పెద్దపల్లి రూరల్, జూలై 8 : తమ గ్రామంలో శ్మశాన వాటిక స్థలం కూడా ఉంచరా? సమాధులను కూల్చేస్తే పూర్వీకుల జ్ఞాపకాలు ఎలా? అంటూ పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామస్థులు అధికారులను ప్రశ్నించారు. గ్రామ శివారులోని సర్వేనంబర్ 1072లో గతంలో శ్మశాన వాటికపేరుతో సమాధులు పెట్టుకునేందుకు కొంత స్థలాన్ని స్థానిక రైతు వేదిక సమీపంలో వదిలేసి వైకుంఠధామం నిర్మించారు. వదిలేసిన స్థలంలోని నాలుగు ఎకరాల్లో సోలార్ ప్లాంటు ఏర్పాటు చేయాలని కలెక్టర్ నుంచి ఉత్తర్వులు రాగా..
పెద్దపల్లి మండలం అప్పన్నపేట సింగిల్ విండో ఆధ్వర్యంలో చైర్మన్, సీఈవో, డైరెక్టర్లు రెండు రోజులుగా చదును చేయిస్తున్నారు. ఆ ప్రాంతంలో సమాధి చేసిన వారి అస్థికలు మంగళవారం బయటపడడంతో గమనించిన గ్రామస్థులు పనులపై అభ్యంతరం వ్యక్తంచేశారు. తమ ఊరి శ్మశానికి సైతం భూములను ఉంచరా? అంటూ ఆందోళనకు దిగారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ను మరో చోటకు మార్చాలని, ఇక్కడి స్థలాన్ని శ్మశాన వాటికకే వదిలి పెట్టాలని కలెక్టర్, అధికారులను కోరారు.