కరీంనగర్ కార్పొరేషన్, అక్టోబర్ 17: కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడంలో ఉన్న శ్రద్ధ నగరాన్ని అభివృద్ధి చేసే విషయంలో లేదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. గురువారం బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కలిసి కరీంనగర్ జిల్లా కేంద్రంలో పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతిని కలిసి, తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టవద్దని కోరుతూ వినతిపత్రం అందించారు. అనంతరం కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి సీఎం అస్యూరెన్స్ నిధులను మంజూరు చేయించడంతో పాటు అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు వాల రమణారావు, డిండిగాల మహేశ్, బోనాల శ్రీకాంత్, ఐలేందర్, సాగర్, తోట రాములు పాల్గొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల అద్దె భవనాలకు కిరాయి చెల్లించకపోవడంతో యజమానులు హాస్టల్స్‌కు తాళాలువేసి మూసివేస్తున్నారని, ఇది విద్యార్థుల భవిష్యత్‌కు తీవ్ర నష్టం కలిగిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తక్షణమే భవనాలను తెరిపించి విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా నడిపించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెస్‌చార్జీలు కనీసస్థాయి ఆహారానికి సరిపోవడంలేదని విమర్శించారు. గురుకులాల్లో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే చదువుతున్నందున, వారి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని తక్షణమే అద్దెలు చెల్లించి భవనాల తాళాలను తీయించాలని కోరారు. మెస్‌చార్జీలతో సంబంధం లేకుండా ప్రభుత్వమే సరుకులను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.