స్టేషన్ ఘన్పూర్, జనవరి 6: మోదీజీ.. దేశంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ప్రశ్నించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల విషయం అటుంచితే.. కనీసం 16 లక్షల ఉద్యోగాలు కూడా కల్పించలేదని ఆయన విమర్శించారు. శుక్రవారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండలో కడియం ఫౌండేషన్ సహకారంతో కడియం యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సీజన్-3 మెగా క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించకపోగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెడుతూ ఉన్న కొలువులకు ఎసరుపెడుతున్నదని దుయ్యబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు కట్టబెడుతూ కార్పొరేట్లను పెంచిపోషిస్తున్నదని విమర్శించారు.
ప్రధాని మోదీ ప్రజావ్యతిరేక విధానాల వల్ల దేశంలో రోజురోజుకూ నిరుద్యోగం పెరిగిపోతున్నదని, తద్వారా యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సంపత్‌రెడ్డి, మాజీ ఎంపీ సీతారాంనాయక్ పాల్గొన్నారు.