దేశవ్యాప్తంగా ఫిరాయింపుల చట్టం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక ట్రెండ్‌ను సెట్ చేశారు. ఇక ఎవరు ఫిరాయించినా ఇక బెంగపడాల్సిన అవసరం లేదు. ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి రానే రాదు. ఫిరాయించినట్టు కనపడలేదని అనిపిస్తే చాలు.. హాయిగా పదవిని ఎంజాయ్ చేయవచ్చు. ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ ఒక విధమైన ట్రెండ్ సెట్ చేశారు. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోకుండా కాలాన్ని సాగదీయడం..సాగదీయడం..చివరికి ఎన్నికల గడువు దగ్గర పడినప్పుడు అనర్హత వేటు వేయడం. ఆ తరహా ఆలస్యాలే తర్వాత కూడా దేశంలోని వివిధ రాష్ర్టాల శాసనసభలు, పార్లమెంటరీ వ్యవస్థల్లో ఫిరాయింపుల కేసులపై చర్చకు కారణమయ్యాయి. 10 మంది బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా..మళ్లీ ఎన్నికలు వచ్చేదాకా నానబెట్టి..నానబెట్టి..ఎన్నికల నోటిఫికేషన్‌కు 10 రోజుల ముందు అనర్హత వేటు వేశారు.
ఇదే ట్రెండ్ ఆ తర్వాత తెలంగాణ ఉద్యమకాలంలో ఎంపీల రాజీనామాల విషయంలో లోక్‌సభలో కూడా అధికార పార్టీ ఫాలో అయ్యింది. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే ట్రెండ్ కొనసాగింది. కానీ, బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించడంతో సీన్ మరోలా మారింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మూడింట రెండొంతుల మంది సభ్యులు వస్తేనే తమ పార్టీలో విలీనం చేసుకున్నారు. ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావు తీర్పుతో ఏదీ అక్కర్లేదని తేలిపోయింది.
దానం నాగేందర్ 2023లో బీఆర్ఎస్ టికెట్‌పై ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా మరో పార్టీ టికెట్‌పై పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల ఆయన బీఆర్ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్న చర్యగా పరిగణించవచ్చని పిటిషనర్లు వాదించారు. స్పీకర్ మాత్రం అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు హైకోర్టు ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టింది. చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్ బెంచ్ స్పీకర్ ఉత్తర్వును కొట్టివేసి, దానం నాగేందర్ లోక్‌సభకు పోటీ చేసిన 2024 ఏప్రిల్ 23 నుంచే ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించింది. దీంతో స్పీకర్ నిర్ణయమే ఫైనల్ కాదని తేలింది.
ఒక ఎమ్మెల్యే.. ఒక పార్టీ గుర్తుపై గెలిచి, అదే శాసనసభ సభ్యత్వాన్ని కొనసాగిస్తూ మరో పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తే అది కూడా ఫిరాయింపుగా పరిగణించడానికి సరిపోకపోతే, మరి ఫిరాయింపు అంటే ఏందన్న ప్రశ్నకు హైకోర్టు ఇచ్చిన సమాధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. స్పీకర్ రాజ్యాంగబద్ధమైన అధికారి అయినప్పటికీ, పదో షెడ్యూల్ కింద ఆయన ఇచ్చిన నిర్ణయం న్యాయ సమీక్షకు అతీతం కాదని తాజాగా న్యాయస్థానం తీర్పు స్పష్టం చేసింది. హైకోర్టు ద్వారా తీర్పుతో చట్టసభల్లో అత్యున్నతమైన స్థానంపై మచ్చపడినట్టయింది.
రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఫిరాయింపులను నిరోధించడానికి తీసుకొచ్చిన వ్యవస్థ. ఒక పార్టీ గుర్తుపై ఎన్నికైన ప్రజాప్రతినిధి తన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నా, పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసినా కొన్ని పరిస్థితుల్లో అనర్హతకు గురవుతాడు. ఇదే అంశం స్పీకర్ గడ్డం ప్రసాద్‌రావుకు, ప్రభుత్వానికి కలిసివచ్చింది. కండువాలు కప్పుకోవడం, పేపర్లలో వార్తలు రావడం, వీడియోల్లో బహిరంగంగా మాట్లాడటం ఫిరాయింపు కిందకు రాదని చెప్పిన తీర్పు ఫిరాయింపు చట్టానికి కొత్త భాష్యం చెప్పింది. కేవలం విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తే తప్ప ఫిరాయింపుపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా దేశంలోని శాసనసభలు, శాసనమండళ్లు, చివరకు లోక్‌సభ, రాజ్యసభకు కూడా సరికొత్త దారిని చూపించారు.
ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఫిరాయింపులను యథేచ్ఛగా ప్రోత్సహించడానికి రాచమార్గాన్ని పరిచారు. ఫిరాయింపు చట్టంలో అతి పెద్ద సమస్య ఏందంటే..స్పీకర్ లేదా చైర్మన్‌కు తప్పనిసరిగా నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేకపోవడం. రాజకీయాల్లో ఫిరాయింపు జరిగిన క్షణంలోనే రాజకీయ సమీకరణలు మారిపోతాయి. కానీ అనర్హతపై నిర్ణయం రావడానికి కొన్నేండ్లు పడుతుంది. ఫిరాయించిన ఎమ్మెల్యే శాసనసభలో కొనసాగుతారు. ప్రభుత్వానికి మద్దతు ఇస్తారు. పదవులు పొందుతారు. అధికారపక్ష కార్యక్రమాల్లో పాల్గొంటారు. కానీ అతని సభ్యత్వంపై తుది నిర్ణయం మాత్రం పెండింగ్‌లోనే ఉంటుంది. ఇదే ఫిరాయింపుల చట్టాన్ని పూర్తిగా బలహీనపరిచే ప్రధాన అంశం. తెలంగాణలో కూడా ఇదే జరిగింది.
ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ 2024లోనే పిటిషన్లను దాఖలు చేసింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత కూడా విచారణ ప్రక్రియ ముందుకు సాగకపోవడంపై వివాదం కొనసాగింది. చివరకు 2025 జూలైలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. తర్వాత గడువులపై మరింత ఒత్తిడి పెరిగింది. 2026 ఫిబ్రవరిలో కూడా మూడు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు పాటించకపోతే ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది.
అంటే పదో షెడ్యూల్లో ఉన్న విచక్షణాధికారాలకు న్యాయవ్యవస్థ గడువు విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు ఫిరాయింపు వ్యవహారాల్లో ఒక సాధారణ రాజకీయ లెక్క ఉండేది. ముందుగా ఫిరాయిస్తారు, బాధిత పార్టీ ఫిర్యాదు చేస్తుంది, కానీ నిర్ణయం రాదు, ఫిరాయింపుదారులు పదవులు ఎంజాయ్ చేస్తారు. కోర్టుకు వెళ్లినా తీర్పు వచ్చేసరికి మళ్లీ ఎన్నికలు వచ్చేస్తాయి. కానీ ఇప్పుడు హైకోర్టు తీర్పు ఆ లెక్కలో ఒక ముఖ్యమైన గీత గీసింది.
కోవెల సంతోష్ కుమార్