రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : 2026-27 బడ్జెట్లో సైతం సిరిసిల్ల చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి మొండిచెయ్యి చూపింది. సిరిసిల్ల నేతన్నలు 12 ఏండ్లుగా ఎదురుచూస్తున్న ‘మెగా పవర్‌లూం క్లస్టర్’ జోన్ ఏర్పాటుపై ఎప్పటిలాగే నిర్లక్ష్యం చేసింది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసి విన్నవించినా, ఎన్నోసార్లు లేఖలు రాసినా కేంద్రం బుట్టదాఖలు చేసింది. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ, మెగా పవర్‌లూం క్లస్టర్ సాధించలేకపోవడంపై నేతన్నలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
దేశంలో టెక్స్టైల్ రంగాన్ని బలోపేతం చేయడంతోపాటు మెగా టెక్స్టైల్ పార్కులను చాలెంజ్ మోడ్‌లో ఏర్పాటుచేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వెల్లడించారు. మెగా టెక్స్టైల్ పార్కుల ఏర్పాటు, నేత కార్మికుల నైపుణ్య అభివృద్ధికి సమర్థ 2.0 పథకాన్ని మరింత సమర్థంగా అమలుచేస్తామని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ గ్రామ్ స్వరాజ్ పథకం ద్వారా ఖాదీ, హ్యాండ్లూమ్ రంగాలను ప్రోత్సహించేలా కొత్త పథకం తీసుకొచ్చారు. వచ్చే ఐదేండ్లలో టెక్స్టైల్ రంగానికి రూ.10వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. అయితే, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మెగా టెక్స్టైల్ పార్క్, క్లస్టర్ ఏర్పాటు గురించి ప్రస్తావించలేదు. జౌళిరంగానికి ఇవ్వనున్న చేయూతలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఏ మేరకు వాటా లభిస్తుందనే సందిగ్ధంలో నేతకార్మికులు ఉన్నారు. నేత కార్మికులు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తివేయాలని ఎప్పటినుంచో కోరుతున్నా ఈసారి కూడా మోక్షం కలుగలేదు.
కేంద్ర బడ్జెట్లో సిరిసిల్ల నేతన్నల గోడు ప్రభుత్వం వినలేదు. 30 వేలకుపైగా పవర్‌లూమ్స్ కలిగి ఉండి, వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న సిరిసిల్లకు మొండిచేయి చూపించింది. గతంలో ‘సిరిసిల్ల కంటే తకువ సామర్థ్యం, తకువ కార్మిక శక్తి ఉన్న ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతాలకు మెగా క్లస్టర్లను మంజూరు చేసిన కేంద్రం.. అన్ని అర్హతలున్న సిరిసిల్లను పకనపెట్టడం ప్రాంతీయ వివక్షగా భావిస్తున్నారు. కేసీఆర్ హయాంలో మెగా క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయింపు, నిరంతర విద్యుత్తు, నీరు, సింగిల్ విండో అనుమతులు, రాష్ట్ర స్థాయి ప్రోత్సాహకాలు.. ఇలా ప్రతి ఒక అర్హతను పూర్తి చేసినప్పటికీ, కేంద్రం మంజూరు చేయకపోవడంపై విమర్శలొస్తున్నాయి. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా, ఇద్దరు కేంద్ర మంత్రులున్నా సిరిసిల్ల నేతన్నల గోడును వినిపించడంలో విఫలమయ్యారనే అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో సిరిసిల్ల నేతన్నల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో వాటిని నివారించడానికి 2013లో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సిరిసిల్లలో మెగా పవర్‌లూం క్టస్టర్ టెక్స్టైల్ జోన్ ఏర్పాటు చేసి ఇక్కడి నేత కార్మికులకు ఉపాధి పరిశ్రమల ఏర్పాటు చేయాలని భావించారు. అప్పటి కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు, అప్పటి ఎంపీ పొన్నం ప్రభాకర్‌తో కలిసి టెక్స్టైల్ పార్కును సందర్శించారు. ఆ సందర్భంగా మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి హామీని ఇచ్చారు. ఇందుకోసం తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని టెక్స్టైల్ పార్కులో 15 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.
అయితే, ఆ తరువాత కేంద్రంలో ప్రభుత్వం మారిపోవడం, బీజేపీ సర్కార్ రావడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. 2016 బడ్జెట్ సమయంలో అప్పటి రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ మూడుసార్లు ఢిల్లీ వెళ్లి, కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్‌ను ప్రత్యేకంగా కలిసి విన్నవించారు. మెగా పవర్‌లూం క్లస్టర్ ప్రతిపాదనలను అప్పటి కేంద్ర అర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి పంపిస్తామని గంగ్వార్ తెలిపారు. దీంతో మెగా పవర్‌లూం క్లస్టర్ దక్కుతుందని ఆశపడ్డారు. కానీ, మొదటి విడతలో దేశంలో 5 మెగా పవర్‌లూం క్లస్టర్లు ప్రకటించిన కేంద్రం, సిరిసిల్లకు మొండిచేయి చూపింది. 2017లో బడ్జెట్ సమయంలోనూ కేటీఆర్, అప్పటి ఎంపీ వినోద్‌కుమార్ కలిసి చేనేత జౌళి శాఖ మంత్రి స్మృతిఇరానీని కలిసి మెగా పవర్‌లూం క్లస్టర్ మంజూరు చేయాలని విన్నవించారు. అయినప్పటికీ మోక్షం లభించలేదు. అప్పటి నుంచి 2018- 2025 వరకు ప్రవేశపట్టిన కేంద్ర బడ్జెట్లలోనూ సిరిసిల్ల ఊసెత్తలేదు. ఈసారి కూడా అదే పరిస్థితి ఎదురైంది.
తెలంగాణలోనే అత్యధిక మరమగ్గాలు ఉన్న సిరిస్లిలపై వివక్ష ఎందుకు? మెగా పవర్‌లూం క్లస్టర్, టెక్స్టైల్ జోన్ ఏర్పాటైతే ఇక్కడి కార్మికులకు మేలు జరుగుతుంది. కానీ, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయం. కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన నియోజకవర్గ పరిధిలోని సిరిసిల్లలను పట్టించుకోకపోవడం వల్లనే మెగా పవర్‌లూం క్లస్టర్ రాలేదు. ఎంపీగా, మంత్రిగా ఉన్నా బండి సంజయ్ కార్మికులకు లాభం చేయడం లేదు. 20 వేల మంది కార్మికులకు ప్రయోజనం కలిగే పవర్‌లూం క్లస్టర్ రాకపోవడం ముమ్మాటికీ బండి సంజయ్ వైఫల్యమే. వెంటనే ఆయన రాజీనామా చేయాలి.