మహబూబ్‌నగర్, జూన్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గోదావరి, కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతామని చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. పొరుగు రాష్ర్టాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులకు పరిశీలించడం వెనుక మర్మం ఏమిటో అంతుచిక్కడం లేదు. తాజాగా కృష్ణా, భీమా నదులపై కర్ణాటక ప్రభుత్వం సరిహద్దుల్లో అక్రమంగా నిర్మిస్తున్న బ్రిడ్జి కం బరాజ్‌లపై ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు రెండు హెలికాప్టర్లలో వెళ్లి ఏరియల్ వ్యూ చేయడం వెనుక ఉద్దేశమేమిటో అర్థం కావడం లేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదులను చెరబడుతూ.. కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని బనకచర్ల-నల్లమల్లసాగర్ పేరుతో భారీ జలదోపిడీకి రంగం సిద్ధం చేస్తుండగా, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం రాష్ట్ర, పాలమూరు ప్రయోజనాలు అంటూ దీర్ఘాలు తీస్తున్నారు.
త్వరలో తీపి కబురు చెబుతానంటూనే పక్కింట్లో కోడికూర చేస్తే.. ఎందుకు కోడికూర చేశావని అడుగుతామా? అని పరోక్షంగా చంద్రబాబును వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో ఆ రాష్ట్రం అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోకుండా, కలిసి కడితే వాటాలు వస్తాయని కొత్త భాష్యం చెప్తున్నారు. ఇప్పటికే జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి చుక్కనీరు రాకుండా ఎక్కడికక్కడే కర్ణాటక ప్రభుత్వం బ్రిడ్జి కం బరాజ్‌ల పేరుతో అక్రమంగా, అడ్డగోలుగా అడ్డుకట్టలు వేసింది.
తాజాగా తెలంగాణ-కర్ణాటక సరిహద్దు చివరి కిలోమీటర్ దగ్గర కూడా బ్రిడ్జి కం బరాజ్‌లను నిర్మిస్తూ జూరాల ప్రాజెక్టు ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నది. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి వంత పాడటం, వాటిని చేపట్టే చోట ఏకంగా హెలికాప్టర్లో నుంచి తొంగిచూడటం వెనుక మతలబు ఏమిటో అర్థం కావడం లేదు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరు జిల్లాలో రెండ్రోజుల ప్రాజెక్టుల పర్యటన నేపథ్యంలో ఇటు కృష్ణా, గోదావరి, అటు తుంగభద్రా నదుల జలవినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అనుమానాస్పదంగా మారింది. ఇందుకు బలం చేకూరుస్తూ.. ‘ముందుగా మన ప్రాజెక్టులకు అనుమతులు, నికర జలాలు కేటాయించుకున్న తర్వాతే సముద్రంలోకి వెళ్లే జలాలపై మీ ఇష్టం అంటూ కరాఖండిగా చెబుతాం’ అంటూనే ‘వాళ్లు వాళ్ల ఇష్టం.. వాళ్ల ప్రాజెక్టులు’ అంటూ పరోక్షంగా గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారు.
ఒకవేళ నిజంగా పాలమూరు-రంగారెడ్డికి 90 టీఎంసీలు.. బచావత్ ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్న నికర జలాలన్నిటికీ ఒప్పుకొంటేనే చర్చలు జరుపుతామని.. దానికి సంబంధించి ఎన్వోసీ ఇస్తేనే ముందుకు వెళ్తామని అంటున్నారు. ఇలా అంటూనే పంచాయితీ కావాలా? పరిష్కారం కావాలా? అనే దానిపై కూడా పరిష్కారమే కావాలని ఒకవేళ పంచాయితీతోనే పరిష్కారం అయితే దానికి కూడా సిద్ధమని అంటున్నారు. ఈ రెండు నాలుకల ధోరణితో రాష్ట్ర ప్రయోజనాలు ఏ మేరకు సిద్ధిస్తాయో? వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ప్రాజెక్టులు చేపట్టి.. నిధులు తీసుకొచ్చి పూర్తి చేసే పరిస్థితి ప్రభుత్వంలో కనిపించడం లేదు.. అలాంటప్పుడు ఇటు గురువు ప్రయోజనాల కోసం ఆంధ్రాకు.. అటు సొంత పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి కర్ణాటకకు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతున్నదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.