హైదరాబాద్, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ ) : తెలంగాణ మిర్చి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాష్ట్రంలోని రైతుల పరిస్థితిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ నుంచి, అటు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ మిర్చి రైతులకు మద్దతు లేకుండాపోయింది. ఇదే దశలో ఏపీ మిర్చి రైతులకు మాత్రం కేంద్రం నుంచి ఊరట లభించింది. అక్కడి మార్కెట్లో మిర్చి ధర పతనమైన నేపథ్యంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం(ఎంఐఎస్) కింద క్వింటాకు రూ.11,781 చొప్పున ధర కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని టీడీపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.
తొలుత మొత్తం పంట ఉత్పత్తిలో 25 శాతం కొనుగోలుకు అంగీకరించిందని, అవసరమైతే మరింత పం ట కొనుగోలుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. దీంతో ఏపీ బహిరంగ మార్కెట్లో మిర్చి పంటకు కొంత డిమాండ్ పెరిగే అవకాశం ఏర్పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితి లేకుండా పోయిం ది. ఏపీ ప్రభుత్వం అక్కడి రైతుల కోసం కేంద్రంతో మాట్లాడితే.. తెలంగాణ సర్కారు మాత్రం రైతులను గాలికి వదిలేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. కేవలం లేఖ రాసి చేతులు దులిపేసుకున్నదనే విమర్శలు ఉన్నాయి. దీం తో కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంపై మిర్చి రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర సర్కారు వై ఫల్యం.. తమ పాలిట శాపంగా మారిందని వారు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా రా ష్ట్ర ప్రభుత్వం కల్పించుకొని కేంద్రంతో మాట్లాడి తెలంగాణ మిర్చి పంటను కూడా కొనుగోలు చేసేలా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.