దంతాలపల్లి, జూన్ 14: ‘కారుల్లో వస్తున్నారు. పోతున్నారు బాగానే ఉంది.. కానీ రూ.500కే గ్యాస్ ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఇయ్యలేదు. రూ.1100 పెట్టి గ్యాస్ కొంటున్నం.., కానీ, మా బ్యాంక్ ఖాతాలో రూ.47 మాత్రమే పడుతున్నాయి. ఎందుకు సారు’.. అని కారు ఎక్కి వెళ్లిపోతున్న ఎమ్మె ల్యే రాంచంద్రునాయక్ను మహిళలు అడిగారు.
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి శనివారం వచ్చిన ఆయన పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపత్రాలు ఇచ్చే క్రమంలో మహిళలు ఎమ్మెల్యేను నిలదీశారు. రైతు భరోసా, బోనస్ ఎందుకు ఇస్తలేరు సారూ.. అని ప్రశ్నించారు. గతంలో పెద్దముప్పారంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది.. వాటి సంగతి ఏంది సార్.. అని అడుగగా సీఎంను అడగండి అని సమాధానం చెప్పారు. సమస్యలపై మీరే కదా సీఎంను అడుతారని మహిళలు ఆయన్ని ప్రశ్నించారు.