హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో ఈఎన్సీ పోస్టు కుర్చీలాటగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండేండ్లలో ఐదుగురు అధికారులు ఈ ఉద్యోగాన్ని చేపట్టారు. ఆరు నెలల వ్యవధిలోనే ముగ్గురు మారారు. ఒకరు నెల రోజులకే పదవి నుంచి తప్పుకొన్నారు. కొందరు రిటైర్డ్ అయినా ఉద్యోగ కాలం పొడిగింపులు ఇవ్వడం, మరికొందరికి సర్వీసు ఉన్నంతవరకే కొనసాగించడం చేశారు. ఈఎన్సీల నియామకాల్లో ఒక విధానం అంటూ లేకుండా రేవంత్రెడ్డి సర్కార్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయతీరాజ్ ఈఎన్సీగా ఉన్న కనకరత్నం 2025 మార్చి 31న ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన సర్వీసును 12 నెలలు పొడిగించింది.
ఉద్యోగ విరమణ వయసు దాటిన ఉద్యోగులకు ఎక్స్టెన్షన్ ఇవ్వబోమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం అప్పట్లో చర్చకు దారితీసింది. ఎక్స్టెన్షన్లో కొనసాగుతున్న సమయంలో కనకరత్నం తన కార్యాలయంలో రూ. 50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. అనంతరం ప్రభుత్వం ఆయనను ఈఎన్సీ బాధ్యతల నుంచి తొలగించింది. కనకరత్నం తర్వాత అశోక్ ఈఎన్సీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన సర్వీసు కాలం రెండు నెలలు మాత్రమే ఉండటంతో కొద్దికాలానికే ఉద్యోగ విరమణ చేశారు. దీంతో కీలక పోస్టులో మరోసారి మార్పు చోటుచేసుకున్నది.
2025 సెప్టెంబర్ 30న పీ జోగారెడ్డి ఈఎన్సీగా బాధ్యతలు చేపట్టారు. అప్పటికీ ఆయన సాధారణ సర్వీసు కాలం నెల రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. అక్టోబర్ 31న రిటైర్ కావాల్సిన ఆయనకు ప్రభుత్వం తొమ్మిది నెలల సర్వీస్ పొడిగింపు ఇచ్చింది. దీంతో ఉద్యోగ విరమణ తేదీ 2026 జూలై 31కి మారింది. ఒక కీలక పోస్టులో రిటైర్మెంట్ దశలో ఉన్న అధికారికి పొడిగింపు ఇవ్వడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. జోగారెడ్డి తర్వాత 2026 ఆగస్టు 1న రామ్మోహన్ ఈఎన్సీగా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు కూడా సర్వీసు కాలం నెలరోజులు మాత్రమే ఉండటంతో 31 రోజులకే తప్పుకోవాల్సి వచ్చింది. సెప్టెంబర్ 1న జగదీశ్వర్ ఈఎన్సీగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నారు. ఆయన సర్వీసు కాలం మరో ఏడాదిన్నర వరకు ఉన్నట్టు పీఆర్ ఇంజినీరింగ్ విభాగం వర్గాలు వెల్లడించాయి. ఒక విధానం అంటూ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఈఎన్సీల మార్పుల వల్ల పంచాయతీరాజ్ ఇంజినీరింగ్శాఖలో ప్రాజెక్టుల పర్యవేక్షణ, పరిపాలనా నిర్ణయాల్లో స్థిరత్వంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.