హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : టీచర్లకు విద్యాశాఖ ఇప్పిస్తున్న శిక్షణలు శిక్షలను తలపిస్తున్నాయి. విద్యాసంవత్సరం మధ్యలో శిక్షణపై టీచర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ప్రైవేట్ ఎన్జీవోల చేత శిక్షణ ఇప్పించడంపై టీచర్ల సంఘాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి 22 రోజులపాటు విద్యాశాఖ శిక్షణ ఇచ్చింది. అది కూడా డిసెంబర్ వరకే. ఇక ఏప్రిల్ లోపు ఇంకెన్ని ఉంటాయో అన్న ప్రశ్నలు వస్తున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే మేలో టీచర్లకు విద్యాశాఖ శిక్షణ ఇచ్చింది. మొదటి విడతగా మే 13 నుంచి 17 వరకు ఐదు రోజులపాటు 17వేలకు పైగా టీచర్లకు శిక్షణ ఇచ్చారు. రెండో విడతలో మే 20 నుంచి 24 వరకు ఐదు రోజులపాటు 89వేలకు పైగా టీచర్లకు విద్యాశాఖ శిక్షణ ఇచ్చింది.
మొత్తంగా 1.22లక్షల మంది టీచర్లకు విద్యాశాఖ శిక్షణ ఇచ్చింది. బోధన సమయం వృథాకాకుండా టీచర్లకు వేసవి సెలవుల్లోనే శిక్షణ ఇస్తున్నాం.. ఆ తర్వాత ఎలాంటి ట్రైనింగ్స్ ఉండవని విద్యాశాఖ ఉన్నతాధికారులు పలుమార్లు ప్రకటించారు. కానీ బడులు ప్రారంభమైన తర్వాత కూడా పాఠశాల గ్రంథాలయాల, రీడింగ్ కార్నర్స్ బలోపేతం పేరిట జూలై 23న జిల్లా స్థాయిలో శిక్షణ ఇచ్చారు. ఒక్కో స్కూల్ కాంప్లెక్స్‌కు ఇద్దరు టీచర్లను ఎంపికచేసి శిక్షణ ఇచ్చారు.
ఇది ముగిసిన తర్వాత జిల్లా స్థాయి రిసోర్స్‌పర్సన్స్‌కు ఆగస్టు 4 నుంచి 7 వరకు కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ పేరిట శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత ఖాన్ అకాడమీతో ఒప్పందంలో భాగంగా అక్టోబర్ 14,15 తేదీల్లో హెచ్ఎంలకు ఆన్లైన్ ఓరియంటేషన్ నిర్వహించారు. అక్టోబర్ 27 నుంచి 30 వరకు గణితం, సైన్స్ టీచర్లకు శిక్షణ ఇచ్చారు. ఫిజిక్స్‌వాలా ఎంవోయూలో భాగంగా టీచర్లకు శిక్షణ ఇచ్చారు. ఖాన్ అకాడమీ, ఫిజిక్స్‌వాలా సంస్థల పేరిట శిక్షణలు ఇవ్వడంపై టీచర్లు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి శిక్షణలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
టీచర్లను బోధనేతర పనుల నుంచి విముక్తి చేయాలి. ఫిజిక్స్‌వాలా, ఖాన్ అకాడమీ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ట్రైనింగ్ పేరిట విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. విద్యారంగంలో ఎన్జీవోల జోక్యం ఆందోళనకరం. ఆన్లైన్ నివేదికలు పంపించే పనిని టీచర్లకే అప్పగించడంతో పనిభారం పెరుగుతున్నది. ప్రత్యేకంగా బోధనేతర సిబ్బందిని కేటాయించాలి.
– చావ రవి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
శిక్షణలు, కాంప్లెక్స్ సమావేశాలు, పేరెంట్ టీచర్ మీటింగ్స్, ఎన్నికలు, సర్వేలతోనే సగం సమయం వృథా అయ్యింది. సైన్స్ ఫెయిర్ నిర్వహణపైనా శిక్షణ ఇచ్చారు. విద్యాసంవత్సరం మధ్యలో శిక్షణలు ఉండవని ప్రకటించి.. అధికారులే ఉల్లంఘిస్తున్నారు. సింగిల్ టీచర్ , జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లు మన దగ్గరే అధికం. సర్కారు బడులపై ప్రజల్లో విశ్వాసం, నమ్మకం పోగొట్టేలా అధికారుల చర్యలు ఉన్నాయి. శిక్షణ విషయంలో అధికారుల తీరును వ్యతిరేకిస్తున్నాం. అనవసర ట్రైనింగ్స్ రద్దుచేయాలి.
– సదానంద్‌గౌడ్, ఎస్టీయూ టీఎస్