదు.. యువతరం గళమెత్తితే, నవతరం పోటెత్తితే పెద్దపెద్ద వాళ్లే పారిపోయిన పరిస్థితి. యువత, విద్యార్థులు ఢిల్లీలో కదం తొక్కితే అక్కడున్న మోదీయే వణికిపోయిండు. మోదీనే గడగడలాడించిన మీకు ఈ కేడీ ఒక లెక్కనా?’ అని చెప్పారు. చరిత్రలో పోరాటాలను మలుపు తిప్పింది విద్యార్థి, యువతరం పోరాటాలే. మీ చెమటతోనే, మీ రక్తంతోనే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నం. సాధించుకున్న రాష్ట్రంలో మీ భవిష్యత్తు కోసం కేసీఆర్ నాయకత్వంలో ప దేండ్లు కష్టపడ్డాం. కానీ ముసలి నక్క మాయమాటలు, గ్యారెంటీలు, గారడీలు మళ్లీ నమ్మి యంగ్ స్టేట్‌లో, యంగ్ పీపుల్ని ముసలి నక్క మోసం చేసింది. తెలంగాణ యువకులు, వి ద్యార్థులపై తూటాల వర్షం కురిపించి వారి నె త్తురు తాగిన దిక్కుమాలిన కాంగ్రెస్ ఈసారి ఎ క్కడా లేని వరాలు, ఇష్టం వచ్చినన్ని మాటలు చెప్పింది’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి ఢిల్లీకి వెళ్లి దాక్కున్న వారు మన గల్లీకి రాకపోతే అవసరమైతే మనమే ఢిల్లీకి వెళ్లి మన గళం సోషల్ మీడియా ద్వారా రాహుల్ గాంధీకి వినిపిద్దాం.. ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఒక్కటే చెప్పినట్టు ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమేరదాకా తరిమికొడతాం. ప్రాంతం వాడే మోసం చేస్తే ఉప్పు పాతర వేస్తామని, రాబోయే 825 రోజుల్లో పోరాటాలకు సిద్ధమవుదాం.
– కేటీఆర్

వెయ్యి రోజుల్లో పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ హామీలపై వీడియోలు ప్రదర్శిస్తూ విద్యార్థులను ప్రశ్నలు అడిగారు. ‘ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలు అ న్నరు.. వచ్చాయా? యూత్ కమిషన్ ఏర్పా టు చేస్తామని చేశారా? ప్రైవేట్ కంపెనీల్లో 75శాతం రిజర్వేషన్ల చట్టం తెస్తానని తెచ్చారా? కాలేజీ అమ్మాయిలకు స్కూటీలు వచ్చాయా? యువతకు రూ.10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఇచ్చారా? ఫీజు రీయింబర్స్మెంట్ వస్తున్నదా? నాలుగు ట్రిపుల్ ఐటీలు, మూడు యూనివర్సిటీలు పెడ్తామన్నరు.. పెట్టారా? నెలకు రూ.4వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చారా?’ అంటూ కేటీఆర్ వరుసగా ప్రశ్నించడంతో సభలో ఉన్న విద్యార్థులు, యువకులు లేదు.. లేదు అంటూ గట్టిగా బదులిస్తూ నినాదాలు చేశారు. ఇలా అన్ని రకాలుగా చీట్ చేసింది ఎవరని కేటీఆర్ ప్రశ్నించగా.. కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే సభలో విద్యార్థులు ఒక్కసారిగా నినదించారు.
‘హామీలపై ప్రశ్నిస్తే కేసీఆర్ రాజీనామా చే యాలంటున్నరు.. ఎందుకు చేయాలి? తెలంగాణ తెచ్చినందుకు రాజీనామా చేయాల్నా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. వంద రోజుల్లో 420 హామీలు నెరవేర్చనందుకు మీరే 420 సార్లు రాజీనామా చేయాలి. 2006లో ఇదే క రీంనగర్ గడ్డ మీద కేసీఆర్ రాజీనామా చేశా రు. అపుడు ఏమైందో గుర్తున్నదా? కేసీఆర్‌తో పెట్టుకోవద్దు. ఒక్క మంత్రిని బర్తరఫ్ చేయడం కాదు.. మీ ప్రభుత్వాన్నే బర్తరఫ్ చేసే రోజులు గుర్తు పెట్టుకోండి’ అని హెచ్చరించారు.
ఎన్నికల ముందు హైదరాబాద్ అశోక్‌నగర్ చౌరస్తాకు వచ్చిన రాహుల్‌గాంధీ అల్లం బెల్లం ముచ్చట్లు చెప్పి ఏడాదికి 2లక్షల ఉద్యోగాలిస్తామని ఓట్లు వేయించుకొని అడ్రస్ లేకుండా పోయిండని కేటీఆర్ మండిపడ్డారు. ‘ఆనాడు ఇరానీ చాయ్ తాగిండు. బిర్యానీ తిన్నడు. మన పిల్లలకు నాలుగు బిస్కట్లు వేసిండు. అవతల పడ్డడు. రాహుల్‌గాంధీని కరీంనగర్ గడ్డపై నుంచి అడుగుతున్నా.. ‘మిస్టర్ రాహుల్‌గాంధీ రోజ్‌గార్ దేనేకా వాదా క్యాహువా’, ఇపుడు ఎక్కడ ఉన్నావు. నువ్వు సీల్డ్ కవర్ల పంపిన సీం ఏం చేస్తున్నడో నీకేమన్న తెలుసా? నోటిఫికేషన్ల గురించి అడిగితే ఎండ్రిన్ తాగండి. బావి లో దూకండి. ఎక్కడైనా చావండి అని అహంకారంతో దూషిస్తున్నాడు. పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తుంటే.. లాఠీచార్జ్‌లు చేయిస్తున్నడు. అందుకే రాహుల్‌ను అడుగుతున్నా.. హైదరాబాద్ ఎందుకు రావో చెప్పా లి’ అని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం నోటిఫికేషన్లు లేవు గానీ.. భూములు, బూడిద, బొగ్గు, ఇసుక, బదర్స్, బావమరుదల లూటిఫికేషన్లు మాత్రం మూడు పువ్వులు, ఆరు కాయలన్నట్టు బ్రహ్మాండంగా నడుస్తున్నయ్. కొలువుల కుంభమేళా తెస్తామని చెప్పి కుంభకోణాల కుంభమేళా తెచ్చారు. అందుకే నిరుద్యోగులు నిప్పు కణికలై మర్లవడాలే. మళ్లీపుడతామా ఏంది, కాంగ్రెస్ కాలిబూడిదయ్యే దాకా వెంటపడాలె. మర్లవడాలె. ‘జీనా హైతో మర్నా సీఖో.. కదం కదం పే లడ్నా సీఖో..’ అని జార్జిరెడ్డి చెప్పింది ఓసారి గుర్తుచేసుకోవాలె.

‘ఎన్నికల సమయంలో అన్ని పత్రికల్లో ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు వేసి.. జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. తేదీలు ప్రకటించారు. 2లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చి మోసం చేశారు’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మైసూర్ బజ్జీలో మైసూర్ లేనట్టే కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్లో జాబ్‌లు లేవని ఎద్దేవా చేశారు. అలాంటి క్యాలెండర్లు పెట్టి దోచుకున్న సొమ్ముతో పత్రికల్లో యాడ్స్ వేసి ఇప్పటికే రెండేండ్లు గడిచినా ఉద్యోగాల ఊసే లేదని నిప్పులు చెరిగారు. ‘జాబ్‌లు లేవు.. జవాబులు లేవు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు తప్ప. జాబ్ క్యాలెండర్ చిత్తు కాగితం కంటే హీనమని తేలిపోయిందని ధ్వజమెత్తారు. జాబులు నింపడం లేదు కానీ, అనకొండ బ్రదర్స్ మాత్రం తమ జేబులు బ్రహ్మాండంగా నింపుకొంటున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్రభుత్వానికే స్పష్టత లేదంటూ కేటీఆర్ చురకలంటించారు. ‘ఒక మంత్రి 60వేలు అంటడు.. ఇంకొకాయన 70 వేలు అంటడు.. నోటికి ఎంతస్తే అంత మాట్లాడుతూ అబద్ధాలు చెప్తున్నరు. అందుకే ఏనాడో పెద్దలు చెప్పినట్టు నకలు కొట్టాలంటే అకలు ఉండాలి. వీళ్లకు అది కూడా లేదు’ అని ఎద్దేవా చేశారు. తాను అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ 16వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని శాసనసభా సాక్షిగా ప్రభుత్వమే ఒప్పుకొన్నది. అందులో నుంచి కూడా బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లు తీసివేస్తే.. 10వేల ఉద్యోగాలు కూడా ఈ ప్రభుత్వం వేయి రోజుల్లో ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టిన ఆ పార్టీ మంత్రులే.. ఇప్పుడు మేము హామీ ఇవ్వలేదంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పడం సిగ్గుచేటు’ అని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ ఎప్పుడూ అడ్డగోలు హామీలు ఇవ్వలేదని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 95శాతం రిజర్వేషన్లు దేశంలో ఒక్క తెలంగాణలో మాత్రమే ఉన్నాయని, అవి తెచ్చింది కేసీఆరే అని చెప్పారు. జోనల్ విధానం తేవడానికి, మన పిల్లలకు ఉద్యోగాలు రావడానికి చాలా కష్టపడ్డాం. తొమ్మిన్నరేండ్లలో రెండేండ్లు కరోనాతోనే కష్ట పడాల్సి వచ్చింది. మిగిలిన ఏడున్నరేండ్లలో కొత్త రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ తేవాడానికి కొంత ఆలస్యమైనా 2,32,308 ఉద్యోగాల నియామకాలు చేపట్టి, 1,60,083 ఉద్యోగాలు పూర్తి చేశాం’ అని తెలిపారు. మిగతావి చేయాల్సి ఉండగా కాంగ్రెస్ వాళ్లే కోర్టులకు వెళ్లి ఆపారని పేర్కొన్నారు. తాను చెప్పిన వివరాలు అబద్ధమని సీఎం రేవంత్‌రెడ్డి నిరూపిస్తే ఇదే కరీంనగర్ గడ్డ మీద రాజీనామా చేస్తానని, అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిం దో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని కేటీఆర్ తేల్చిచెప్పారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కచ్చితంగా నిలదీసి అడుగుతామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న తుగ్లక్ నిర్ణయాల నుంచి విద్యార్థులను రక్షించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుందన్నారు. విద్యార్థులు దైర్యంగా ఉండాలని బీఆర్ఎస్ దళం అండగా ఉంటుందని అభయమిచ్చారు.
పోలీసులు తమ డ్యూటీ మాత్రమే చేయాలని, అతి చేయవద్దని కేటీఆర్ సూచించారు. ‘మహబూబాబాద్‌లో ధర్నా చేస్తున్న సందర్భంలో ఒక విద్యార్థి గొంతు పట్టి నొక్కుతున్న దృశ్యం చూశాను. రెండేండ్లలో తిరిగి కేసీఆర్ సీఎం కాబోతున్నరు.. గుర్తుపెట్టుకుంటం.. ఎవరినీ వదిలి పెట్టం. రిటైర్ అయినా ఇంకెక్కడికి పోయినా పట్టుకొచ్చి ఏం చేయాలో అది చేసి చూపెడతాం’ అని సూచించారు.
సమాజంలో యువత పాత్ర చాలా గొప్పది. మీ పరిధి విశాలమైనది. మీ శక్తి అమోఘమైనది. మీ బాధ్యత బహుముఖమైనది. ఉద్యోగాలు, నోటిఫికేషన్లు, ఫీజ్ రీయింబర్స్మెంట్లు వీటికి మాత్రమే పరిమితమైతే సరిపోదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని మాత్రమే మోసం చేయలేదు. తెలంగాణలో సబ్బండ వర్ణాలను కాంగ్రెస్ మోసం చేసింది.
విద్యార్థులు, యువకుల పోరాటం కేవలం ఫీజు రీయింబర్స్మెంట్, ఉద్యోగాల కోసమే కాదు. దేశం గురించి, రాష్ట్రం గురించి. సమా జం గురించి జరుగాల్సిన అవసరం ఉన్నదని కేటీఆర్ చెప్పారు. ‘ఈ దేశం, రాష్ట్ర మీదని, భవిష్యత్తు మీదని, కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైనే ఉన్నది. రాష్ట్రంలో కేవలం రేవంత్‌రెడ్డి మాత్రమే కాదు. కేంద్రంలో ఇంకొకాయన ఉన్నడు. మోదీ కూడా మనల్ని తక్కువ మోసమే చేయలేదు. చోటే భాయ్ ఏడాదికి 2లక్షల ఉద్యోగాలు ఇస్తానంటే, బడే భాయ్ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు’ అని మండిపడ్డారు. ‘మరి ఇక్కడున్న మీ ఎంపీ అడుగుతున్నడా? ఇక్కడున్న కేంద్ర మంత్రి కరీంనగర్‌కు ఒక్క కొత్త పాఠశాల, కళాశాల కూడా తేలేదు. ఆయనకు దేవుని విషయాలు తప్ప ఇంకొకటి తెలియదు’ అని ఎద్దేవా చేశారు. గంగుల కమలాకర్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కరీంనగర్‌కు తెచ్చారని, మరి బండి సంజయ్ కనీసం గుడైనా తెచ్చాడా? వేములవాడకు అరపైసైనా తెచ్చావా? అని ప్రశ్నించారు.
‘కమీషన్ల మత్తులో కాంగ్రెసోళ్లు ఉంటే తెలంగాణ కంపెనీలను గుజరాత్ వాళ్లు ఎత్తుకెళ్తున్నరు. తెలంగాణ ప్రయోజనాల గురించి బీఆర్ఎస్ మాట్లాడితే మీది ప్రాంతీయ వాదమని బీజేపీ వాళ్లు మాట్లాడుతున్నరు. ఇక్కడి కంపెనీలను గుజరాత్‌కు తీసుకెళ్లడం జాతీయవాదం అయితదా? ఇది ప్రాంతీయవాదం కాదా?’ అని నిలదీశారు. ‘ఇక్కడి కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నరు? పార్లమెంట్లో ఒక ఎంపీ తెలంగాణ విభజనను పాకిస్థాన్ విభజనతో పోల్చినపుడు కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఎందుకు ఎదురుతిరుగలేదు. మనకు తెలంగాణలోనే కాకుండా ఢిల్లీలో కూడా మన గళం ఉండాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణకు నిధులు, విద్యాసంస్థలు ఇస్తావా ఇవ్వవా? అని అడిగే నాయకత్వం ఢిల్లీలో ఉండాలి. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ మాత్రమే శ్రీరామ రక్ష’ అని తేల్చిచెప్పారు.
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 5(నమస్తే తెలంగాణ): పాలిటెక్నిక్ కళాశాలలను లేబర్ డిపార్ట్మెంట్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు తెచ్చిన జీవో నంబర్ 97 వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని అసెంబ్లీ వేదికగా ఎండగడుతామని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. ఈ జీవో నంబర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 20 రోజులకుపైగా ఆందోళనలు చేస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారంలోని సిరిసిల్ల పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో శనివారం ఆయన సమావేశమయ్యారు. అనంతరం కేటీఆర్ మాట్లాడు తూ.. విద్యార్థులు రోడ్డెకితే కేసులు పెడ్తామ ని ప్రభుత్వం భయపెట్టాలని చూస్తున్నదని, ఎలాంటి ఆందోళన చెందవద్దని వారికి ధైర్యం చెప్పారు.
హైదరాబాద్‌లోని మాసబ్ట్యాంక్తోపాటు సిరిసిల్ల, కరీంనగర్ తదితర పట్టణ ప్రాంతాల్లో విలువైన భూముల్లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలల ఆస్తులపై ప్రభు త్వం కన్నేసిందని ఆరోపించారు. పాలిటెక్నిక్ కళాశాలల వ్యవస్థను బలహీనపరిచి వాటి భూములను, ఆస్తులను ఇతర అవసరాలకు వినియోగించుకొనే ప్రయత్నాలను అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో జీవో 97 అంశాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా బలంగా ప్రస్తావిస్తారని తెలిపారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా, ఈ జిల్లా బిడ్డగా జీవో 97ను రద్దు చేసేదాకా, విద్యార్థుల సమస్యలు పరిషరించేదాకా అండగా నిలుస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. విద్యార్థులపై పోలీసులు కేసులు పెట్టినా, ఎలాంటి వేధింపులకు గురిచేసినా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
తిమ్మాపూర్, సెప్టెంబర్ 5 : జెన్ జీ సభ కోసం కరీంనగర్ వెళ్తున్న కేటీఆర్ కారు పాక్షికంగా దెబ్బతిన్నది. అల్గునూరులో ఆహ్వాన కార్యక్రమం ముగిసిన తర్వాత కేటీఆర్ కారు ఎకి అభివాదం చేస్తుండగా మహిళలు వచ్చి రాఖీ కడుతుండగా, అదే సమయంలో కారులో వెనుక కూర్చున్న నాయకులు డోర్ తీయడంతో పకనుంచి వెళ్తున్న లారీ కారు డోరుకు తగిలింది. దీంతో డోర్ స్వల్పంగా దెబ్బతిన్నది.
రేవంత్‌రెడ్డి మా భవిష్యత్తును నాశనం చేసే ప్రయత్నంలో ఉన్నారు. జీవో నంబర్ 97 తెచ్చి పాలిటెక్నిక్‌ను ఐటీలో విలీనం చేసి స్కిల్ యూనివర్సిటీలో పెడదామని చూస్తున్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్? ఐటీలో విలీనం చేస్తే మా భవిష్యత్తు నా శనమైతది. మా భవిషత్తును నిర్ణయించే అధికారం మీకు ఎక్కడిది? 60 వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవాలని చూస్తారా? మీకెంత ధైర్యం?
పాలిటెక్నిక్‌ను ఐటీలో విలీనం చేయాలనుకున్నపుడు మాతో చర్చలు జరుపాలి. అలా ఎందుకు చేయలేదు? గత ఆగస్టు 14 నుంచి మేం ఆందోళన చేపట్టి రోజులు గడుస్తున్నా మా గురించి ఎవ్వరు పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మా గురించి ఆలోచించడం లేదు. తీరా మేం ఆందోళన చేసిన తర్వాత కమిటీ వేశారు. 20 రోజులుగా పాలిటెక్నిక్ విద్యార్థులు తీవ్రంగా సఫర్ అవుతున్నరు. కనీసం మీరన్న అసెంబ్లీ సమావేశంలో మాట్లాడాలని కేటీఆర్ అన్నను కోరుతున్న. మా మొర వినండి. లేదంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకైనా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నం.
రేవంత్ అన్నా ఏం పరిపాలన అన్నా మీది. ఓట్లు వేయక ముందు ఏం చెప్పారు? ఓట్లు వేసినంక ఏం చెబుతున్నరు? ఎన్నికలపుడు ఇదిస్తా.. అదిస్తా అన్నరు. అన్నీ ఫ్రీ అన్నరు. ఒక్క బస్సు ఫ్రీ ఇస్తే సరిపోతుందా..? ఫార్మసీ వాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు. మేం, మా తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నరో మీకు తెలుసా? మా భవిష్యత్తు ఏం కావాలి? మమ్మల్ని ఏం చేస్తామనుకుంటున్నరు? మా కంటే ముందు వాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు. మేమేం పాపం చేశాం? మాకు ఎందుకు ఇవ్వరు? మేం తెలంగాణలో పుట్ట లేదా? కేటీఆర్ అన్నా.. మా భవిష్యత్తు మీ చేతిలో పెడుతున్నం. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎంతవరకైనా పోరాడండి.. మీ వెంటే ఉంటం.
చావు అంచుల వరకు వెళ్లి కేసీఆర్ తెలంగాణను సాధించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. తెచ్చిన ఈ ప్రత్యేక రాష్ర్టాన్ని ఇపుడు రాబందుల్లాంటి కాంగ్రెస్ నాయకులు పీక్కు తింటున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థి, యువజన ఉద్యమాలతోనే తెలంగాణ సాధ్యమయ్యిందని, ఇపుడు ఇదే విద్యార్థి, యువజనులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. రాబోయే కాలంలో మీకు బంగారు భవిష్యత్తు కల్పించేందుకు బీఆర్ఎస్ సంసిద్ధ్దంగా ఉన్నదని చెప్పారు.

అందుకే మిమ్మల్ని కలిసేందుకు ఈ రోజు కేటీఆర్ ఇక్కడికి వచ్చారని స్పష్టం చేశారు. గంగుల కమలాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమరభేరి సభలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశ్క్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, వొడితెల సతీశ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మేయర్ రవీందర్‌సింగ్, బీఆర్ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, వీర్ల వెంకటేశ్వర్లు, పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.