హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : రెండు, మూడు రోజుల్లో ఈహెచ్ఎస్ ట్రస్టు ఏర్పాటుచేస్తాం. ఏడు రోజుల్లో మార్గదర్శకాలిస్తాం. పది రోజుల్లో కార్డులిచ్చి ఉచిత వైద్యాన్ని అందిస్తాం. ఇదీ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలకు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీ. జూన్ 1న ప్రభుత్వం హామీ ఇవ్వగా, రెండు, మూడు రోజులంటే జూన్ 4వ తేదీకి గడువు ముగిసి 7వ తేదీ వచ్చింది. కానీ, ఇంతవరకు ట్రస్టును ఏర్పాటు చేయలేదు, మార్గదర్శకాలివ్వలేదు. దీంతో హెల్త్‌కార్డు ఇచ్చేదెప్పుడో? ఉద్యోగులకు ఉచిత వైద్యం అందేదెప్పుడో? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జూన్ నుంచి ప్రీమియం వసూలు చేస్తామన్న సర్కార్, మే నుంచే కోత విధించింది. ఈ నెల ప్రీమియం చెల్లించినా రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉచిత వైద్యానికి నోచుకోలేకపోతున్నారు.
ఎన్నాళ్లు ఎదురుచూపులు..
హెల్త్‌కార్డుల కోసం రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు ఎదురుచూపులు తప్పడంలేదు. 2023 నుంచి నిరీక్షించాల్సిన పరిస్థితి. ప్రతిసారి చర్చలు జరుపడం, ఇస్తామనడం తప్ప పురోగతి లేదు. 2025 సెప్టెంబర్ 1న జేఏసీ నేతలతో సర్కార్ చర్చలు జరిపింది. వారంలో హెల్త్‌కార్డుల విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పింది. సరిగ్గా వారం గడిచాక ఈ పథకంపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. తీరా కొత్త కథను తెరపైకి తెచ్చారు. ఈహెచ్ఎస్ స్కీమ్‌పై ఇతర రాష్ర్టాల్లో అధ్యయనం చేసి నివేదిక తెప్పించుకుంటామన్నారు. ఆ తర్వాత మంత్రుల సబ్ కమిటీ చర్చల్లోనూ హెల్త్కార్డులిస్తామన్నారు. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో హెల్త్‌కార్డులకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. జూన్ 2 నుంచి హెల్త్కార్డులిస్తామని చెప్పారు. ఇదే అంశంపై జూన్ 1న సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. చివరికి ఈ గడువు కూడా ముగిసింది. ఇంత వరకు కార్డులు మాత్రం రాలేదు. నిమ్స్, గాంధీ, ఉస్మానియాలో తప్ప ఎక్కడా ఉద్యోగులకు వైద్యం అందడంలేదు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈహెచ్ఎస్ స్కీమ్ అమలుకు కేసీఆర్ సర్కార్ జీవో-186 జారీ చేసింది. అంతలోనే ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ సర్కార్ కేవ లం మార్గదర్శకాల జీవో ఇచ్చి ఉద్యోగులు, స ర్కార్ వాటాను ట్రస్టులో జమ చేయడం, కా ర్డులిచ్చి వైద్యం అందించడం మాత్రమే మిగిలింది. ఈ రెండు పనుల కోసం రెండేండ్లు దా టినా ముందడుగు పడకపోవడం గమనార్హం.
ఇప్పటికీ అభ్యంతరాలు..
ఆరుగురు ట్రస్టీలను నియమించాలి : పెన్షనర్స్ జేఏసీ
ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్టులో పెన్షనర్ల నుంచి ఆరుగురు ట్రస్టీలను నియమించాలని తెలంగాణ ప్రభుత్వ పెన్షన్‌దారుల సంయుక్త కార్యాచరణ సమితి(జేఏసీ) డిమాండ్ చేసింది. ఈ స్కీమ్‌లో చేరాలా..? వద్దా ? అనే ఆప్షన్ ఇవ్వాలని, బలవంతంగా చేర్చరాదని కోరింది. జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ శనివారం సీఎస్ రామకృష్ణారావును కలిసి వినతిపత్రం సమర్పించారు. సంవత్సరానికి రెండుసార్లు ఔట్ పేషంట్ ట్రీట్మెంట్ అవకాశం కల్పించాలని, అవసరమైన మందులు ఇవ్వాలని, వైద్య పరీక్షలు కల్పించాలని కోరారు. ఆయుర్వేద, యునానీ, హోమియో, సిద్ధ వైద్య, న్యాచురోపతి వైద్యానికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తిచేశారు.