మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 21, 2020 , 21:12:26

ఆరేళ్లలో హైదరాబాద్‌కు ఏం చేశారో చెప్పాలి : కేటీఆర్‌

ఆరేళ్లలో హైదరాబాద్‌కు ఏం చేశారో చెప్పాలి : కేటీఆర్‌

హైదరాబాద్‌ : మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆరేళ్లలో హైదరాబాద్‌ నగరానికి ఏం చేసిందో చెప్పాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని కుత్భుల్లాపూర్‌ నియోజకవర్గం ఐడీపీఎల్‌ చౌరస్తాలో మంత్రి కేటీఆర్‌ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్‌షోకు విచ్చేసిన వేలాదిమంది ప్రజలను ఉద్దేశించి కేటీఆర్‌ మాట్లాడారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఐదు ఓట్ల తేడాతో సెంచరీ మిస్‌ అయిందన్నారు. ఈసారి ప్రజల జోష్‌ చూస్తుంటే అది కూడా నెరవేరుతదన్నారు. ఆయా డివిజన్లలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్పొరేటర్‌ అభ్యర్థులుగా పోటిచేస్తున్న విజయ్‌ శేఖర్‌ గౌడ్‌, రషీదాబేగం, పారిజాత గౌరీ, పద్మా ప్రతాప్‌ లను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరారు. 

నగరంలోని ప్రతీ డివిజన్‌లో వందల కోట్ల రూపాయలతో పనులు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో ఈ రోజు పేకాట క్లబ్‌లు లేవు. గుడుంబా గబ్బు లేదు, పోకిరీల పోకడలు లేవు, ఆకతాయిల ఆగడాలు లేవు, మత కల్లోలాలు లేవు, బాంబు పేలుళ్లు లేవు. ఆరేళ్ల నుంచి ఒక్క దినం కాదు కదా ఒక గంట, ఒక్క ఘడియ కూడా కర్ఫ్యూ పెట్టే పరిస్థితి లేదు. ఇది కొంతమందికి నచ్చుతలేదన్నారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నరన్నారు. గల్లీ బాయ్స్‌ కావాల్నా.. ఢిల్లీ బాయ్స్‌ కావాల్నా చెప్పాలన్నారు. కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రియై రెండేళ్లు అవుతుంది. ఆయనగానీ, బీజేపీ ప్రభుత్వంగానీ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ఏం చేశారో చెప్పాలన్నారు. ఇక్కడినుంచి తీసుకునేది రూపాయి.. ఇచ్చేది ఆటానా.. సొమ్మ ఒకడిది.. సోకు ఒకడిది.. మీదికెల్లి ఇది ఇచ్చినం..అది ఇచ్చినమని నరుకుతాఉంటరు. 

నిన్న ఇయాళ ఒకయాన కొత్త బిచ్చగాడు మోపైండు. బండి పోతే బండి ఫ్రీ, కారు పోతే కారు ఫ్రీ, ఇళ్లు పోతే ఇళ్లు ఫ్రీ. ఏది పడితే అది ఫ్రీ అంటున్నడు. మొన్నటి వరదలకు తెలంగాణ ప్రభుత్వం సాయం చేస్తుంటే మోకాలడ్డుపెట్టి సాయం ఇయ్యకుండా చేసింది ఎవరు? పేదవాడి నోటికాడి ముద్ద లాక్కున్నది ఎవరు? మనం ఇస్తుంటే ఆపుతరు.. మీదికెల్లి అది చేస్తం.. ఇది చేస్తం అని ఫోజులు కొడుతరు. అమ్మకు అన్నం పెట్టనోడు.. చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా. పేదవాళ్లకు సాయం చేస్తమంటే కూడా అడ్డంపడుతరు. ఇసోంటోళ్లు కావాల్నా మనకి. ఆలోచించండన్నారు. ఏం చేసినమో చెప్పి ఓటు అడుగుతున్నాం. కేంద్రం నుంచి ఆరేళ్లలో హైదరాబాద్‌కు ఏం చేసినరని మీకు ఓటేయాలని ప్రశ్నించాల్సిందిగా కేటీఆర్‌ పేర్కొన్నారు.