హైదరాబాద్,ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : నకిరేకల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగం ఆయనలోని తీవ్ర అసహనం, ఓటమి భయాన్ని తేటతెల్లం చేస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఒకవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పండుగ అంటుంటే, మరోవైపు ప్రజల ముందే సీఎం శాపనార్థాలు పెట్టడం ఆయన తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, వాటి అమలు గురించి మాట్లాడటం చేతగాక మళ్లీ కేసీఆర్ జపమే చేస్తున్నారని విమర్శించారు. ప రిపాలన చేతకాక మతితప్పిన ఆంబోతులా, కాలుకాలిన పిల్లి లా తిరుగుతున్నది సీఎం రేవంత్‌రెడ్డేనని శనివారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ చేపట్టిన నిరసనలకు ప్రజ ల నుంచి వస్తున్న అపూర్వ స్పందనను చూసి రేవంత్‌రెడ్డి షాక్తిన్నారని, తన సరార్ పని అయిపోయిందన్న నైరాశ్యం, ఫ్రస్ట్రేషన్ ఆయన మాటల్లో స్పష్టంగా బయటపడుతున్నదని పేర్కొన్నారు.
సొంత ఇంట్లో సోదరుల ఒత్తిడి, బయట మంత్రుల సెగ తట్టుకోలేక సీఎం రేవంత్‌రెడ్డి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, తనకు చదువురాదని, సంసారం అంతకన్నా లేదని మరోసారి నిరూపించుకున్నారని వేముల మండిపడ్డారు. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీలు మహావృక్షాలని, వాటి చిన్న ఆకును కూడా రేవంత్ తాకలేరని హెచ్చరించారు. ఉద్యమ పార్టీని విమర్శించే స్థాయి రేవంత్‌రెడ్డికి లేదని, ఆయనొక గంజాయి మొక లాంటివాడని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రధాన ప్రతిపక్ష నేతనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసే విచిత్రమైన, జోకర్ లాంటి సీఎం ప్రజాస్వామ్య చరిత్రలో రేవంత్‌రెడ్డే మొదటి వ్యక్తి అని పేర్కొన్నారు.